ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Colossians chapter 3 || RCM Telugu Bible online || కొలొస్సియులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము

 1. మీరు క్రీస్తుతోపాటు సజీవులుగ లేవనెత్త బడితిరి. కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడిప్రక్కన క్రీస్తు తన సింహాసనముపైన అధిష్ఠించి ఉండును.

2. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీదగాక, అచ్చట పరలోకమునందుగల వస్తువులపైన లగ్నము చేయుడు.

3. ఏలయన, మీరు మరణించితిరి. మీ జీవితము క్రీస్తుతోపాటు దేవునియందు గుప్తమై ఉన్నది.

4. మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమ యందు కనబడుదురు.

5. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్షవంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం.

6. ఇటువంటి వానివలన అవిధేయులపై దేవుని ఆగ్రహము వచ్చును.

7. ఒకప్పుడు మీ జీవితములు ఈ కోర్కెలతో ప్రభావితమైయున్నప్పుడు మీరు ఇటువంటి మనుష్యులతో నడుచుకొనెడివారు.

8. కాని ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష్య అనువానినుండి విముక్తులు కావలెను. మీరు ఎప్పుడును దుర్భాషలాడరాదు. అవమానించెడి మాటలను, నిందించెడి మాటలను పలుకరాదు.

9. అబద్దములు ఆడరాదు. ఏలయన, మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు త్యజించి,

10. క్రొత్త స్వభావమును ధరించినారు కదా! తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలిసికొనుటకై మానవుని సృష్టికర్తయైన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు.

11. అందుచేత యూదులని, యూదేతరులని, సున్నతి చేయబడినవారని, చేయ బడనివారని, ఆటవికులని, అనాగరికులని, సేవకులని, స్వతంత్రులని ఎవరును లేరు. క్రీస్తే సర్వస్వము. అందరియందును క్రీస్తు ఉన్నాడు.

12. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు. ఆయనకు పరిశుద్దులును, ప్రియులును అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వి కత, ఓర్పు అలవరచుకొనుడు.

13. ఎవడైనను మరియొకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న యెడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరి నొకరు క్షమింపవలెను.

14. వీనికంటె అధికముగ ప్రేమను అలవరచుకొనుడు. అది అన్నిటిని పరి పూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు.

15. క్రీస్తు ప్రసాదించెడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలయన, ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగ ఉండ పిలువబడితిరి. కనుక కృతజ్ఞులై ఉండుడు.

16. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృ ద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ది చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాళములనుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు.

17. మీరు చేసెడి ప్రతికార్యమును లేక మీరు చెప్పెడి ప్రతిమాటను, తండ్రియైన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను.

18. భార్యలారా! మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందినవారుగ మీరు చేయవలసిన కార్యమిది.

19. భర్తలారా! మీరు మీ భార్యలను ప్రేమింపుడు. వారిపట్ల కఠినముగా ప్రవర్తింపకుడు.

20. బిడ్డలారా! మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోను విధేయులగుడు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతిపాత్రము.

21. తల్లిదండ్రులారా! మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు. ఏలయన, వారికి అధైర్యము కలుగవచ్చునుగదా!

22. దాసులారా! మీరు మీ మానవ యజమానుల ఆదేశములను పాటింపుడు. వారి అనుగ్రహము పొందుటకొరకు, వారు గమనించు చున్నప్పుడు మాత్రమేకాక, దేవునియందు భక్తి కలిగి ఎప్పుడును మీ యజమానుల ఆదేశములను చిత్తశుద్ధితో పాటింపుడు.

23. మీరు ఏ పని చేసినప్పటికిని దానిని చిత్తశుద్ధితో మనుష్యులకొరకు చేయుచున్న కార్యము వలెగాక, దేవుని కార్యముగా భావించి చేయుడు.

24. దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునను విషయమును గుర్తుంచుకొనుడు. ఆయన తన ప్రజలకొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు. మీరు ప్రభువైన క్రీస్తును సేవించుచున్నారు.

25. తప్పుడు పనులు చేయువారు ఎవరైనప్పటికిని, అట్టి తప్పిదములకు ఫలితము అనుభవింపగలరు. ఏలయన, దేవుని యందుపక్షపాతముండదు