ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Colossians chapter 4 || RCM Telugu Bible online || కొలొస్సియులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము

 1. యజమానులారా! మీరును మీ సేవకుల యెడల సక్రమముగా న్యాయముగా ప్రవర్తింపుడు. పరలోకములో మీకు కూడ ఒక యజమానుడు కలడను విషయము గుర్తుంచుకొనుడు

2. ప్రార్థనను పట్టుదలతో చేయుడు. ప్రార్థన చేయునపుడు జాగరూకతతో ఉండుడు. దేవుని ఎడల కృతజ్ఞతాభావము కలిగియుండుడు.

3. ఇదే సమయములో మాకొరకు కూడ ప్రార్థింపుడు. దేవుని సందేశమును బోధించుటకును క్రీస్తు రహస్యమును వివరించుటకును దేవుడు మాకు మంచి అవకాశము ఇవ్వవలెనని ప్రార్థింపుడు. అందులకే నేను ఇప్పుడు కారాగారమునందు ఉన్నాను.

4. ఆ విషయమును నేను స్పష్టముగా వివరించు సామర్థ్యము నాకు కలుగునట్లు ప్రార్ధింపుడు.

5. అవిశ్వాసులగు వారితో వ్యవహరించునప్పుడు మీరు, మీకు గల ప్రతి అవకాశమును చక్కగా వినియోగించుకొనుచు వివేకముతో ప్రవర్తింపుడు.

6. మీ సంభాషణ ఎల్లప్పుడును, దయాపూరితముగాను, ఉప్పువేసినట్లుగా రుచికరముగాను ఉండవలెను. ప్రతి వ్యక్తికి సరియైన సమాధానము ఎట్లు చెప్పవలెనో మీకు తెలిసి ఉండవలెను.

7. ప్రియ సోదరుడును, నమ్మకమైన పరిచారకుడును, ప్రభువు కార్యమందు తోడి సేవకుడునైన 'తుకికు' మీకు నన్ను గురించిన అన్ని వార్తలను తెలుపును.

8. ఇందుకొరకే మేము అందరమును ఎట్లు ఉన్నదియు మీకు వివరించి మీ హృదయములను ప్రోత్సాహపరచుట కొరకే నేను అతనిని మీ వద్దకు పంపుచున్నాను.

9. అతనితో పాటు మీ బృందమునకు చెందిన విశ్వసనీయుడైన ప్రియతమ సోద రుడు 'ఒనేసిము' కూడ వచ్చును. ఇచ్చట జరుగుచున్న వానిని అన్నింటిని వారు మీకు చెప్పగలరు.

10. నాతో పాటు కారాగారము నందున్న 'అరిస్టార్కు', బర్నబాకు దగ్గర బంధువైన మార్కు మీకు శుభాకాంక్షలు తెలుపుచున్నారు. (అతడు మీ వద్దకు వచ్చినచో అతనికి స్వాగతము చెప్పవలసినదిగా, అతనిని గురించి మీరు ఇదివరకే ఉత్తరువులు పొందియున్నారు).

11. 'యుస్తు' అనెడి 'యోషువా' కూడ శుభాకాంక్షలు తెలుపుచున్నాడు. సున్నతి పొందిన వీరు మాత్రమే దేవుని రాజ్యము కొరకు నాతో కలిసి పనిచేయుచున్నారు. వీరు నాకు చాల సాయ పడుచున్నారు.

12. మీ బృందమునకు చెందిన మరొక సభ్యు డును, యేసుక్రీస్తు సేవకుడునైన 'ఎపఫ్రా' కూడ అభినందనలు తెలుపుచున్నాడు. మీరు ఎల్లపుడును దృఢముగా నిలబడగలుగునట్లు పరిణతి పొందగలుగునట్లు, దేవుని సంకల్పమునకు సంపూర్ణ విధేయతతో దృఢవిశ్వాసము కలిగి ఉండునట్లును, అతడు దేవుని సర్వదా ప్రార్ధించుచున్నాడు.

13. మీ కొరకును లవోదికయ, హిరాపోలిలలోని ప్రజల కొరకును అతడు పడుచున్న కఠినమైన శ్రమను నేను స్వయముగ ధ్రువపరుపగలను.

14. మన ప్రియతమ వైద్యుడు 'లూకా' మరియు 'డెమాసు' కూడ మీకు శుభాకాంక్షలు తెలుపుచున్నారు.

15. లవోదికయలోని సోదరులకును, నుంఫాకును, ఆమె యింట కూడుచుండు దైవసంఘమునకును నా శుభాకాంక్షలు తెలుపుడు.

16. మీరు ఈ లేఖను చదివిన పిమ్మట ఇది లవోదికయలోని సంఘములో కూడ తప్పనిసరిగా చదువబడునట్లు శ్రద్ధ వహింప గలరు. ఇదే సమయములో లవోదికయ మీకు పంపగల జాబును సైతము చదువవలెను.

17. “దేవుని సేవయందు నీకు అప్పగింపబడిన పరిచర్య పూర్తియగునట్లు శ్రద్ధవహింపుము” అని 'అర్కిప్పు'నకు చెప్పగలరు.

18. పౌలునైన నేను స్వహస్తముతో ఈ శుభాకాంక్షలను వ్రాయుచున్నాను. నా సంకెళ్ళను మరువకుడు! కృప మీకు తోడై ఉండునుగాక!