ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 37 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 37వ అధ్యాయము

 1. తన తండ్రి పరదేశిగ స్థిరపడిన కనాను దేశమునందే యాకోబు నివసించెను.

2. అతని వంశీయుల వృత్తాంతమిది. యోసేపు పదునేడేండ్ల ప్రాయమువాడయ్యెను. అతడింకను చిన్నవాడు. సోదరులతో కలిసి తండ్రిమందలను మేపెడివాడు. ఆ సోదరులెవరోకారు, యోసేపు సవతి తల్లులు బిల్హా, జిల్పాల పుత్రులే. అతడు సోదరులుచేసిన చెడుపనులు తండ్రికి చెప్పెను.

3. ముదిమిని పుట్టినవాడు కావున యిస్రాయేలు యోసేపును ఇతర కుమారులకంటె ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగుచేతుల నిలువుటంగీని కుట్టించెను,.

4. తమకంటె ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి.

5. యోసేపు ఒక కల కనెను. దానిని గూర్చి సోదరులకు చెప్పగా వారతనిని మునుపటికంటె ఎక్కువగా ద్వేషింపసాగిరి.

6. యోసేపు సోదరులతో “నేను కన్నకలను గూర్చి చెప్పెదను. వినుడు.

7. మనము పొలములో పనలు కట్టుచుంటిమి. నేను కట్టిన పన చివాలున లేచి నిలువుగా నిలబడెను. మీ పనలేమో దానిచుట్టు చేరి సాగిలబడినవి” అని చెప్పెను.

8. అది విని వారు “ఏమేమి! మాకు రాజువై మా మీద పెత్తనము చేయవలెనను కొనుచున్నావా?” అనిరి. యోసేపు స్వప్నపు సుద్దులను వినిన సోదరులు మునుపటికంటె ఎక్కువగా అతనిని ద్వేషించిరి.

9. యోసేపు మరియొక కల కనెను. సోదరులతో “నేను మరొక కల కంటిని. వినుడు. సూర్యచంద్రులు, పదునొకండు నక్షత్రములు నాకు నమస్కరించెను” అని చెప్పెను.

10. అతడు ఈ కలను గురించి సోదరులతోను, తండ్రితోను చెప్పెను. దానికి తండ్రి “ఇది ఎక్కడికల? నేను, మీ అమ్మ, నీ సోదరులు, మేమందరము వచ్చి నీ ముందు సాష్టాంగ ప్రణామము చేయవలయునాయేమి?” అని మందలించెను.

11. అతని సోదరులు అతనిపై అసూయపడిరి. కాని తండ్రి మాత్రము ఆ కలను మరవలేదు.

12. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి.

13. యిస్రాయేలు యోసేపుతో “నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు గదా! రమ్ము. నిన్నుకూడ వారి దగ్గరకు పంపెదను” అనెను. యోసేపు “నేను సిద్ధముగా ఉన్నాను” అనెను.

14. యిస్రాయేలు “వెళ్ళి నీ సోదరుల యోగక్షేమమును, మందల మంచిచెడ్డలను తెలిసికొని మరలి వచ్చి, నాకేమాట చెప్పుము” అని యోసేపుతో అనెను. ఈ విధముగా యాకోబు యోసేపును హెబ్రోను లోయ నుండి పంపగా అతడు షెకెమునకు వచ్చెను.

15. అక్కడ పొలములో తిరుగుచున్న యోసేపును ఒక మనుష్యుడు కలిసికొని “నీవేమి వెదకుచున్నావు?” అని అడిగెను.

16. యోసేపు అతనితో “నేను నా సోదరులను వెదకుచున్నాను. వారెక్కడ మందలను మేపుచున్నారో తెలిసిన దయచేసి చెప్పుడు” అనెను.

17. అంతట ఆ మనుష్యుడు “వారు ఇక్కడినుండి సాగి పోయిరి. దోతాను వెళ్ళుదమని వారిలో వారు అనుకొనుచుండగా వింటిని” అని చెప్పెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి, వారిని దోతానులో చూచెను.

18. వారు అతనిని దూరాన ఉండగనే చూచిరి. అతడు దగ్గరకు రాకమునుపే అతనిని చంపవలెనని కుట్రపన్నిరి.

19. వారు “ఇదిగో! కలలు గనువాడు వచ్చుచున్నాడు.

20. రండు! వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మ్రింగివేసినదని చెప్పుదము. వీని కలలు ఏమగునో చూతము” అని తమలో తాము అనుకొనిరి.

21. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను.

22. “మనకు ఈ రక్తపాతమేల? యోసేపును ఈ అడవియందలి గోతిలో త్రోయుడు. అతనికి ప్రాణహాని చేయకుడు” అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను.

23. యోసేపు సోదరుల దగ్గరకొచ్చెను. వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలువుటంగీని తీసివేసిరి.

24. అతనిని గోతిలో పడదోసిరి. అది వట్టి గొయ్యి. దానిలో నీళ్ళులేవు.

25. అంతట వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదునుండి ఐగుప్తుదేశమునకు పోవు యిష్మాయేలీయుల బిడారు వారి కంటబడెను. యిష్మాయేలీయులు ఒంటెలపై గుగ్గిలమును, బోళమును, లేపనద్రవ్యమును తీసికొనిపోవుచుండిరి.

26. అప్పుడు యూదా తన సోదరులతో "యోసేపును చంపి, అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును?

27. రండు! అతనిని యిష్మాయేలీయులకు అమ్మివేయుదము. మనము అతనికి హానిచేయరాదు. అతడు మన రక్తమాంసములు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా!?” అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి.

28. ఇంతలో మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతిమీదుగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకిలాగిరి. అతనిని ఇరువది వెండినాణెములకు యిష్మాయేలీయులకు అమ్మిరి. యిష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి.

29. పిమ్మట రూబేను గోతిదగ్గరకు వెళ్ళిచూడగా, దానిలో యోసేపు కనబడలేదు.

30. అతడు తన వస్త్రములు చించుకొనుచు, సోదరుల దగ్గరకు వెళ్ళి “అయ్యో! చిన్నవాడు గోతిలో లేడు. ఇక నేనేమి చేయుదును? ఎక్కడికి వెళ్ళుదును?” అని విలపించెను.

31. యోసేపు సోదరులతని పొడువు చేతుల నిలువుటంగీని తీసికొనిరి. ఒక మేకపిల్లను చంపి,  దాని నెత్తుటిలో నిలువుటంగీని ముంచిరి.

32. దానిని తండ్రియొద్దకు తెచ్చి, “ఇది మా కంటబడినది. ఇది నీ కొడుకు అంగీయో కాదో గుర్తింపగలవా?" అని అడిగిరి.

33. యాకోబు దానిని గుర్తుపట్టి “ఇది నా కుమారుని అంగీయే. ఏ మాయదారి మృగమో యోసేపును ముక్కలు ముక్కలుగా చేసి మ్రింగివేసినది” అనెను.

34. అతడు తన వస్త్రములను చించుకొనెను. నడుమునకు గోనెపట్ట కట్టుకొనెను. ఎన్నో రోజులు కొడుకును తలచుకొని అంగలార్చెను.

35. యాకోబు కుమారులు, కుమార్తెలు అతనిని ఓదార్చుటకెంతో ప్రయత్నించిరి. కాని అతనికి కొంచెముకూడ ఓదార్పు కలుగలేదు. “నేను ఇట్లే ఏడ్చుచు ఏడ్చుచు నా కుమారునితో పాటు మృతలోకము చేరెదను” అని యాకోబు అనెను. ఈ విధముగా యాకోబు యోసేపు కొరకు విలపించెను.

36. ఇది ఇట్లుండగా మిద్యానీయులు ఐగుప్తుదేశమున యోసేపును పోతీఫరునకు అమ్మిరి. పోతీఫరు ఫరోరాజు కడనున్న ఉద్యోగి, రాజసంరక్షకులకు నాయకుడు.