ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 18 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 18వ అధ్యాయము

 1. మమ్రే యొద్ద ఉన్న సింధూరవృక్ష వనమున దేవుడు అబ్రహామునకు కనబడెను. ఎండ కాయునపుడు అబ్రహాము తన గుడారమువాకిట కూర్చుండెను.

2. అతడు తలయెత్తి చూడగా దాపున ముగ్గురు మనుజులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిటినుండి పరుగెత్తిపోయి వారియెదుట సాగిల బడెను.

3. అతడు వారితో “ఈ దాసుడు మీకృపకు పాత్రుడయినచో మా యింటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవద్దు.

4. నీరు తెచ్చెదను. కాలు సేతులు కడుగుకొనుడు. చెట్ల క్రింద అలసట తీర్చు కొనుడు.

5. ఆహారము తెచ్చెదను. ఇంత తిని ప్రాణ ములు కుదుటపడునట్లు చేసికొనుడు. తరువాత మీ దారిని మీరుపోవచ్చును. మీ ప్రయాణములో ఈ మీ సేవకుని వద్దకు రానే వచ్చితిరి గదా!” అనెను. అందులకు వారు “నీవు చెప్పినట్టే చేయుము” అనిరి.

6. అబ్రహాము గబగబ గుడారములోనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో “నీవు తొందరగా మూడు మానికలపిండిని తీసికొని పిసికి రొట్టెలుచేయుము” అని చెప్పెను.

7. తరువాత అబ్రహాము ఆలమందకు పరుగెత్తి ఒక మంచిలేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చెను. వాడు కన్నుమూసి తెరుచునంతలో దానిని సిద్ధము చేసెను.

8. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానును అక్కడనే చెట్టుక్రింద నిలుచుండెను.

9. “నీ భార్య సారా ఎక్కడ?” అని అతిథులు అతనిని అడిగిరి. “ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది” అని అతడు చెప్పెను.

10. అంతట ఆయన “నేను రాబోవు యేడు కూడ సరిగా ఈ సమయమునకే తిరిగివత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును” అని చెప్పెను. అతనికి వెనుకప్రక్కన ఉన్న గుడారములో తలుపుచాటున నిలిచియున్న సారా యీ మాటలు వినెను.

11. అబ్రహాము సారా యిద్దరును ముదివగ్గులయిరి. సారా పిల్లలను కను వయస్సు దాటినది.

12. కావున సారా తనలో తాను నవ్వుకొని “నాకు ప్రాయము చెల్లినది. నా భర్తయు ఎండివరుగయ్యెను. నేను ఇపుడు మగని పొందును అనుభవించి బిడ్డలను కనుటయా?” అని అనుకొనెను.

13. అందుకు దేవుడు అబ్రహాముతో “ముసలిదాననైన నాకు బిడ్డలు పుట్టుదురా? అని సారా నవ్వనేల?

14. దేవునకు అసంభవమైనదేదైనా ఉన్నదా? రాబోవు యేడు కూడ సరిగా ఈ సమయమునకు నేను తప్పక తిరిగి నీ యొద్దకు వత్తును. సారాకు కొడుకు పుట్టును” అనెను.

15. ఆ మాటలకు భయపడి సారా నేను నవ్వలేదని బొంకెను. “అవును. నీవు నవ్వితివి” అని అతడనెను.

16. ఆ మనుజులు అక్కడినుండి లేచి సొదొమ వైపు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారి వెంటవెళ్ళెను.

17. దేవుడు తనలో తాను ఇట్లు అనుకొనెను: “నేను చేయదలచుకొన్నపని అబ్రహామునకు చెప్పకుండ దాచెదనా?

18. శక్తిమంతమయిన ఒక మహాజాతి అతనివలన ఏర్పడును. భూమండల మునందలి సకలజాతులు అతని ద్వారా దీవెన బడయును.

19. అబ్రహాము కుమారులు, అతని కుటుంబము వారు, తరువాత కూడ దైవమార్గమును అంటిపెట్టుకొని, నీతిధర్మములను పాటించుటకు అతనిని బుద్ధిపూర్వకముగా ఎన్నుకొంటిని. ఈ విధముగా నేను అతనికి మాట యిచ్చినట్లు అంతయు నెరవేర్చెదను.”

20. కావున దేవుడు “సొదొమ గొమొఱ్ఱా ప్రజల పాడుపని పైకి పొక్కినది. వారి పాపముపండినది.

21. నేను దిగివెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడుపనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలయునను మొర నా చెవినిబడినది. నేను నిజము తెలిసికొనతలచితిని” అని చెప్పెను.

22. అంతట ఆ మనుజులు సొదొమవైపు వెళ్ళిపోయిరి. కాని అబ్రహాము దేవునియెదుటనే నిలుచుండెను.

23. అతడు దేవుని సమీపించి “ప్రభూ! దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశము చేయుదువా?

24. ఆ పట్టణములో సజ్జనులు ఏబదిమంది ఉన్నచో, వారినిబట్టి అయిన ఆ నగరమును నాశనము చేయకుండ కాపాడవా?

25. మంచివారిని, చెడ్డవారిని కలిపికట్టగా నాశనము చేయుట నీకుతగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకుతగునా? భూలోకమున కెల్ల తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా?” అని అనెను.

26. అంతట దేవుడు “సొదొమ నగరములో ఒక్క యేబదిమంది మంచివారు ఉన్నచో వారినిబట్టి యెల్లరను క్షమింతును” అని చెప్పెను.

27. అబ్రహాము "ప్రభూ! నేను బూడిద ప్రోగునే. మట్టిమనిషినే. అయినను తెగించి దేవరవారితో మాట్లాడుచున్నాను.

28. ఐదుగురు తక్కువగా ఏబది మంది మంచివారున్న తాము ఏమి చేయుదురు? ఐదుగురు తక్కువ అగుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా?” అనెను. “నలువది ఐదుగురున్నను నేను దానిని నాశనము చేయను” అని దేవుడు చెప్పెను.

29. అబ్రహాము తిరిగి “ఒకవేళ నలువదిమంది మాత్రమే ఉన్న ఎట్లు?” అనెను. “నలువదిమందియున్నను నేను నాశనము చేయను” అని దేవుడు చెప్పెను.

30. అపుడు అబ్రహాము "ప్రభూ! కోపపడకుము. ఇంకొక మనవి. ముప్పదిమంది మాత్రమే ఉండిరనుకొనుము. అప్పుడు ఏమి చేయుదురు?” అనెను. “ముప్పదిమందియున్నను నేను ఏమియు చేయను” అని దేవుడు అనెను.

31. అబ్రహాము “ప్రభూ! ఇంకను మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో ఇరువది మంది మాత్రమే ఉన్నచో ఏమియగును?” అని అడిగెను. దానికి దేవుడు “ఇరువదిమందియున్నను నాశనము చేయను” అనెను.

32. తరువాత అబ్రహాము “ప్రభూ! తాము కోపపడకున్న ఇంకొక్కసారి మాత్రము మాటాడెదను. ఒకవేళ అక్కడ పదుగురు మంచివారు మాత్రమే ఉందురేమో?” అని అడిగెను. దానికి దేవుడు “పదుగురు మంచివారున్నను చాలు. దానిని నాశనము చేయను” అని చెప్పెను.

33. అంతట దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము ఇంటికి తిరిగివచ్చెను.