ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Galatians Chapter 5 || Telugu Catholic Bible || గలతీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము

 1. స్వతంత్రులుగ జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను. కనుక, దృఢముగ నిలబడుడు. బానిసత్వము అను కాడిని మరల మీపై పడనీయకుడు.

2. వినుడు! పౌలునైన నేను మీకు ఇట్లు విశదమొనర్చుచున్నాను. సున్నతిని మీరు పొందినచో, క్రీస్తు మీకు పూర్తిగ నిరుపయోగమగును.

3. దీనిని మరల నొక్కి వక్కాణించుచున్నాను. సున్నతినిపొందు ప్రతి వ్యక్తియు ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించి తీరవలెను.

4. మీరు ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులు కాదలచినచో, క్రీస్తునుండి వేరైనట్లే. మీరు దేవునికృపనుండి తొలగిపోతిరి.

5. విశ్వాసము ద్వారా ఆత్మ వలన మేము నీతిమంతులము అగుటకు నిరీక్షించుచున్నాము.

6. ఏలయన, క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు, సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదము లేదు. కాని ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యము.

7. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి! మిమ్ము సత్యమునకు విధేయత చూపకుండ ఆటంకపరచినది ఎవరు?

8. ఈ ప్రేరేపణ మిమ్ము పిలిచిన దేవుని నుండి రాలేదు.

9. పులిసిన పిండి కొంచెమైనను పిండిని అంతటిని పులియజేయును.

10. కాని మీరు ఇతర భావములను తిరస్కరించి నా భావములను మాత్రమే అంగీకరించుదురని మిమ్ము గూర్చి ప్రభువు నందు నాకు నమ్మకము ఉన్నది. మిమ్ము కలవర పెట్టువాడు ఎవడైనను, వాడు దేవునిచే తీర్పుచేయబడును.

11. కాని సోదరులారా! సున్నతి అవసరమే అని నేను ఇంకను బోధించుచున్నచో, ఏల ఇంకను హింసింపబడుచున్నాను? అది నిజమే అయినచో, సిలువ విషయమైన ఆటంకము తీసివేయబడును గదా!

12. మిమ్ము కలవర పెట్టుచున్న వారు తమనుతాము అంగచ్చేదనము చేసికొందురుగాక!

13. సోదరులారా! స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితిరి. కాని ఈ స్వేచ్చ, మీరు శారీరక వ్యామోహములకు లొంగిపోవుటకు మిష కాకుండ చూచుకొనుడు. కాని ఒకరికి ఒకరు ప్రేమతో సేవకు లుగా నుండుడు.

14. ఏలయన, ధర్మశాస్త్రము అంతయు కలసి “నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము” అను ఒక్క మాటలో నెరవేరియున్నది.

15. కాని మీరు ఒకరిని ఒకరు కరచి, దిగమ్రింగినచో, ఒకరిని ఒకరు సర్వనాశనము చేసి కొందురేమో! జాగ్రత్త సుమా!

16. నేను చెప్పునది ఏమన: మీరు ఆత్మయందు నడుచుకొనుడు. శారీరక వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుడు.

17. ఏలయన, శరీరము కోరునది, ఆత్మ కోరుదానికి విరుద్ధముగా ఉండును. ఆత్మ కోరునది శరీరము కోరుదానికి విరుద్ధముగా ఉండును. ఈ రెండిటికిని బద్ధవైరము. అందువలన మీరు చేయగోరు దానిని చేయలేకున్నారు.

18. కాని ఆత్మయే మిమ్ము నడిపినచో, మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు.

19. శరీర కార్యములు స్పష్టమే. అవి ఏవన: జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము,

21. మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు వినోదములు మొదలగునవి. పూర్వమువలె ఇప్పుడును నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. ఇట్టి పనులు చేయు వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు.

22. కాని ఆత్మఫలములు ఏమనగ: ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత,

23. సాత్త్వికత, నిగ్రహము. వీనికి వ్యతిరేకముగ ఎట్టి చట్టమును లేదు.

24. క్రీస్తుయేసునకు చెందినవారు వ్యామోహములతోను, కాంక్షలతోను కూడిన తమ శరీరమును సిలువవేసిరి.

25. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైనచో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము.

26. మనము గర్వపడరాదు, ఒకరిపై ఒకరు వివాదము లేపరాదు, అసూయాపరులము కారాదు.