1. తాను యాకోబునకు పిల్లలను కనక పోవుటచే రాహేలు తన సోదరిని చూచి కన్నులలో నిప్పులు పోసికొనెను. ఆమె యాకోబుతో “నాకు పిల్లలను కలిగింతువా? లేక నన్ను చావమందువా?” అనెను.
2. యాకోబునకు అరికాలిమంట నడినెత్తి కెక్కెను. అతడు రాహేలుతో “నీ కడుపున కాయ కాయకుండునట్లు చేసినది దేవుడు. నేనేమైనా ఆయన స్థానమున ఉంటినా?” అనెను.
3. అంతట ఆమె అతనితో "ఇదిగో నా దాసి బిల్హా ఉన్నదికదా! నీవు దానితో శయనింపుము. అది నా బదులుగా బిడ్డలను కనును. ఆమెవలన నేనుగూడ పిల్లలతల్లిని అగుదును” అనెను.
4. ఇట్లని ఆమె దాసియైన బిల్హాను అతనికి భార్యగా జేసెను. యాకోబు ఆమెతో శయనించెను.
5. బిల్హా గర్భవతియై యాకోబునకు ఒక పుత్రుని కనెను.
6. రాహేలు “దేవుడు నావైపు మొగ్గి తీర్పుచేసెను. నా మొరాలకించి నాకు కుమారుని ప్రసాదించెను” అనుకొని అతనికి దాను అను పేరు పెట్టెను.
7. రాహేలు దాసి బిల్హా మరల గర్భవతియై యాకోబునకు మరల ఒక కొడుకుని కనెను.
8. అంతట రాహేలు “మా అక్కతో బాగుగా పోరాడితిని చివరకు నేనే నెగ్గితిని” అనుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
9. లేయా తన కడుపు పండుటలేదని తలంచి దాసియయిన జిల్పాను తీసికొనిపోయి యాకోబునకు భార్యగా చేసెను.
10. జిల్పా యాకోబునకు ఒక కొడుకుని కనెను.
11. అదృష్టము కలసివచ్చినదను కొని లేయా అతనికి గాదు అను పేరు పెట్టెను.
12. లేయా దాసియగు జిల్పా యాకోబునకు మరొక కొడుకుని కనెను.
13. అంతట లేయా "నా భాగ్యమే భాగ్యము! స్త్రీలు అదృష్టవతి అని నన్నునెత్తిన బెట్టు కొందురు” అనుకొని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
14. గోధుమపంట కోతకు వచ్చినపుడు రూబేను వెళ్ళిపొలములో "పుత్రదాత” వృక్షము పండ్లు చూచెను. వాటిని కోసికొని వచ్చి తల్లికిచ్చెను. కుమారుడు తెచ్చిన పండ్లలో కొన్నింటి నిమ్మని రాహేలు లేయాను అడిగెను.
15. దానికి లేయా “నా, మగనిని కొంగున కట్టుకొంటివే! అది చాలక నా కుమారుడు తెచ్చిన 'పుత్రదాత' పండ్లనుకూడ అడుగుచుంటివా?” అనెను. అంతట రాహేలు “నీ కుమారుడు తెచ్చిన పండ్ల నిచ్చెదవేని నీవు ఈ రాత్రి యాకోబుతో శయనింప వచ్చును” అని పలికెను.
16. ప్రొద్దుగూకిన తరువాత యాకోబు పొలమునుండి ఇంటికి వచ్చునప్పుడు లేయా అతనికి ఎదురు వెళ్ళి “నీవు ఈ రాత్రి నాతో గడపవలయును. నిన్ను నా కుమారుడు తెచ్చిన పుత్రదాతపండ్లకు కొంటిని” అనెను. ఆ రాత్రి యాకోబు ఆమెతో శయనించెను.
17. దేవుడు ఆమె మొర ఆలకించెను. ఆమె గర్భవతియై ఐదవకొడుకుని కనెను.
18. లేయా “నేను నా దాసిని నా నాథునికి అప్పగించితిని. దానికి దేవుడు ఈ ఎదురు మేలు చేసెను” అనుకొని అతనికి యిస్సాఖారు అను పేరు పెట్టెను.
19. లేయా మరల గర్భవతియై ఆరవ కొడుకును కనెను.
20. ఆమె “దేవుడు నాకు మంచి కానుకిచ్చెను. నేను ఆరుగురు కుమారులను కనిన మగనాలిని, ఇక నా మగడు నన్ను తప్పక ఆదరించును” అని అనుకొని అతనికి సెబూలూను ' అను పేరు పెట్టెను.
21. ఆ తరువాత లేయా ఒక కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.
22. దేవుడు రాహేలును మరచిపోలేదు. ఆమె మొర నాలకించి ఆమె కడుపుపండించెను.
23. అందు చేత రాహేలుకూడ గర్భవతియై ఒక కొడుకును కనెను. “దేవుడు నా అవమానమును తొలగించి నేను తలయెత్తు కొనునట్లు చేసెను” అని అనుకొనెను.
24. "యావే నా కడుపున మరొక కాయకాచునట్లు చేయును గాక!” అని అనుకొని అతనికి యోసేపు' అను పేరు పెట్టెను.
25. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో "నన్ను పంపివేయుము. మా దేశమందలి మా ఇంటికి తిరిగి పోవలయుననుకొనుచున్నాను.
26. పిల్లలతోపాటు నా భార్యలను నాకు అప్పగింపుము. నేను వారికొరకే నీకు సేవచేసితిని. నేను వెళ్ళిపోయెదను. నేను ఎంత సేవచేసితినో నీకు తెలియును” అనెను.
27. లాబాను అతనితో “దయ చేసి నా మాటకూడ వినుము. దేవుడు నీ వలననే నాకు మేలుచేసెనని శకునములబట్టి తెలిసికొంటిని.
28. నేను నీకు ఈయవలసిన జీతము ఎంతో నీవే చెప్పుము. దానిని ఇచ్చివేయుదును” అనెను.
29. దానికి యాకోబు “నేనెట్లు చాకిరిచేసితినో నీకు తెలియును. నీ గొఱ్ఱెలమందలను ఎంత జాగ్రత్తతో పెంచితినో నీవెరుగుదువు.
30. నేను వచ్చినప్పుడు నీకు గొఱ్ఱెలు తక్కువగా ఉండెడివి. కాని ఈనాడో! అవి లెక్కకు మిక్కుటముగా పెరిగినవి. నేను కాలు మోపిన చోట్లనెల్ల దేవుడు నీకు మేలుచేసెను. ఇక నేనుకూడ నా కుటుంబముకొరకు నాలుగు డబ్బులు కూడబెట్టుకొను సమయమొచ్చినదిగదా?” అనెను.
31. లాబాను “అయినచో నేను నీకేమి ఈయవలయునో చెప్పుము” అనెను. దానికి యాకోబు “నీవు నాకు ఏమియు ఈయవలదు. నేను చెప్పబోవు మాటలను నీవు ఒప్పుకొనుము. ఎప్పటిమాదిరిగా నీ మందలను మేపుదును.
32. ఈనాడు వెళ్ళి నీ మందలన్నిటిని చూచెదను. వానినుండి నల్లగొఱ్ఱెపిల్లలన్నిటిని, పొడలు, మచ్చలు ఉన్న మేకపిల్లలన్నిటిని ఎన్నుకొందును. అవియే నాకు వేతనము.
33. ఇదే నా సత్యమును రుజువు చేయును. తరువాత మన మిద్దరము కూర్చుండి నా జీతనాతములను సరిచూచు కొనునప్పుడు, నా మందలో నల్లగాలేని గొఱ్ఱెలు, పొడలుమచ్చలులేని మేకలు ఉన్నచో, వానిని నేను నీ మందనుండి దొంగిలించినట్లే అనుకొనుము” అనెను.
34. అంతట లాబాను “ఒప్పుకొంటిని. నీ మాట చొప్పుననే కానిమ్ము” అనెను.
35. ఆనాడే లాబాను తెల్లచారలు మచ్చలుగల మేకపోతులను, తెల్లపొడలు మచ్చలు గల ఆడుమేకలను, నల్లగొఱ్ఱె పిల్లలను వేరు చేసి తన కుమారులకు అప్పగించెను.
36. లాబాను వానిని దూరముగా కొనిపోయి, యాకోబు మందల నుండి మూడు రోజులు ప్రయాణము పట్టు చోట ఉంచెను. యాకోబు మాత్రము మిగిలిన లాబాను మందలను మేపుచుండెను.
37. యాకోబు రావి, బాదము, బూరుగుచెట్ల పచ్చిపుల్లలను తీసికొనివచ్చి, వానిలోని తెల్లచారలు కనబడునట్లు పై బెరడు ఒలిచెను.
38. అతడు వానిని మందలు నీళ్ళు త్రాగుటకు వచ్చుచోట ఉన్న తొట్లలోనిలువుగ పాతెను. యెదకువచ్చిన ఆడుమేకలు నీళ్ళు త్రాగుటకు వచ్చినప్పుడు ఆ పుల్లలు వానికెదురుగా నుండెను.
39. పోతులు దాటినపుడు, ఆ పుల్లలు ఆడుమేకలకు ఎదురుగానుండెను. కనుక వానికి తెల్లవారలు పొడలుమచ్చలుగల పిల్లలుపుట్టెను.
40. అతడు గొఱ్ఱెలను వేరుచేసి వానిని లాబాను మందలో నల్లరంగు నల్లమచ్చలుగల వానివైపు తోలెను. ఆ గొఱ్ఱెలకు నల్లపిల్లలు పుట్టెను. ఈ రీతిగా అతడు సొంత మందలను పెంచి, వానిని లాబాను మందలో చేర్చకుండ విడిగా మేపుకొనెను.
41. బలముగల పశువులు ఎదకు వచ్చినప్పుడు మాత్రమే అతడు నీళ్ళతొట్లలో పుల్లలుంచెను. అవి పుల్లలయెదుట కట్టెను.
42. బక్కమేకల యెదుట పుల్లలు పాతలేదు. ఈ విధముగా బక్కపిల్లలు లాబానుకు వచ్చెను. బలిసిన పిల్లలు యాకోబునకు వచ్చెను.
43. ఈ ప్రకారముగా యాకోబు మహాసంపన్నుడై పెక్కు మందలను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను సంపాదించుకొనెను.