ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Colossians chapter 2 || RCM Telugu Bible online || కొలొస్సియులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము

 1. మీ కొరకును, లవోదికయలోని ప్రజల కొరకును, నాకు వ్యక్తిగతముగ తెలియని వారందరి కొరకును, నేను ఎంత తీవ్రముగ పాటుపడినది మీకు చెప్పనిండు.

2. వారి హృదయములు ధైర్యముతో నిండగలవనియు, వారు ప్రేమతో సన్నిహితులు కాగల రనియు, సరియైన అవగాహనవలన లభించు సకల సంపదలను పొందగలరనియు నేను అటుల చేయు చున్నాను. అలాగున వారు దేవుని రహస్యమును గ్రహింపగలరు. ఆ రహస్యమే క్రీస్తు.

3. ఆయన యందు దేవుని వివేక విజ్ఞానముల సంపదలన్నియు గుప్తమైయున్నవి.

4. తప్పుడు వాదములతో ఎవ్వరును మిమ్ము మోసము చేయకుండునట్లును చూచుకొనవలెనని చెప్పుచున్నాను.

5. శరీరరీత్యా దూరము గానున్నను, నేను ఆత్మరీత్యా మీతో ఉన్నాను. క్రీస్తు నందు విశ్వాసముకలిగి మీరు కలిసికట్టుగా దృఢసంకల్పముతో కృతనిశ్చయులైయుండుట చూచి నేను ఆనందించుచున్నాను.

6. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సాహచర్యములో ఉండుడు.

7. ఆయ నను ఆధారముగా చేసికొని, మీ జీవితమును నిర్మించు కొనుడు. మీకు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు. అమితముగ కృత జ్ఞులై ఉండుడు.

8. ఎవడును తమ మోసకరమగు నిరర్థక వాదములతో మిమ్ము వశపరచుకొనకుండ చూచుకొనుడు. ఆ తత్త్వవాదములు క్రీస్తునకు చెందినవి కావు. అవి మనుష్యుల సంప్రదాయములకు, ప్రాపంచిక ప్రాథమిక నియమములకు చెందినవి.

9. దివ్య స్వభావపు పరిపూర్ణత్వము క్రీస్తునందు ఆయన మానవత్వములో ఉన్నది.

10. ఆయన సహచర్యముతో మీకు పూర్ణజీవితము ప్రసాదింపబడినది. సర్వపాలనకు, సర్వాధికారమునకు ఆయన శిరస్సు.

11. ఆయనయందు మీరు సున్నతి పొందితిరి. ఆ సున్నతి మానవులచేగాక క్రీస్తుచే ఏర్పరుపబడినది. అది శరీరేచ్చలతో కూడిన శక్తినుండి మిమ్ము విముక్తి చేయును.

12. మీరు జ్ఞానస్నానము పొందినప్పుడు మీరు క్రీస్తుతోపాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్నానమునందు క్రీస్తుతోపాటు మీరుకూడ లేపబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకుగల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణమునుండి లేవనెత్తెను.

13. మీరు మీ పాపకార్యములవలనను, శరీరమందు సున్నతి చేయబడక పోవుటవలనను, ఒకప్పుడు మీరు ఆధ్యాత్మికముగ మరణించి ఉంటిరి. కాని దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతోపాటు ప్రాణము నిచ్చెను. దేవుడు మన పాపములను అన్నిటిని క్షమించెను.

14. వ్రాతపూర్వకమైన ఆజ్ఞలవలన మన మీద ఋణముగాను, మనకు విరుద్దముగాను ఉండిన పత్రమును ఆయన తన సిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండ తొలగించెను.

15. ఆ సిలువపైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను నిరాయుధులను చేసెను. వారిని బందీలుగా చేసి, తన విజయయాత్రలో నడిపించి అందరకును ఆయన బహిరంగముగా ప్రదర్శించెను.

16. కనుక మీరు ఏమి భుజింపవలెనో, ఏమి త్రాగవలెనో, శాసించుటకుగాని లేక పండుగ దినముల విషయమును గూర్చి నిర్ణయించుటకు గాని లేక క్రొత్త చంద్రోత్సవమును గూర్చి చెప్పుటకుగాని, విశ్రాంతి దినమును గూర్చి నిర్ణయించుటకుగాని, ఎవ్వరును మీకు తీర్పు తీర్చకుండ చూచుకొనుడు.

17. ఇవి అన్నియును భవిష్యత్తులో రాబోవువానికి ఛాయలు మాత్రమే. కాని మూలాధారము క్రీస్తుకే చెందుతుంది.

18. బూటకపు అణకువను చూపుచు, దేవదూతల ఆరాధనలను చేయకోరుచు తాను చూచిన దృశ్యములను గూర్చి మాట్లాడుచు శరీర సంబంధమైన మనసుతో వ్యర్థముగా ఉప్పొంగిపోవుచు ఉండు ఎవడును మిమ్ము ఏమార్చక ఉండునుగాక!

19. అతడు శిరస్సు అయిన క్రీస్తుపై ఆధారపడడు. ఆ శిరస్సు మూలముగ శరీరము అంతయు పోషింపబడి కీళ్ళ చేతను, నరముల చేతను కూర్చబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి చెందుచున్నది..

20. మీరు క్రీస్తుతోపాటు మరణించితిరి. కనుకనే భౌతిక శక్తులనుండి విముక్తులైతిరి. అయినచో మీరు లౌకికులవలె జీవనమును ఏల గడుపుచున్నారు?

21. “దీనిని చేపట్టకుడు”, “దానిని చవి చూడకుడు”, “వేరొకదానిని తాకకుడు” అనెడి ఇట్టి నియమములను మీరు ఏల పాటించుచున్నారు?

22. ఇవి అన్నియు వాడుకొనుటచే నశించిపోవును. ఇవి మానవుడు చేసిన నియమములు, బోధలు మాత్రమే.

23. అవి స్వయముగా కల్పించుకొని ఆచరించు భక్తికృత్యములయందును, బూటకపు నమ్రతయందును, శరీరమును హింసించుకొనుట యందును విజ్ఞత ఉన్నట్లు కనిపింపవచ్చును. కాని శరీరేచ్ఛలను అదుపులో పెట్టుటకు అవి పనికిరావు.