ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 6 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము

 1. కొంతకాలము గడచిన పిదప, శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడేడి యూదులు, హెబ్రీయుల మీద సణుగసాగిరి

2. అందుచే పన్నిద్దరు అపోస్తలులు శిష్యుల సంఘమంతటిని కూడ పిలిచి, “దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు, ఈ ఆహార పరిచర్యల యందు నిమగ్నులమై ఉండుట మాకు యుక్తము కాదు.

3. కావున సోదరులారా! మీలో పవిత్రాత్మతో నిండినవారిని, జ్ఞానము గలవారిని, మంచిపేరు గలవారిని ఏడుగురిని ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పజెప్పెదము.

4. అపుడు మేము మా సమయమును అంతయు, ప్రార్థించుటకును, వాక్యపరిచర్యకు నిరంతరముగ ఉపయోగించేదము" అని చెప్పిరి.

5. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోను, పవిత్రాత్మతోను నిండిన స్తెఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మతావలంబకుడును, అంతియోకియాకు చెందిన వాడైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి.

6. సంఘస్థులు వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టగా, అపోస్తలులు ప్రార్థనచేసి వారిపై చేతులుంచిరి.

7. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడ పెద్దసంఖ్యలో విశ్వసించిరి.

8. సైఫాను దైవానుగ్రహముతోను, శక్తితోను నిండినవాడై ప్రజలమధ్య గొప్ప అద్భుతములను, సూచకక్రియలను చేయుచుండెను.

9. అప్పుడు ప్రార్ధనా మందిరానికి చెందిన “స్వతంత్రులు” అనబడువారి సమాజములో కొందరు, కురేనీయుల సమాజములో కొందరు, అలెగ్జాండ్రియుల సమాజములో కొందరు, సిలీషియా ఆసియాలనుండి వచ్చిన మరికొందరు సైఫానుతో వాదింప మొదలు పెట్టిరి.

10. మాటలా డుటయందు అతడు కనపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి.

11. పిమ్మట “ఇతడు మోషే మీదను, దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి” అని చెప్పుటకై వారు కొందరిని కుదుర్చుకొనిరి.

12. ఈ రీతిగా వారు ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకముగా పురికొల్పిరి. అప్పుడు వారు స్తెఫానువద్దకు వచ్చి బంధించి అతనిని న్యాయసభ ఎదుటకు తీసికొనివచ్చిరి.

13. అతనిని గురించి అబద్ధపు సాక్ష్యములు చెప్పించుటకు వారు కొందరిని తెచ్చిరి. అప్పుడు వారు “ఇతడు ఎల్లప్పుడు మన పవిత్ర దేవాలయమునకు, మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాటలాడుచున్నాడు.

14. ఎట్లన, నజరేతుకు చెందిన యేసు దేవాలయమును కూలగొట్టుననియు, మోషే వద్దనుండి మనకు పారంపర్యముగా వచ్చిన ఆచారములను మార్పుచేయు ననియు చెప్పుచుండ మేము వింటిమి” అని వారితో చెప్పించిరి.

15. అక్కడ ఆ న్యాయసభలో కూర్చున్న వారందరు స్తెఫానువైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనిపించెను.