1. ఈసాకు పండుముదుసలి అయ్యెను. చూపు ఆననంతగా అతని కన్నులు మసకబడెను. అతడు “కుమారా!" అని పెద్ద కొడుకు ఏసావును పిలిచెను. ఏసావు “చిత్తము తండ్రీ!” అనెను.
2. ఈసాకు అతనితో “నాయనా! వినుము. నేను కాటికి కాళ్ళు చాచుకొనియుంటిని. ఎప్పుడు చావువచ్చునో నాకు తెలియదు.
3. నీ వేటపనిముట్లు, అమ్ములపొది, విల్లుతీసికొని అడవికిపోయి వేటాడి జింకమాంసము తీసికొనిరా!
4. దానిని నాకు రుచించునట్లుగా వండి వడ్డింపుము. నేను తృప్తిగా భుజించి నిన్ను దీవించి కన్నుమూసెదను” అనెను.
5. ఈసాకు తన కుమారుడు ఏసావుతో మాట్లాడినదంతయు రిబ్కా వినుచుండెను. వేటాడి జింకమాంసము తెచ్చుటకై ఏసావు అడవికి వెళ్ళెను.
6. అప్పుడు రిబ్కా యాకోబుతో “మీ తండ్రి మీ అన్న ఏసావుతో మాట్లాడుట నేనువింటిని.
7. 'జింక మాంసము తెచ్చి నాకు రుచించునట్లు వండిపెట్టుము. నేనుతిని, కన్ను మూయకముందే దైవసన్నిధిని నీకు దీవెనలు పలుకుదును' అని మీ తండ్రి ఏసావుతో చెప్పెను.
8. నాయనా! నా మాటవిని నేను ఆజ్ఞాపించి నట్లు చేయుము.
9. మందకుపోయి రెండు మంచి మేకపిల్లలను తీసికొనిరమ్ము. వానితో మీ తండ్రికి రుచించు భోజనము సిద్ధముచేయుదును.
10. నీవు దానిని మీ తండ్రి కడకు తీసికొనిపొమ్ము. మరణింపక ముందే దానిని ఆరగించి మీ తండ్రి నీకు దీవెనలు పలుకును” అనెను.
11. యాకోబు రిబ్కాతో “మరి అన్నయ్య ఒడలంతా వెండ్రుకలపుట్ట, నా ఒడలేమో నున్నగా ఉన్నది గదా!
12. ఒకవేళ తండ్రి నన్ను తడిమిచూచిన ఏమగును? నేను తనను వంచించినట్లు తెలిసికొనడా? దీవెనలమాట దేవుడెరుగు. తండ్రికోపము లేనిపోని శాపమై నా మెడకు చుట్టుకొనునేమో?” అనెను.
13. అతని తల్లి “ఆ శాపమేదో నాకే తగులనిమ్ము. నీవు మాత్రము నేను చెప్పినట్లు చేయుము. పోయి మేకపిల్లలను తీసికొనిరా!” అనెను.
14. యాకోబు పోయి మేకపిల్లలను తెచ్చి తల్లికిచ్చెను. వానితో ఆమె అతని తండ్రికి రుచించు భోజనము తయారుచేసెను.
15. పెద్ద కుమారుడు ఏసావు కట్టుకొను మేలి ఉడుపులు ఇంటిలో తనదగ్గరనే ఉండుటచే, రిబ్కా వానిని బయటకి తీసి, ధరించుటకై చిన్నకుమారునకు ఇచ్చెను.
16. చంపిన మేకపిల్లలతోళ్ళతో యాకోబు చేతులను, నున్ననిమెడను కప్పెను.
17. తాను సిద్ధముచేసిన రుచికరమాంసమును, రొట్టెను యాకోబు చేతికిచ్చెను.
18. యాకోబు తండ్రి కడకువచ్చి "తండ్రీ” అని పిలిచెను. ఈసాకు "కుమారా! ఎవరు నీవు?” అని అడిగెను.
19. యాకోబు తండ్రితో “నేను ఏసావును. నీ పెద్దకుమారుడను. నీవు చెప్పినట్టు చేసితిని. లేచి కూర్చుండుము. నేను తెచ్చిన జింక మాంసమును తినుము. తిని దీవెనలు పలుకుము” అనెను.
20. అంతట ఈసాకు “ఇంత తొందరగా మాంసము నీ కెట్లు దొరికినది?” అని అడిగెను. దానికి యాకోబు “నీ దేవుడైన ప్రభువే దానిని నాయొద్దకు పంపెను” అనెను.
21. ఈసాకు యాకోబుతో “నాయనా! దగ్గరకు రా! నిన్ను తడిమిచూచి నీవు ఏసావువో కావో తెలిసి కొందును” అనెను.
22. యాకోబు తండ్రి దగ్గరకు వెళ్ళెను. ఈసాకు అతనిని తడిమిచూచెను. “గొంతు యాకోబు గొంతువలె ఉన్నదిగాని, చేతులు మాత్రము ఏసావు చేతులే” అనెను.
23. యాకోబు చేతులుగూడ ఏసావు చేతులవలె వెండ్రులకతో నిండియుండుటచే ఈసాకు అతనిని గుర్తుపట్టలేకపోయెను. కావున అతనిని దీవింపనెంచి
24. “నీవు నిజముగా నా కుమారుడు. ఏసావువేనా?” అని అడిగెను. దానికి యాకోబు “అవును నేను ఏసావునే” అనెను.
25. అంతట ఈసాకు “తిని దీవెనలు పలుకుదును. ఏదీ! నీవు తెచ్చిన జింకమాంసమును తీసికొనిరా!” అనెను. అతడు తెచ్చినప్పుడు దానిని తినెను. యాకోబు ద్రాక్షసారాయమును గూడ అందీయగా తండ్రి త్రాగెను.
26. అతడు యాకోబుతో “నాయనా! దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుము” అనెను.
27. యాకోబు దగ్గరకు వచ్చి తండ్రిని ముద్దు పెట్టుకొనెను. ఈసాకు యాకోబు ధరించిన దుస్తులను వాసన చూచి అతనిని దీవించుచు ఇట్లు పలికెను. “ఇదిగో! నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావివలె ఉన్నది.
28. దేవుడు ఆకాశమంచును కురియించునుగాక! నీ చేలకు చేవనిచ్చునుగాక! ధాన్యమును ద్రాక్షసారాయమును సమృద్దిగా నీకు సమకూర్చునుగాక!
29. ఎల్లజనులు నీకు సేవకులగుదురుగాక! సకలజాతులు నీకు తల ఒగ్గునుగాక! నీవు నీ సోదరులను పాలింతువుగాక! నీ తల్లి బిడ్డలు నీకు సాగిలబడుదురుగాక! నిన్ను శపించినవారు శపింపబడుదురుగాక! నిన్ను దీవించినవారు దీవింపబడుదురుగాక!"
30. ఈసాకు యాకోబును దీవించుట ముగించెను. అతడు తండ్రియగు ఈసాకు సమ్ముఖము నుండి నాలుగడుగులు వేసి వెళ్ళెనో లేదో ఇంతలో అతని అన్న ఏసావు వేటనుండి తిరిగివచ్చెను.
31. అతడు కూడ రుచికర భోజనమును సిద్ధముచేసి తండ్రికి తెచ్చెను. అతడు “తండ్రీ! లేచి కూర్చుండుము. నేను తెచ్చిన జింక మాంసమును తిని నాకు దీవెనలు పలుకుము” అనెను.
32. అతని తండ్రి ఈసాకు “నాయనా! నీవు ఎవరవు?” అని అడిగెను. అతడు “నేను ఏసావును, నీ పెద్దకొడుకును” అనెను.
33. ఆ మాటలు వినగనే ఈసాకు ఒళ్ళు కంపించెను. అతడు "అయినచో వేటాడి జింకమాంసమును తెచ్చిన వారు ఎవరు? నీవు రాకముందే దానినెల్లతింటిని. తిని అతనిని దీవించితిని. ఆ దీవెనకు ఇక తిరుగులేదు” అనెను.
34. తండ్రి చెప్పినమాటలు విని ఏసావు గుండె బద్దలగునట్లుగా వెఱ్ఱికేకవేసి "తండ్రీ! నన్నుగూడ దీవింపుము” అని అడిగెను.
35. కాని ఈసాకు అతనితో “నీ సోదరుడు కపటోపాయముపన్ని వచ్చి నీ బదులుగా తాను దీవెనలు పొందెను” అనెను.
36. అంతట ఏసావు “అతనికి యాకోబు అని సార్థకమైన పేరే పెట్టిరి. అతడు నన్ను మోసగించుట యిది రెండవసారి. అప్పుడేమో నా జ్యేషాధికారమును అపహరించెను. ఇప్పుడేమో నా బదులుగా దీవెనలు పొందెను. తండ్రీ! నాపాలిట ఏయొక్క దీవెనయు మిగులలేదా?” అని అడిగెను.
37. ఈసాకు “నాయనా! అతనిని నీకు అధిపతిగా నియమించితిని. అతని తోడబుట్టిన వారందరిని అతనికి బానిసలనుగా చేసితిని. నాయనా! ధాన్యమును, ద్రాక్షరసమును ఇచ్చి అతనిని సమృద్ధిగా దీవించితిని. నీకు మేలు చేయుటకు ఇంక నాదగ్గర ఏమి మిగిలినది?” అనెను.
38. ఏసావు “నా తండ్రీ! నీ వద్ద ఒక దీవెనయే ఉన్నదా? నన్నుకూడ దీవింపవా?” అని ఈసాకును బతిమాలుకొనుచు గుండె చెదరునట్లు బిగ్గరగా ఏడ్చెను.
39. అప్పుడు అతని తండ్రి ఈసాకు ఇట్లనెను: “నీవు భూసారము కొరవడినచోట ఆకాశపుమంచు కురియనిచోట వసింతువు.
40. నీవు ఖడ్గముచేపట్టి బ్రతుకుదువు. నీ తమ్ముని సేవింతువు. కాని నీవు తిరుగుబాటు చేసిననాడు నీ మెడమీదనుండి అతని కాడివిరిచెదవు."
41. తన బదులుగా దీవెనలు పొందినందులకు ఏసావు యాకోబుమీద పగపట్టెను. అతడు “తండ్రి చావును తలంచుకొని విలపించు దినములు సమీపించుచున్నవి. ఆ తరువాత యాకోబు ప్రాణము తీసెదను” అని తనలో తాననుకొనెను.
42. పెద్ద కొడుకు ఏసావు ఆలోచనలు రిబ్కాకు తెలిసెను. ఆమె చిన్నకొడుకు యాకోబును పిలిచి “మీ అన్న ఏసావు నిన్ను చంపి పగదీర్చుకొనగోరుచున్నాడు.
43. నాయనా! నా మాట చెవినిబెట్టుము. తప్పించుకొని, హారానులోనున్న నా సోదరుడగు లాబాను దగ్గరకు పొమ్ము.
44. నీ అన్న కోపము చల్లారువరకు కొన్నాళ్ళు అక్కడనే ఉండుము.
45. కోపము పూర్తిగా తగ్గి, అతడు నీవు చేసినదంతయు మరచిపోయినప్పుడు, మనుష్యులను పంపి నిన్ను పిలిపించుకొందును. ఒక్కనాడే మీ ఇద్దరిచావును నేను చూడజాలను” అని చెప్పెను.
46. ఆ తరువాత రిబ్కా ఈసాకుతో “ఏసావు పెండ్లాడిన ఈ హితీయుల పిల్లలు నా ప్రాణాలు తోడివేయుచున్నారు. యాకోబుకూడ ఈ జాతిపిల్లలను పెండ్లియాడినచో, ఇక నేను చచ్చినను, బ్రతికినను సమానమే” అనెను.