1. మాటయిచ్చినట్లే దేవుడు సారా పట్ల కనికరముచూపెను. ఆమె గూర్చి చెప్పినదెల్ల నెరవేరునట్లు చేసెను.
2. దేవుడు నిర్ణయించిన సమయమునకే సారా గర్భవతియై ముదుసలియైన అబ్రహామునకు ఒక కుమారుని కనెను.
3. అబ్రహాము, సారా తనకు కన్న కుమారునకు ఈసాకు అను పేరు పెట్టెను.
4. ఈసాకు ఎనిమిది రోజుల నెత్తురుకందుగా ఉన్నప్పుడే దేవుడు ఆనతిచ్చిన విధముగా అబ్రహాము అతనికి సున్నతిచేసెను.
5. ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాము వయస్సు నూరేండ్లు.
6. సారా “దేవుడు బిడ్డనిచ్చి నన్ను నవ్వులలో తేలించెను. ఇది విన్న వారందరును నాతోపాటు నవ్వుదురు” అనుకొనెను.
7. ఆమె యింకను ఇట్లనుకొనెను: “సారా బిడ్డలకు చనుగుడుపునని అబ్రహాముతో ఎవరైన చెప్పియుండిరా? అయినను నేను ముదుసలియైన అబ్రహామునకు కొడుకును గంటిని.”
8. పిల్లవాడు పెరిగి చనుబాలు వదలిన రోజున అబ్రహాము ఒక గొప్పవిందు చేసెను.
9. అబ్రహామునకు, ఐగుప్తు దేశీయురాలు అయిన హాగారునకు పుట్టిన కుమారుడు ఈసాకుతో ఆడుకొనుచుండగా సారా చూచెను.
10. చూచి అబ్రహాముతో “ఈ బానిసతొత్తును, దాని కొడుకును ఇంటినుండి గెంటివేయుము. ఈ దాసీపుత్రుడు నా కుమారుడు ఈసాకునకు వారసత్వమున సమముగా ఉండుట నేను సహింపను” అనెను.
11-12. అబ్రహామునకు తన కుమారుడైన యిష్మాయేలు మీద ప్రేమ మెండు. సారా మాటలువిని అతడు చాల బాధపడెను. కాని దేవుడు అబ్రహాముతో “ఈ దాసిని, ఈమె కొడుకును తలచుకొని బాధపడవలదు. సారా చెప్పినట్లు చేయుము. ఈసాకునకు పుట్టినవారే నీ సంతతి వారగుదురు.
13. ఈ దాసీపుత్రుని సంతతిని గూడ ఒక జాతిగా చేయుదును. అతడును నీ కుమారుడే కదా!” అనెను.
14. అబ్రహాము తెల్లవారకముందే లేచెను. అతడు రొట్టెలమూటను, నీళ్ళతిత్తిని తెచ్చి హాగారునకిచ్చి, కుమారుని ఆమె, భుజములమీద నుంచి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో దిక్కుతోచక తిరుగాడుచుండెను.
15. తిత్తిలోని నీరంతయు అయిపోయెను. ఆమె పిల్లవానిని ఒక పొదక్రింద పడవేసెను.
16. పొదకు వింటివేత దూరముగా కూర్చుండెను. “ఈ పిల్లవాని చావు నేనెట్లు చూతును” అనుకొనెను. ఈ విధముగా ఆమె కొంచెము దూరముగా కూర్చుండి గొంతెత్తి ఏడ్చుచుండెను.
17. దేవుడు పిల్లవాని ఏడ్పువినెను. దేవుని దూత ఆకాశము నుండి “హాగారూ! నీకేమి ఆపదకలిగినది? భయపడకుము. దేవుడు నీవు పడవేసిన చోటునుండి పిల్లవాని ఏడ్పు వినెను.
18. ఇకలెమ్ము. పిల్లవానిని లేవనెత్తి చంకబెట్టుకొనుము. అతడు ఒకమహాజాతికి మూలపురుషుడగును” అనెను.
19. దేవుడు ఆమె కన్నులు తెరచెను. ఆమె నీటి ఊటను చూచెను. వెళ్ళి తిత్తిని నీటితో నింపెను. పిల్లవానికి నీరుపట్టెను.
20-21. పిల్లవానికి దైవబలము కలదు. అతడు పెరిగి పెద్దవాడై పారాను అడవులలో నివసించెను. గొప్ప విలుకాడయ్యెను. తల్లి ఐగుప్తు దేశమునుండి ఒక పిల్లను తెచ్చి అతనికి పెండ్లి చేసెను.
22. ఆ కాలమున అబీమెలెకు తన సేనాధిపతి ఫీకోలుతో వచ్చి అబ్రహాముతో “నీవు చేయు పనులన్నింటికి దేవుడు తోడ్పడుచున్నాడు.
23. నాకు, నా బిడ్డలకు, నా సంతతివారికి విశ్వాసద్రోహము చేయనని దేవునిమీద ప్రమాణముచేసి చెప్పుము. నేను నిన్ను నమ్మినట్లుగా నీవును నన్ను, నీకు పరదేశముగానున్న నా దేశమును నమ్మవలయును” అనెను.
24. ఆ మాటలకు అబ్రహాము "అట్లే నేను ప్రమాణము చేయుచున్నాను” అనెను.
25. ఇది ఇట్లుండగా అబీమెలెకు సేవకులు అబ్రహాము నీళ్ళబావిని బలవంతముగా వశము చేసికొనిరి. దానికి అబ్రహాము అబీమెలెకు మీద అభియోగము తెచ్చెను.
26. అంతట అబీమెలెకు “ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను. నీవును ఎన్నడు నాతో అనలేదు. ఇప్పటివరకు నేను. ఈ విషయము విననేలేదు” అనెను.
27. అంతట అబ్రహాము గొఱ్ఱెలను, గొడ్లను తోలుకొనివచ్చి అబీమెలెకునకు అప్పగించెను. వారిరువురు ఒక ఒడంబడిక చేసికొనిరి.
28. అబ్రహాము తన గొఱ్ఱెల మందనుండి ఏడు పెంటి పిల్లలను విడిగా నుంచెను.
29. అబీమెలెకు “ఈ పెంటి పిల్లలను ఏడింటిని విడిగా ఉంచితివేల”? అని అబ్రహామును అడిగెను.
30. దానికి అబ్రహాము “నేనే ఈ బావిని త్రవ్వించితిని అనుటకు సాక్ష్యముగా నీవు వీనిని స్వీకరింపుము” అనెను.
31. వారిరువురు ప్రమాణములు చేసిన తావు కావున ఆ స్థలమునకు బేర్షెబా" అను పేరువచ్చెను.
32. వారు బేర్షెబా దగ్గర ఒడంబడిక చేసికొన్నపిదప అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోలు ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళిరి,
33. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచుల వృక్షమును నాటెను. నిత్యుడగు దేవుని పేరిట ప్రార్ధన చేసెను.
34. అబ్రహాము ఫిలిస్తీయుల దేశములో పెక్కేండ్లు పరదేశిగా బ్రతికెను.