1. ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. "అబ్రహామూ!" అని దేవుడు పిలిచెను. “చిత్తము ప్రభూ!” అని అబ్రహాము అనెను.
2. అంతట దేవుడు అతనితో “నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైకకుమారుని, ఈసాకును వెంటబెట్టుకొని మోరీయా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దానిమీద నీ కుమారుని దహనబలిగా సమర్పింపుము” అని చెప్పెను.
3. అందుచే అబ్రహాము తెల్లవారకముందే లేచెను. ప్రయాణమునకు గాడిదమీద మెత్తని బొంత పరిచెను. కుమారునితోపాటు, ఇంక తన పనివారిలో ఇద్దరను గూడ వెంటబెట్టుకొని వెళ్ళెను. దహనబలికి కట్టెలు చీల్చి, మోపుకట్టుకొని, దేవుడు చెప్పినచోటికి బయలు దేరెను.
4. బయలుదేరిన మూడవనాడు అబ్రహాము తలయెత్తి దూరమునుండి ఆ చోటుచూచెను.
5. అతడు తన పనివారితో “మీరు గాడిదతో ఇక్కడ నుండుడు. నేనును, ఈ చిన్నవాడును, అక్కడికి వెళ్ళెదము. దేవునకు మొక్కులు చెల్లించి తిరిగి మీ యొద్దకు వత్తుము” అని చెప్పెను.
6. ఇట్లు చెప్పి అబ్రహాము దహనబలికి కావలసిన కట్టెలమోపును ఈసాకు భుజముల మీద పెట్టెను. తానేమో నిప్పును, కత్తిని తీసికొనెను. తండ్రి కొడుకు లిరువురును కలిసి వెళ్ళిరి.
7. ఈసాకు తండ్రి అయిన అబ్రహాముతో “నాయనా!” అని పిలిచెను. అబ్రహాము “ఏమి కుమారా!” అని అడిగెను. అంతట ఈసాకు “నిప్పు, కట్టెలున్నవిగదా! మరి దహనబలికి కావలసిన గొఱ్ఱెపిల్లయేదీ?” అని అడిగెను.
8. దానికి అబ్రహాము “కుమారా! దహనబలికి కావలసిన గొఱ్ఱెపిల్లను దేవుడే సమకూర్చును” అనెను.
9. అటుల వారిద్దరు కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలిపీఠము నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఈసాకును బంధించి బలిపీఠముమీద పేర్చిన కట్టెలపైన ఉంచెను.
10. అంతట అతడు చేయిచాచి కుమారుని చంపుటకు కత్తిని తీసికొనెను.
11. కాని ఆకాశము నుండి యావేదూత “అబ్రహామూ! అబ్రహామూ!' అని పిలిచెను. అబ్రహాము “చిత్తము ప్రభూ!” అనెను
12. యావే దూత “చిన్నవానిమీద చేయివేయకుము అతనిని ఏమియు చేయకుము. నీవు నీ ఏకైకపుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావు: నీవు దైవభీతి కలవాడవని నేను తెలిసికొంటిని” అనెను
13. అప్పుడు అబ్రహాము తలఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకొన్న పొట్టేలు కన బడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసికొనివచ్చెను. కుమారునికి బదులుగా దానిని దహనబలిగా సమ ర్పించెను.
14. అబ్రహాము ఆ ప్రదేశమునకు 'యావే యిర్ యెహ్' అనగా “దేవుడు సమకూర్చును" అను పేరు పెట్టెను. కావుననే ఈనాడుగూడ “కొండమీద దేవుడు సమకూర్చును” అను లోకోక్తి వాడుకలో ఉన్నది.
15. ఆకాశమునుండి యావేదూత మరల రెండవ సారి అబ్రహామును పిలచి
16. “నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నీవు నీ కుమారుని, నీ ఏకైకకుమారుని సమర్పించుటకు వెనుకంజవేయలేదు. నీవు చేసిన ఈ గొప్ప కార్యమునుబట్టి
17. నిన్ను మిక్కుటముగా దీవింతును. ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్రతీరము నందలి ఇసుక రేణువులవలె లెక్కకందనంతగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. నీ సంతతివారు శత్రునగరములను వశముచేసికొందురు.
18. భూమండలమందలి సకలజాతులవారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడ వైతివి గావున తప్పక ఇట్లు జరుగును” అని అనెను.
19. అబ్రహాము తన పనివారికడకు వెళ్ళెను. వారందరు బేర్షెబాకు తిరిగివచ్చిరి. అబ్రహాము అక్కడనే వసించెను.
20. ఇది జరిగిన తరువాత “నీ సోదరుడగు నాహోరునకు మిల్కా బిడ్డలను కనెను.
21. పెద్ద కొడుకు ఊజు. ఊజు తమ్ముడు బూజు. తరువాత ఆరాము తండ్రి కెమూవేలు,
22. కెసెదు, హాజో, పిల్దాషు, యిద్లాపు, బెతూవేలు పుట్టిరి.
23. బెతూవేలునకు రిబ్కా అను కుమార్తె కలిగెను” అను వార్తలెవరో అబ్రహామునకు తెలిపిరి. మిల్కా అబ్రహాము సోదరుడగు నాహోరునకు ఈ ఎనిమిదిమందిని కనెను.
24. రవూమ అను ఆమె నాహోరునకు ఉంపుడుకత్తె. ఆమె అతనికి తెబా, గహాము, తహాషు, మాకా అనువారిని కనెను.