ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 19 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 19వ అధ్యాయము

 1. దేవదూతలు ఇద్దరు ఆ సాయంకాలము సొదొమ వచ్చిరి. అప్పుడు లోతు నగరద్వారము వద్ద కూర్చుండియుండెను. అతడు వారిని చూచి ఎదురు వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారము చేసెను.

2. అతడు వారితో "అయ్యలార! మీరు ఈ దాసుని ఇంటికి రావలయునని వేడుకొనుచున్నాను. ఈ రాత్రి మా ఇంట గడపుడు, కాళ్ళు కడుగుకొనుడు. పెందలకడ లేచి మీ త్రోవను మీరు పోవచ్చును” అనెను. దానికి వారు "ఆలాగు కాదు. మేము వీధిలోనే యీ రాత్రి గడిపెదము” అనిరి.

3. కాని లోతు పట్టుపట్టుటచే అతని మాట కాదనలేక వారు అతని యింటికి వచ్చిరి. లోతు పొంగనిరొట్టెలతో వారికి విందుచేసెను. వారు విందారగించిరి.

4. వారు నిదురించక మునుపే సొదొమ నగరమునందలి పురుషులు-పిన్నలు, పెద్దలు - అందరును ఎగబడివచ్చి లోతు యింటిని చుట్టుముట్టిరి.

5. ఆ జనులు లోతును విలిచి “ఈ రాత్రి నీ ఇల్లు చొచ్చినవారు ఎక్కడ ఉన్నారు? వారిని వెలుపలికి రప్పింపుము. మేము వారిని కూడవల యును” అని కేకలు వేసిరి.

6. లోతు వాకిట ఉన్న జనసమూహము కడకు వెళ్ళెను. వెలుపలికి వచ్చి ఇంటి తలుపువేసెను.

7. వారితో "సోదరులారా! మీరు ఇంత పాతకమునకు తెగింపవలదు.

8. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు కన్యలు. వారిని మీకు అప్పగింతును. మీ ఇచ్చవచ్చినట్లు చేయుడు. నా యింటి నీడకు వచ్చిన యీ మనుజులకు మాత్రము మీరు ఏ అపచారము చేయవలదు” అనెను.

9. దానికి వారు “నీవు నోరెత్తకుండ అవతలికి పొమ్ము. వీడు పరదేశిగా వచ్చి యిక్కడ పాతుకొనిపోయెను. నేటికి మనపాలిటి పెద్ద తీర్పుగాడయ్యెను. ఓరీ! ముందు వారికంటె ఎక్కువగా నిన్నవమానపరుతుము” అనిరి. వారు గుంపుకట్టి లోతు మీదపడి తలుపు పగులగొట్టుటకు దగ్గరకు వచ్చిరి.

10. కాని లోపలనున్న మనుజులిద్దరు వెలుపలికి చేతులు చాచి, లోతును లోనికి లాగి, తలుపులు మూసిరి.

11. పిదప తలుపుదగ్గర ఉన్న వారిలో పిన్నలనుండి పెద్దలవరకు అందరకును కంటిచూపు పోవునట్లు చేసిరి. అందుచే వారు తలుపు కనబడక తడబడిరి.

12. ఆ మనుజులు ఇద్దరు లోతుతో “ఇక్కడ నీ కుమారులుగాని, కుమార్తెలుగాని, అల్లుళ్ళుగాని, ఎవరైన ఉన్నారా? వారికి అయినవారు ఇంకెవరైన ఉన్నచో వారిని అందరను నీవు ఇక్కడి నుండి నగరము వెలువలికి తీసికొనిపొమ్ము .

13. మేము ఈ నగరమును నేలమట్టము చేయబోవుచున్నాము. ఈ నగరములోని వారిని దండింపవలయునను మొర మాటిమాటికి చెవినిబడుటచే, దీనిని నాశనము చేయుటకు దేవుడు మమ్ము పంపెను” అని అనిరి.

14. లోతు వెళ్ళి తనకు కాబోవు అల్లుళ్ళతో "లెండు, ఈ చోటు వదలిపొండు. దేవుడు ఈ నగరమును నాశనము చేయబోవుచున్నాడు” అని చెప్పెను. కాని వారు లోతు ఎగతాళికి అటుల చెప్పుచున్నాడు కాబోలని అనుకొనిరి.

15. తెల్లవారిన తరువాత దేవదూతలు లోతును వెళ్ళిపొమని తొందర పెటిరి. అతనితో “తొందరపడుము. ఇక్కడ ఉన్న నీ భార్యను కుమార్తెలను తీసికొని వెళ్ళిపొమ్ము. పోకున్న ఈ నగరము వారు తాము చేసిన తప్పులకు అగ్గిపాలగునపుడు నీవును బుగ్గియై పోదువు” అనిరి.

16. కాని లోతు జాగుచేసెను. అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపెను. కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని, భార్యతో కుమార్తెలతో అతనిని నగరము వెలుపలికి తీసికొనివచ్చిరి.

17. వెలుపలికి చేర్చిన తరువాత వారు “ప్రాణములు దక్కించుకొనదలచిన, ఇక్కడి నుండి పారిపోవుడు. వెనుకకు తిరిగిచూడకుడు. మైదానములో ఎక్కడ ఆగకుడు. కొండలకు పారిపోవుడు. పారిపోకున్న మీరును బూడిదయై పోదురు” అనిరి.

18. అంతట లోతు "అయ్యా! అటుల కాదు.

19. మీరు ఈ దాసుని పట్ల ఎంతయో మన్నన చూపితిరి. నా ప్రాణములు కాపాడి మీకు నాయందున్న దయ ఎంత అధికమో రుజువుచేసితిరి. నేను కొండలకు తప్పించుకొని పోలేను. అక్కడ ఉపద్రవములపాలై చచ్చిపోవుదునేమో!

20. ఇదిగో! పారిపోవుటకు ఇక్కడికి దగ్గరగా ఒక చిన్న ఊరున్నది. నన్ను అక్కడికి తప్పించుకొనిపోయి బ్రతుకనిండు. అదియే ఆ చిన్న ఊరు” అనెను.

21. దేవదూత అతనితో “నీ మనవి మన్నింతును. నీవు చెప్పిన ఆ ఊరిని నాశనము చేయను.

22. తొందరగా నీవు అక్కడికి పారిపొమ్ము. నీవు అక్కడికి చేరుదాక నేను ఏమియు చేయజాలను” అనెను. కావుననే ఆ ఊరికి సోయరు' అను పేరు వచ్చెను.

23. లోతు సోయరు చొచ్చునప్పటికి ఆ ప్రదేశ మున సూర్యుడు ఉదయించెను.

24. దేవుడు ఆకాశము నుండి సొదొమ గొమొఱ్ఱాల మీద అగ్నిని, గంధకమును కురిపించెను.

25. దేవుడు ఆ పట్టణములను నేలమట్టము చేసెను. మైదానమునెల్ల నాశనము చేసెను. పట్టణ ప్రజలను చంపెను. నేల నుండి పుట్టి పెరిగిన చెట్టుచేమలను బూడిదచేసెను.

26. అపుడు లోతు భార్య అతని వెంట నడచివచ్చుచు వెనుదిరిగి చూచెను. చూచిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయెను.

27. అబ్రహాము వేకువజాముననే లేచెను. పూర్వము తాను దేవుని సన్నిధిన నిలచిన చోటికి వచ్చెను.

28. అతడు సొదొమ గొమొఱ్ఱాలవైపు, మైదానమువైపు చూచెను. దట్టమైన ఆవము పొగవలె నేలనుండి పొగ పైకిలేచుచుండెను.

29. ఆ రీతిగా మైదానపు నగరములను నాశనము చేసినపుడు దేవుడు అబ్రహామును గుర్తు తెచ్చుకొనెను. లోతు నివసించుచున్న పట్టణములను నేలమట్టము గావించినప్పుడు దేవుడు అతనిని ఆ ఉపద్రవమునుండి తప్పించెను.

30. లోతు సోయరులో ఉండుటకు భయపడెను. సోయరు వదలి అతడు కుమార్తెలతో పర్వతప్రాంతమున నివసించెను. అతడు అతని కుమార్తెలిద్దరు ఒక గుహలో వసించిరి.

31. ఇట్లుండ అక్క చెల్లెలితో “మన తండ్రి ముసలివాడాయెను. లోకాచారము ప్రకారముగా మనలను కూడుటకు ఒక్క మగపురుగయినను దేశములో కనబడుటలేదు గదా!

32. కావున తండ్రిని తప్పద్రాగింతము. అప్పుడు అతనితో శయనింతము. ఈ విధముగా తండ్రి వలన మన వంశమును నిలుపుకొందము” అనెను.

33. ఆ రాత్రి వారు తండ్రికి ద్రాక్షసారాయమునిచ్చిరి. పెద్దకూతురు వచ్చి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు వచ్చి శయనించెనో, ఎప్పుడు లేచివెళ్ళెనో అతనికి తెలియదాయెను.

34. మరునాడు అక్క చెల్లెలితో "నిన్నటి రేయి నేను తండ్రితో శయనించితిని. ఈ రాత్రి కూడ తండ్రికి త్రాగుటకు ద్రాక్షసారాయము పోయుదము. అప్పుడు నీవుపోయి అతనితో శయనింపుము. ఈ రీతిగా తండ్రివలన వంశము నిలుపుకొందము” అనెను.

35. ఆ రాత్రిగూడ తండ్రి త్రాగుటకు ద్రాక్షసారాయమును ఇచ్చిరి. అంతట చిన్నకూతురు వెళ్ళి తండ్రితో శయనించెను. ఆమె ఎప్పుడు వచ్చి శయనించెనో, ఎప్పుడు లేచివెళ్ళెనో తండ్రికి తెలియదాయెను.

36. ఈ విధముగా లోతు కుమార్తెలు తండ్రివలన గర్భవతులైరి.

37. వారిలో పెద్దకూతురు కుమారుని కని అతనికి మోవాబు అను పేరు పెట్టెను. అతడే ఇప్పటి మోవాబీయులకు మూలపురుషుడు.

38. చిన్న కూతురు ఒక కుమారుని కని అతనికి బెన్-అమ్మి అను పేరు పెట్టెను. అతడే ఇప్పటి అమ్మోనీయులకు మూలపురుషుడు. 

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services