ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 7 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము

 1. పిమ్మట ప్రధానార్చకుడు “ఇది నిజమేనా?” అని ప్రశ్నింపగా

2. సైఫాను ఇట్లు పలికెను: “సోదరులారా! తండ్రులారా! నేను చెప్పుదానిని ఆలకింపుడు. మహిమగల దేవుడు మన పూర్వీకుడగు అబ్రహాము హారానుకు వెళ్ళక పూర్వము మెసపొటామియాలో నివసించుచున్నప్పుడు, అతడికి అగుపడి

3. 'నీవు నీ దేశమును నీ బంధువులను వీడి నేను చూపింపబోవు దేశమునకు వెళ్ళుము' అని తెలిపెను.

4. కనుక అతడు కల్దీయుల దేశమును వదలి హారానులో నివసించుటకు పోయెను. అబ్రహాము తండ్రి మరణించిన తరువాత దేవుడు అతనిని ఇప్పుడు మీరు నివసించుచున్న భూమికి తరలివచ్చునట్లు చేసెను.

5. దేవుడు అబ్రహామునకు తన సొంతభూమిగా ఒక అడుగైనను ఇవ్వలేదు. కాని అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దానిని ఇచ్చెదనని వాగ్దానము చేసెను. అయితే దేవుడు ఈ వాగ్దానమును చేయు నప్పటికి అబ్రహామునకు సంతానము లేదు.

6. దేవుడు అబ్రహాముతో 'నీ సంతతివారు విదేశములో నివసించుచు అక్కడవారు నాలుగువందల సంవత్సరములపాటు బానిసలై బాధలకు గురియగుదురు.

7. అయినను వారిని బానిసలుగా చేసిన జనులకు నేను తీర్పు తీర్చెదను. తరువాత వారు ఆ దేశము వీడి ఇక్కడ నన్ను ఆరాధించెదరు' అని పలికెను.

8. దేవుడు తాను చేసిన నిబంధనకు గురుతుగా అబ్రహామునకు సున్నతి ఆచారమును ఒసగెను. అంతట : అబ్రహామునకు ఈసాకు జన్మించెను. జన్మించిన ఎనిమిదవ దినమున ఈసాకునకు అబ్రహాము సున్నతి చేసెను. అట్లే ఈసాకునకు యాకోబును, యాకోబునకు పండ్రెండు గోత్ర కర్తలునుజన్మించిరి.

9. గోత్రకర్తలు యోసేపుపై అసూయ పడి ఐగుప్తునకు అతనిని బానిసగా అమ్మివేసిరి. కాని దేవుడు అతనికి తోడైయుండి

10. కష్టములన్నిటి నుండి అతనిని కంటికి రెప్పవలె కాపాడెను. దేవుడు యోసేపును ఐగుప్తురాజైన ఫరోకు ప్రీతిపాత్రునిగా చేసి, అతనికి తగిన జ్ఞానమును ఒసగెను. అందుచే ఫరో అతనికి తన దేశము పైనను, తన ఇంటి పైనను పెత్తనమును ఇచ్చెను.

11. అటుపిమ్మట ఐగుప్తు దేశమంతటను, కనాను దేశమంతటను, పెను బాధలకు కారణమైన కరువు వచ్చెను. అప్పుడు మన పితరులకు తినుటకు ఏమియు దొరకలేదు.

12. కావున ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, అతడు మన పితరులను మొదటిసారిగా అక్కడకు పంపెను.

13. వారు రెండవసారి వచ్చినపుడు యోసేపు తన సోదరులకు తనను తెలియజేసుకొనెను. అపుడు ఫరో యోసేపు కుటుంబమునుగూర్చి తెలిసి కొనెను.

14. అంతట కుటుంబ సమేతముగా ఐగుప్తునకు తరలిరావలసినదిగా యోసేపు తనతండ్రి యాకోబునకు వర్తమానము పంపెను. వారు మొత్తము డెబ్బదియైదుగురు.

15. యాకోబు ఐగుప్తునకు తరలి వచ్చెను. అతడును తదితరులగు మన పితరులును అచటనే మరణించిరి.

16. అచట నుండి వారి శరీరములు షెకెమునకు తీసికొని రాబడెను. అచట హమోరు కుమారులనుండి అబ్రహాము కొనిన సమాధిలో వారు భూస్థాపితము చేయబడిరి.

17. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసిన కాలము సమీపింపగా ఐగుప్తులో జనులసంఖ్య మిక్కిలి వృద్ధియయ్యెను.

18. చిట్టచివరకు యోసేపును ఎరుగని రాజు ఒకడు ఐగుప్తును పాలింపసాగెను.

19. వాడు మన పూర్వుల యెడల కపటముగా ప్రవర్తించి, తమ శిశువులు బ్రతుకకుండునట్లు వారిని బయట పార వేయవలయునని మన పితరులను బలవంతపరచెను.

20. ఆ సమయములోనే మోషే జన్మించెను. అతడు చక్కనివాడు. దేవునికి ప్రియమైనవాడు. మూడు మాసముల వరకును అతడు తనతండ్రి ఇంటనే పెంచబడెను.

21. పిమ్మట అతడుకూడ బయట వదలివేయబడగా, ఫరో కుమార్తె వానిని తీసికొని, సొంత కొడుకువలె పెంచుకొనెను.

22. అతడు ఐగుప్తుదేశపు శాస్త్రములన్నియు నేర్చుకొని మాటల లోను చేతలలోను ఆరితేరి ఘటికుడాయెను. -

23."మోషేకు నలువదియేండ్ల ప్రాయము వచ్చినప్పుడు తన ప్రజలైన యిస్రాయేలీయులను అతడు చూడ నిశ్చయించుకొనెను. అక్కడ వారిలో ఒకనికి

24. ఐగుప్తు దేశీయునిచే అన్యాయము జరుగుచుండుటను చూచి, మోషే వానికి సహాయపడుటకై వెళ్ళి, ఆ ఐగుప్తుదేశీయుడిని చంపి ప్రతీకారమొనర్చెను.

25. దేవుడు తనద్వారా వారికి స్వాతంత్య్రమును ఈయ నున్నాడని తన ప్రజలు గ్రహింతురని మోషే తలంచెను. కాని వారు ఆ విషయమును అర్థము చేసికొనలేదు.

26. ఆ మరునాడు ఇద్దరు యిస్రాయేలీయులు పోట్లాడుకొనుచుండిరి. అదిచూచి మోషే “అయ్యలారా! మీరు సహోదరులుగదా! మరి మీరు ఏల కొట్టుకొను చున్నారు?" అని వారిద్దరిని సమాధానపరచుటకై ప్రయత్నించెను.

27. కాని, తన పొరుగువానికి అన్యాయము చేయుచున్నవాడు మోషేను ఒక ప్రక్కకు నెట్టివేసి, 'నిన్ను ఎవరు మా అధికారిగను, తీర్పరిగను నియమించిరి?

28. నిన్న నీవు ఐగుప్తు దేశీయుని చంపినట్లుగా నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా?' అనెను.

29. మోషే అది విని ఐగుప్తు నుండి పారిపోయి, మిద్యాను సీమలో నివసింపసాగెను. అక్కడ అతనికి ఇరువురు కుమారులు కలిగిరి.

30. “నలువది సంవత్సరములు గడచిన తరువాత ఒకనాడు సీనాయి పర్వతపు ఎడారియందు మండుచున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనబడెను.

31. అది చూచి మోషే ఆశ్చర్యపడి ఇంకను బాగుగా చూడవలెనని దగ్గరకు పోగా,

32. 'నేను నీ పూర్వులగు అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడను' అని ప్రభువు స్వరము వినబడెను. అది విని మోషే భయముతో గడగడవణకెను. అందుచే మరల ఆ వైపు కన్నెత్తి చూచుటకు అతనికి ధైర్యము చాలలేదు.

33. అప్పుడు ప్రభువు అతనితో, 'నీవు నీ పాదరక్షలను విడిచివేయుము. ఏలయన, నీవు నిలుచున్న ఈ స్థలము పవిత్రమైనది.

34. ఐగుప్తులో నా జనులు పడుచున్న క్రూరమైన బాధలను నేను చూచితిని. వారి మొర నాకు వినబడినది. కనుక, వారిని రక్షించుటకు నేను దిగివచ్చితిని. రమ్ము, నేను నిన్ను ఐగుప్తునకు పంపెదను' అని పలికెను.

35. “ప్రజలచే నిరాకరింపబడిన మోషే ఇతడే. 'నిన్నెవరు మా అధికారిగను, తీర్పిరిగను నియమించిరి?” అని ఆ ప్రజలు ప్రశ్నించిన వానినే దేవుడు మండుచున్న పొదలో కనబడిన దేవదూత ద్వారా అధికారిగను, విమోచకునిగను నియమించి పంపెను.

36. అతడు ఐగుప్తులోను, రెల్లు సముద్రము వద్దను, నలువది సంవత్సరముల పాటు ఎడారిలోను, మహత్కార్యము లను, సూచకక్రియలను చేసి వారిని తరలించుకొని వచ్చెను.

37. 'నన్ను పంపినట్లే మీ సొంతజనుల నుండి దేవుడు మీ కొరకు ఒక ప్రవక్తను పంపును' అని యిస్రాయేలు ప్రజలతో పలికినది ఇతడే.

38. ఎడారిలో సంఘమందు యిస్రాయేలు ప్రజలతో ఉండినవాడు ఇతడే. ఇతడు మన పూర్వులతోను, సీనాయి పర్వతముపై తనతో మాటలాడిన దేవదూత తోను అచట ఉండెను. ఇతడు మనకు ఇచ్చుటకుగాను దేవుని జీవవాక్కులను పొందెను.

39. కాని మన పూర్వులు ఇతనికి విధేయులు కాక, ఇతని మాటలు వినక తిరస్కరించి, మరల ఐగుప్తునకు పోవలెనని వాంఛించిరి.

40. అందుచే వారు అహరోనుతో, ఐగుప్తునుండి మమ్ము తీసికొని వచ్చిన మోషే ఏమయ్యెనో మాకు తెలియదు. మా ముందుండి నడిపించుటకు కొందరు దేవుళ్ళను చేయుము' అనిరి.

41. అప్పుడు వారు ఆవుదూడ ఆకారముగానొక విగ్రహమును చేసి దానికి బలిని అర్పించి తమ చేతులతో చేసిన దానిని గూర్చి సంతోషముతో పండుగ చేసికొనిరి.

42. అందుచే దేవుడు విముఖుడై ఆకాశములోని నక్షత్రములను పూజించుటకు వారిని వదలివేసెను. ప్రవక్త గ్రంథములో, 'యిస్రాయేలు ప్రజలారా! మీరు నలువది సంవత్సరములపాటు ఎడారిలో గడిపినపుడు జంతు బలులను, నైవేద్యములను నాకు సమర్పించితిరా!

43. మీరు మోలెకు అను దేవుని గుడారమును, రెఫాను అను దేవుని నక్షత్రమును భుజములపై మోసికొని పోయితిరి. మీరు చేసిన విగ్రహములను మాత్రమే మీరు ఆరాధించితిరి. కావున నేను మిమ్ములను బబులోనియా ఆవలకు ప్రవాసులనుగా పంపివేసెదను' అని వ్రాయబడియున్నది.

44. “ఎడారిలో ఉన్నప్పుడు మన పూర్వులు తమ వద్ద దైవసమక్షపు గుడారములను కలిగియుండిరి. తనకు చూపబడిన నమూనా ప్రకారము దేవుడు తనకు చెప్పినట్లు మోషే దానిని చేసియుండెను.

45. మన పితరులు కూడ దానిని యెహోషువతో పాటు వెంట తీసికొనిపోయిరి. అనంతరము వారు దేవునిచే తరిమి వేయబడిన జనులనుండి భూభాగమును స్వాధీన మొనర్చుకొనిరి. దావీదు కాలమువరకును దైవసమక్షపు గుడారము అచటనే ఉండెను.

46. అతడు దేవుని అభిమానమును పొందినవాడై, యాకోబు దేవునికి ఒక ఆలయమును కట్టుటకు అనుమతిని అడిగెను.

47. కాని దేవునికి ఆలయమును నిర్మించినవాడు సొలోమోను.

48. అయినప్పటికిని మహోన్నతుడైన సర్వే శ్వరుడు మానవులచే కట్టబడిన ఇండ్లలో నివసింపడు. అందులకే ప్రవక్త చెప్పినదేమనగా: .

49. 'ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా కొరకు మీరు ఎటువంటి ఇల్లు కట్టెదరు? నా విశ్రాంతి స్థలము ఎక్కడ?

50. ఇవి అన్నియు చేసినది నేను కాదా?” అని ప్రభువు చెప్పుచున్నాడు.

51. మీరు ఎంత మూర్చులు! దేవుని సందేశ మును తిరస్కరించు మీ హృదయములందును, మీ చెవులయందును సున్నతిలేని వారివలె ఉన్నారు. మీ పితరులవలెనే మీరు కూడ ఎల్లప్పుడు పవిత్రాత్మను ఎదిరించుచున్నారు.

52. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపినవారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టియిచ్చి చంపితిరి.

53. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడచుటలేదు!”

54. ఆ విచారణసభలోని సభ్యులు సైఫాను చెప్పినది విని మండిపడి, అతనివంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి.

55. అయినను స్తెఫాను పవిత్రాత్మతో నిండినవాడై, పరలోకమువైపు చూడగా, అతనికి దేవుని మహిమయు, దేవుని కుడి పక్కన యేసు నిలువబడి ఉండుటయు కనబడెను,

56. అప్పుడు అతడు “చూడుడు! పరలోకము తెరువబడియున్నట్లు నాకు కనబడుచున్నది. మరియు మనుష్యకుమారుడు  దేవుని కుడి ప్రక్కన నిలువబడియున్నాడు" అని పలికెను.

57. ఇది విని వారందరును కేకలువేయుచు చెవులు మూసికొనిరి. పిమ్మట వారందరు ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొనిపడిరి.

58. అతనిని నగరము బయటకు తరుముకొనిపోయి, రాళ్ళతో కొట్టిరి. సాక్షులు తమ పైవస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదములచెంత వానిని ఉంచిరి.

59. వారు ఇంకను రాళ్ళతో కొట్టుచుండగా సైఫాను “యేసుప్రభూ! నా ఆత్మను గైకొనుము” అని ప్రార్థించెను.

60.ఆపై మోకరిల్లి బిగ్గరగా "ప్రభూ! ఈ పాపము వీరిపై మోపకుము” అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను