ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Galatians Chapter 6 || Telugu Catholic Bible || గలతీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము

 1. సోదరులారా! ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనినయెడల, మీలో ఆధ్యాత్మిక శక్తి కలవారు వానిని సరిదిద్దవలెను. కాని ఆ పనిని సాత్వికమైన మనస్సుతో చేయవలెను. అంతేకాక, నీవును శోధింప బడకుండునట్లు నిన్ను గూర్చి జాగ్రత్తపడుము.

2. ఒకరి భారములను మరియొకరు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్పుడు.

3. ఎవడైనను ఏమియు లేనివాడైయుండి తాను గొప్పవాడనని భావించుకొన్నచో, అట్టివాడు తనను తాను మోసగించు కొనుచున్నాడు.

4. ప్రతివ్యక్తి తన పనిని తనకు తానే పరీక్షించుకొనవలెను. అట్లు చేసినచో ఇతరుల పనితో అవసరము లేకయే, తన పనియందే తాను గర్వపడవచ్చును.

5. ఏలయన, ప్రతి వ్యక్తియు తన భారమును తానే మోయవలెను.

6. దేవుని వాక్యోపదేశమును పొందువాడు, తనకు కలిగిన మేలును అంతటిని తన ఉపదేశకునితో పంచుకొనవలెను.

7. మిమ్ము మీరు మోసగించుకొనకుడు. ఎవ్వడును దేవుని హేళన చేయజాలడు. ఏ వ్యక్తియై నను తాను నాటిన దానినే కోసికొనును.

8. శారీరకమైన కోరికలు అను పొలములో అతడు విత్తనములు చల్లినచో శరీరమునుండి అతనికి లభించు ఫలసాయము క్షయమైనది. ఆత్మ అను పొలములో అతడు విత్తనము నాటినచో ఆత్మనుండి అతడు శాశ్వత జీవితమను ఫలసాయమును పొందును.

9. కనుక, మనము సత్కార్యములు చేయుటయందు విసుగుచెందరాదు. ఏలయన, మనము అటుల చేయుటయందు నిరాశ చెందకున్నచో, మన కృషి ఫలవంతమగు సమయము వచ్చును

10. కనుక అవకాశము దొరికినప్పుడెల్ల మనము అందరకును, అందును విశేషించి, మన విశ్వాసపు కుటుంబమునకు చెందిన వారికిని మంచిని చేయుచుండవలెను.

11. నా స్వహస్తముతో ఎంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడు.

12. శారీరకముగ తమ గొప్పతనమును ప్రదర్శించుకొననెంచు వారు మిమ్ము సున్నతిపొందవలెనని బలవంత పెట్టుచున్నారు. కాని క్రీస్తు సిలువ నిమిత్తము హింసింపబడకుండుటకే వారు అటుల బలవంతము చేయుదురు.

13. సున్నతిని అవలంబించుచున్నవారే చట్టమును అనుసరించుట లేదు. కాని మీ మూలమున గొప్పలు పొందుటకు మీరు సున్నతిని పొందవలెనని వారు కోరుదురు.

14. నేను మరి ఇతరములైన దేనియందును కాక, మన ప్రభువగు యేసు క్రీస్తు సిలువయందు మాత్రమే గొప్పగ చెప్పుకొందును. ఏలయన, ఆయన సిలువ మూలముననే, నాకు ఈ లోకము, నేను ఈ లోకమునకు సిలువవేయబడితిమి.

15. ఎవడైనను సున్నతి పొందెనా లేదా అను విషయము అనవసరము, ముఖ్యమైన విషయము ఏమనగ, అతడు నూతన సృష్టియగుటయే.

16. తమతమ జీవితములలో ఈ సూత్రమును పాటించువారికి సమాధానమును, కనికరము తోడగునుగాక, దేవుని యిస్రాయేలీయులకును అవి లభించునుగాక!

17.ఇక మీదట ఎవ్వడును నన్ను బాధింపకుండునుగాక! ఏలయన, నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించియున్నాను. .

18. సోదరులారా! మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండునుగాక! ఆమెన్.