1. ఈ విధముగా ఆకాశము, భూమి, సమస్త సమూహములు సంపూర్ణముగా రూపొందెను.
2. ఏడవరోజు దేవుడు తాను చేయుచున్న పనియంతటి నుండి విశ్రమించెను.
3. సృష్టిని పూర్తిచేసి ఏడవరోజున దేవుడు తాను చేసిన, సృజించిన తన పని అంతటి నుండి విశ్రమించెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని 'పవిత్రదినము'గా చేసెను.
4. భూమ్యాకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే.
5. దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించిన నాడు, నేలమీద పచ్చని చెట్టుచేమలేవియును లేవు. ఏలయన దేవుడు భూమిమీద వానలు కురిపింపలేదు. నేలను సాగుచేయుటకు ఎవ్వడును లేడు.
6. కాని భూమి నుండి నీటియావిరి పెల్లుబికి నేలనెల్ల తడుపుచుండెను.
7. అప్పుడు దేవుడైన యావే నేలమట్టిని కొంత తీసికొని, దానినుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యెను.
8. దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోటను నాటెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను.
9. చూచుటకు ఇంపుగానుండి, తినుటకు తియ్యగానుండు పండ్లనిచ్చు చెట్లన్నియు ఆ తోటలో పెరుగునట్టు చేసెను. తోటనడుమ జీవమిచ్చుచెట్టు, మంచిచెడుల తెలివినిచ్చు చెట్టును మొలిపింపచేసెను.
10. తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది ప్రవహించెను. అది నాలుగు పాయలుగా చీలెను.
11. మొదటిపాయ పేరు పీషోను. అది హవీలా దేశమును చుట్టిపారును.
12. ఆ దేశమున మేలిమి బంగారమును, మంచిగుగ్గిలమును, గోమేధికములును దొరకును.
13. రెండవపాయ పేరు గీహోను. అది కూషు దేశమును చుట్టి పారుచుండును.
14. మూడవ పాయ పేరు టిగ్రీసు. అది అస్సిరియాకు తూర్పున ప్రవహించును. నాలుగవపాయ యూఫ్రటీసు.
15. దేవుడైన యావే నరుని కొనిపోయి ఏదెను తోటను సాగుచేయుటకును, కాచుటకును దానిలో ఉంచెను.
16. “నీవు తోటలో ఉన్న ప్రతిచెట్టు పండును నిరభ్యంతరముగా తినవచ్చును.
17. కాని మంచిచెడులనెంచు తెలివినిచ్చు చెట్టునుండి మాత్రము తినరాదు. నీవు వాటిని తినుదినమున తప్పక చని పోవుదువు” అని దేవుడయిన యావే నరుని ఆజ్ఞా పించెను.
18. అంతట దేవుడైన యావే “నరుడు ఒంటరిగా జీవించుట మంచిదికాదు. అతనికి సాటియైన తోడును సృష్టింతును” అని అనుకొనెను.
19. కావున దేవుడైన యావే నేలనుండి అన్నిరకముల మృగములను, పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలిసికొనగోరి, వానినన్నిటిని అతని కడకు కొనితెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి.
20. ఇట్లు అన్నిరకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూరమృగములకు నరుడు పేర్లు పెట్టెను. కాని అతనికి తగిన తోడెవ్వరును దొరకలేదు.
21. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢనిద్ర పోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునపుడు ఆయన అతని ప్రక్కటెముకనొకదానిని తీసి, ఆ చోటును మరల మాంసముతో పూడ్చెను.
22. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి, దేవుడైన యావే ఆమెను అతనికడకు తోడ్కొనివచ్చెను.
23. అప్పుడు నరుడు “చివరకు ఈమె నా వంటిదైనది ఈమె నా ఎముకలలో ఎముక నా దేహములో దేహము ఈమె నరునినుండి రూపొందినది కావున నారియగును” అనెను.
24. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొనిపోవును. వారిరువురు ఏక శరీరులగుదురు.
25. అప్పుడు ఆ స్త్రీపురుషులిద్దరు దిసమొలతోనుండిరి. అయినను వారికి సిగ్గు వేయలేదు.