1-2. సారా నూటయిరువది యేడేండ్లు బ్రతికెను. ఆమె కనానుదేశమందు హెబ్రోను అను పేరుగల కిర్యతర్బాలో మరణించెను. అబ్రహాము సారా కొరకు విలపింప వెళ్ళెను.
3. అతడు ఎట్టకేలకు లేచి శవమును వదలి వచ్చెను. అతడు హిత్తీయులతో
4. “నేను మీచెంత పరదేశివలె నివసించితిని. మా యింట చనిపోయినవారిని పాతి పెట్టుటకు కొంత భూమినిండు” అనెను.
5. హిత్తీయులు అబ్రహాముతో
6. "అయ్యా! మామాట వినుము. నీవు మా మధ్య మహారాజుగా బ్రతుకుచున్నావు. మా శ్మశానభూము లలో అతిశ్రేష్ఠమయిన దానియందు మీ యింట చని పోయినవారిని పాతి పెట్టుము. మాలో ఏ ఒక్కడును నీకు శ్మశానభూమిని ఇవ్వనను వాడులేడు. ఎవ్వడును మీ ఇంట చనిపోయిన వారిని పాతి పెట్టుటకు అడ్డు పడడు” అనిరి.
7. అబ్రహాములేచి ఆ దేశప్రజలగు హిత్తీయుల ముందట సాగిలబడెను.
8. అతడు వారితో “మా యింట చనిపోయినవారిని పాతి పెట్టుటకు మీకు సమ్మతమైనచో నా మాటవినుడు.
9. మీరు సోహారు కుమారుడు ఎఫ్రోనును అతని పొలము చివర మక్పేలా అనుచోట ఉన్న గుహను నాకిమ్మని అతనితో మనవి చేయుడు. అది మీ దేశమున మా శ్మశానభూమి అగునట్లు నిండువెలకే దానిని నాకు స్వాస్థ్యముగా ఇమ్మనుడు” అనెను.
10. హిత్తీయుడగు ఎఫ్రోను తనవారి నడుమ కూర్చుండియుండెను. వారు నగర ద్వారముచెంత ఉండగా, వారి కెల్లరకును వినబడునట్లు అతడు అబ్రహాముతో
11. "అయ్యా! నేను చెప్పదలచుకొన్న మాటవినుము. మా జాతి ప్రజలు చూచుచుండ నేను ఆ పొలమును నీకు దానము చేయుదును. ఆ పొలములోనున్న గుహను గూడ ఇత్తును. అక్కడ మీ వారిని పాతిపెట్టుకొనుము” అనెను.
12-13. అబ్రహాము ఆ ప్రజలయెదుట సాగిలబడెను. వారు వినునట్లు ఎఫ్రోనుతో “అది సరియేకాని నా మాటగూడ వినుము. ఆ పొలము వెలయిత్తును, తీసికొనుము. దానిలో మా వారిని పాతి పెట్టెదను” అనెను.
14. దానికి ఎఫ్రోను "అయ్యా! నా మాటకూడ వినుము.
15. ఆ పొలము నాలుగువందల తులముల వెండి విలువచేయును. అయినను మన ఇద్దరి నడుమ ఇదియేపాటి సొమ్ము! అక్కడ ఏ ఆటంకము లేకుండ మీవారిని పాతి పెట్టుకొనుము” అనెను.
16. అబ్రహాము హిత్తీయులతో బేరము కుదుర్చుకొనెను. తాను హిత్తీయులకు ముందు చెప్పినరీతిగా, నాటి వర్తకులలో చెల్లుబడి అగుచున్న ప్రకారముగా నాలుగువందల తులముల వెండిని తూచి ఎఫ్రోనునకు ఇచ్చెను.
17-18. ఈ విధముగా మమేకు తూర్పున, మక్పేలా దగ్గర వున్న ఎఫ్రోను పొలము, దానిలో నున్న గుహ, చెట్టుచేమలు సరిహద్దులతో పాటు న్యాయానుసారముగా, నగరద్వారము చెంతనున్న హిత్తీయుల సమక్షమున అబ్రహాము వశమైనవి.
19. ఈ బేరము జరిగిన తరువాత అబ్రహాము కనాను దేశమునందు, హెబ్రోను అను పేరుగల మమ్రేకు తూర్పుగా, మక్పేలా దగ్గర ఉన్న పొలముమీది గుహలో తన భార్య సారాను పాతిపెట్టెను.
20. ఈ విధముగా హిత్తీయులు ఆ పొలమును, దానిమీద ఉన్న గుహను శ్మశానమునకై అబ్రహాము వశము చేసిరి.