ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 8 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము

 1. ఆనాటి నుండి యెరూషలేములోని సంఘము క్రూరమైన హింసలపాలయ్యెను. అపోస్తలులు తప్ప విశ్వాసులందరు, యూదయా, సమరియా ప్రాంతముల నలుమూలలకు చెల్లాచెదరైరి.

2. కొందరు భక్తులు స్తెఫానును సమాధిచేసి, అతని కొరకై గొల్లుమని ఏడ్చిరి.

3. కానీ, సౌలు సంఘమును నాశనముచేయ ప్రయ త్నించుచు ఇంటింట జొరబడి స్త్రీ పురుషులను బయ టకు ఈడ్చుకొనిపోయి వారిని చెరసాలలో వేయించు చుండెను.

4. చెల్లాచెదరైపోయిన వారు సువార్తను ఎల్లెడల బోధించుచుండిరి.

5. ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తునుగూర్చి అచటి ప్రజలకు ప్రకటించు చుండెను.

6. ప్రజాసమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరు అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచకక్రియలను కన్నులార కాంచుచుండిరి.

7. పలువురు ప్రజలనుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను. పక్షవాతరోగులు, కుంటివారుకూడ బాగు చేయబడిరి.

8. అందుచే ఆ నగరములోని జనులు ఎంతో సంతోషించిరి.

9. అప్పుడు ఆ నగరములో సీమోను అను పేరుగలవాడు ఒకడు నివసించుచుండెను. కొంత కాలముపాటు అతడు తన మంత్రవిద్యచే సమరియా దేశమంతటిని మిక్కిలి ఆశ్చర్యములో ముంచెత్తెను, అతడు తానొక గొప్పవాడనని చెప్పుకొనుచుండెను.

10. అందుచే ఆ నగరమునందలి పిన్నలు, పెద్దలందరు అతడు చెప్పిన దానిని శ్రద్ధతో వినుచుండిరి. 'మహాశక్తి అనబడు దేవుని శక్తి వీడే' అని వారు చెప్పుకొను చుండిరి.

11. అతడు తన మాయలచే వారికి ఎంతో కాలము ఆశ్చర్యమును కలిగించుటచే వారు అతనిని శ్రద్ధతో ఆలకించిరి.

12. కాని ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్తను ప్రకటించుచుండగా వారు, అతనిని నమ్మి, పురుషులును, స్త్రీలును జ్ఞానస్నానము పొందిరి.

13. ఆ బోధను విని, సీమోను కూడ విశ్వసించెను. అందుచే అతడు జ్ఞానస్నానమును పొంది ఫిలిప్పు చెంతనే ఉండెను. ఫిలిప్పు చేయుచుండిన సూచకక్రియలను, గొప్ప అద్భుతములను చూచి నివ్వెరపడెను.

14. సమరియాలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించిరని యెరూషలేమునందలి అపోస్తలులు విని పేతురును, యోహానును ఆ ప్రజలవద్దకు పంపిరి.

15. వీరు అక్కడకు చేరుకొని, వారు పవిత్రాత్మను పొందునట్లుగా ప్రార్థించిరి.

16. ఏలయన, అప్పటికి ఇంకను వారిలో ఎవరి మీదికిని పవిత్రాత్మ వచ్చియుండలేదు. ప్రభువైన యేసునామమున వారు జ్ఞానస్నానమును మాత్రమే పొందియుండిరి.

17. అప్పుడు పేతురు, యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి.

18. అపోస్తలులు వారిపై చేతులు ఉంచగా ఆత్మ వారికి ఒసగ బడుటను సీమోను చూచి పేతురుకు యోహానుకు కొంత డబ్బును ఇచ్చి,

19. “నేను ఎవరిపై చేతులు చాచెదనో వారు పవిత్రాత్మను పొందునట్లుగా నాకును ఈ శక్తిని ఈయుడు” అని వారిని కోరెను.

20. అందుకు పేతురు, “దేవుని వరమును నీవు డబ్బుతో కొనదలంచుచున్నావా? నీవు నీ డబ్బుతో పాటు నాశనమగుదువుగాక!

21. మా పనిలో నీకు భాగముగాని, ప్రవేశముగాని లేదు. ఏలయన, దేవుని దృష్టిలో నీ హృదయము సరిగాలేదు.

22. కనుక నీ దుష్టత్వమునకై పశ్చాత్తాపపడి దేవుని ప్రార్థింపుము. ఈ నీ దురాలోచనను దేవుడు క్షమింపవచ్చును.

23. ఏలయన, నీవు పైత్యపు చేదువంటి దుర్బుద్ధితో పాపమునకు బందీవైతివి అని నాకు తోచుచున్నది” అని బదులు పలికెను.

24. అందుకు సీమోను వారితో “మీరు నన్నుగూర్చి పలికిన వానిలో ఏదియును జరుగ కుండునట్లుగా నాకొరకు ప్రభువును ప్రార్థింపుడు” అని మనవి చేసికొనెను.

25. పేతురు యోహాను సాక్ష్యమిచ్చి, ప్రభువు సందేశమును అందించిన పిదప తిరిగి యెరూషలేమునకు పోయిరి. అటుపోవుచు వారు సమరియాలోని అనేక గ్రామములలో సువార్తను ప్రకటించిరి.

26. ప్రభువు దూత ఫిలిప్పుతో “నీవు లేచి దక్షిణముగా యెరూషలేమునుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము” అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము.

27. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అపుడు నపుంసకుడగు ఇతియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి. ఇతియోపియా రాణియైన కాందాసికి కోశాధికారి. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వచ్చెను.

28. అతడు తిరిగిపోవుచు తనరథముపై కూర్చొని ప్రవక్తయైన యెషయా గ్రంథమును చదువు చుండెను.

29. అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో “నీవు ఆ రథమువద్దకు పోయి దానిని కలిసికొనుము” అని చెప్పగా,

30. ఫిలిప్పు వెంటనే అక్కడకు పరుగెత్తుకొని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువు చుండుట వినెను. అందుచే ఫిలిప్పు “నీవు చదువు చున్నది నీకు అర్థమగుచున్నదా” అని అతనిని ప్రశ్నింపగా,

31. “నాకు ఎవరైన వివరింపనియెడల నేను ఎట్లు అర్థము చేసికొనగలను?” అని ఆ ఉద్యోగి పలికెను. అంతట రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండు మని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను.

32. అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథములోని భాగము ఏదన: “వధింపబడుటకు తీసికొనిపోబడిన గొఱ్ఱెవలెను, ఉన్ని కత్తిరించి వేయబడునప్పుడు మౌనముగా ఉండు గొఱ్ఱెపిల్లవలెను అతడు నోరు తెరువడు.

33. అతడు అవమానింపబడెను. న్యాయము అతనికి నిరాకరింపబడెను. అతని సంతతినిగూర్చి ఎవరును పలుకజాలరు. ఏలయన, అతని జీవము భూమిమీద నుండి తీసివేయబడినది.”

34. అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో “ప్రవక ఎవరిని గురించి ఈ విషయమును చెప్పుచున్నాడు? తనను గూర్చియా? లేక మరియొకనిని గూర్చియా?” అని ప్రశ్నించెను.

35. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖన మును అనుసరించి, యేసును గురించి అతనికి బోధింపనారంభించెను.

36. వారు అట్లు సాగిపోవుచు నీరుగల ఒక ప్రదేశమును చేరిరి. అప్పుడు “ఇదిగో! ఇక్కడ నీరున్నదిగదా! నేను జ్ఞానస్నానమును పొందుటకు ఆటంకమేమి?”అని నపుంసకుడు ఫిలిప్పును ప్రశ్నించెను.

37. అప్పుడు ఫిలిప్పు “నీవు నీ పూర్ణహృదయముతో విశ్వసించినయెడల జ్ఞాన స్నానము పొందవచ్చును” అని అతనితో పలికెను. అప్పుడు అతడు “యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను” అని బదులు పలికెను.

38. ఆ ఉద్యోగి రథమును ఆపివేయనాజ్ఞాపించి తానును ఫిలిప్పును నీటిమడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానమును ఇచ్చెను.

39. వారు ఆ నీటిమడుగునుండి బయటకు వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసికొనిపోయెను. ఆ నపుంసకుడు మరల ఫిలిప్పును చూడలేకపోయినను, సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించెను.

40. అయితే, ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడనుండి అన్ని పట్టణములందును సువార్తను బోధించుచు, కైసరియాను చేరుకొనెను.