ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Galatians Chapter 4 || Telugu Catholic Bible || గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము

 1. మరియు నేను చెప్పునది ఏమనగా, వారసుడు అన్నిటికి కర్తయైయున్నను బాలుడై ఉన్నంతకాలము అతనికిని, దాసునికిని భేదము లేదు.

2. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకులయొక్కయు, గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును.

3. అట్లే మనమును బాల్యదశలో ప్రాపంచిక ప్రాథమిక నియమములకు బానిసలమై ఉంటిమి.

4. కాని కాలము పరిపక్వమయినపుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను.

5. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్ర మునకులోబడియున్న వారిని విముక్తులను చేసెను.

6. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ “అబ్బా! తండ్రి!” అని పిలుచు చున్నది.

7. కనుక దేవునివలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక, వారసుడవు కూడ.

8. గతమున మీరు దేవుని ఎరుగనివారై ఉన్నప్పుడు దేవుళ్ళు కానివారికి దాసులై ఉంటిరి.

9. కాని, ఇప్పుడు మీరు దేవుని తెలిసికొనియున్నారు. మరి విశేషముగ చెప్పవలెనన్న, దేవుడే మిమ్ము తెలిసి కొనియున్నాడు. అటువంటి మీరు ఈ బలహీనమైన, హీనమైన ప్రాపంచిక, ప్రాథమిక నియమముల వైపు ఏల మరలుచున్నారు? మరల వానికి మీరు ఏల బానిసలు కావలెనని ఆశించుచున్నారు?

10. కొన్ని ప్రత్యేక దినములను, నెలలను, ఋతువులను, సంవత్సరములను మీరు పాటించుచున్నారు గదా!

11. మిమ్మును గూర్చిన నా కృషి అంతయు నిష్ప్రయోజనమేమోనని భయపడుచున్నాను.

12. సోదరులారా! మిమ్ము ప్రార్థించుచున్నాను. మీరును నావలె ఉండుడు. ఏలయన, నేనును మీవంటి వాడినైతిని గదా! మీరును నాకు ఎట్టికీడును చేయలేదు.

13. నేను సువార్తను మీకు మొదట నా శరీర దౌర్బల్యమున బోధించితిని అని మీరు ఎరుగుదురు.

14. నా శారీరక దౌర్బల్యము మీకు ఒక పరీక్షయైనను మీరు నన్ను తిరస్కరింపలేదు, అసహ్యించుకొనలేదు. దేవుని దూతవలె, క్రీస్తు యేసువలె నన్ను స్వీకరించితిరి.

15. అప్పుడు ఉన్న మీ సంతృప్తి ఇప్పుడు ఏమాయెను? సాధ్యమైనచో మీ కన్నులుకూడ ఊడబెరికి నాకు అప్పుడు ఇచ్చియుందురని మీ తరపున సాక్ష్యము చెప్పుచున్నాను.

16. నిజము చెప్పి నేను ఇప్పుడు మీకు విరోధినైతినా?

17. వారు మిమ్ము మెచ్చుకొనుచున్నారు. కాని వారి ఉద్దేశము మంచిదికాదు. మీరు వారిని పొగడు టకు నానుండి మిమ్ము వేరు చేయుచున్నారు.

18. మంచి విషయములపై శ్రద్ధచూపుట మంచిది. ఇది నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాక, ఎల్లప్పుడు చేయ వలెను.

19. నా బిడ్డలారా! మీయందు క్రీస్తు రూపము ఏర్పడువరకు, స్త్రీ ప్రసవవేదనవలె నేను మరల మిమ్ము గురించి బాధపడుచున్నాను.

20. మిమ్ము గురించి నాకు ఎటూ తోచుటలేదు. నేను ఇపుడు మీ మధ్యకు వచ్చి మరియొక విధముగ మాటలాడిన బాగుండును.

21. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండవలెనని కోరెడి మీరు, నాకు చెప్పుడు. ధర్మశాస్త్రము ఏమి చెప్పుచు న్నదో మీరు వినుటలేదా?

22. అబ్రాహామునకు ఇద్దరు కుమారులుండిరి. దాని వలన ఒక కుమారుడు, స్వతంత్రురాలగు స్త్రీ వలన మరియొక కుమారుడును కలిగిరని అది చెప్పుచున్నది.

23. దాసి వలన పుట్టిన పుత్రుడు శరీర ధర్మము ప్రకారము పుట్టెను. కాని స్వతంత్రురాలి వలన కలిగిన పుత్రుడు దేవుని వాగ్దానఫలముగ జన్మించెను.

24. ఇది అలంకార రూపమున చెప్పవచ్చును. ఈ ఇద్దరు స్త్రీలును రెండు నిబంధనలు. అందు ఒకటి హాగారు. సీనాయి పర్వతమునుండి పుట్టినది. దాని బిడ్డలు పుట్టుకచేతనే బానిసలు.

25. ఏలయన హాగారు అనునది అరేబియాలోని సీనాయి పర్వతమునకు గుర్తు. అది ఈనాటి యెరూషలేమునకు సాదృశ్యము. మరియు యెరూషలేము, దాని బిడ్డలు బానిసలుగ జీవించుచున్నారు.

26. కాని పరలోకపు యెరూషలేము స్వాతంత్య్రము కలది. అది మనకు తల్లి.

27. ఏలయన: “ గొడ్రాలా! సంతోషముగ ఉండుము. ప్రసవ , వేదనపడని నీవు కేరింతలు కొట్టుము. ఏలయన, భర్త కలిగిన స్త్రీ కంటెంట్ విడువబడిన స్త్రీకి పిల్లలు ఎక్కువ.”

28. సోదరులారా! అయితే ఈసాకువలె మీరును వాగ్దాన ఫలమగు బిడ్డలు.

29. కాని ఆ దినములలో శారీరకముగ పుట్టిన కుమారుడు ఆత్మవలన పుట్టిన పుత్రుని హింసించినట్లు ఇప్పుడును జరుగుచున్నది.

30. కాని లేఖనము ఏమని చెప్పుచున్నది? “దాసిని, ఆమె కుమారుని వెలుపలకు గెంటివేయుము. ఏలయన, దాసీ కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో బాటు వారసుడుకాడు” అని అది చెప్పుచున్నది.

31. కనుక సోదరులారా! మనము దాసీ సంతానము కాదు, స్వతంత్రురాలి బిడ్డలము.