ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 4 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము

 1. పేతురు, యోహాను జనులతో ఇంకను మాట్లాడుచుండగా అర్చకులును, దేవాలయపు అది . పతియు, సద్దూకయ్యులును వారిపైకి వచ్చిరి.

2. చనిపోయినవారు మరల జీవముతో లేతురను సత్యమునకు నిదర్శనముగా, యేసు మృతులలోనుండి లేచెనని ఆ ఇద్దరు అపోస్తలులు ప్రజలకు బోధించుట చూచి, ఆ అధికారులు మండిపడిరి.

3. వారిని పట్టి బంధించి, అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు, ఆ అధికారులు వారిని చెరసాలయందు ఉంచిరి.

4. అయినను వాక్కును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి ఐదువేలయ్యెను.

5. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి.

6. ప్రధానయాజకుడైన అన్నా, కైఫా, యోహాను, అలెగ్జాండరు ప్రధానయాజకుని కుటుంబమునకు చెందినవారందరు వారితో ఉండిరి.

7. వారు ఈ ఇద్దరు అపోస్తలులను వారి ఎదుట నిలువబెట్టి, “మీరు ఏ శక్తితో, ఎవరి నామమున దీనిని చేసితిరి?” అని వారిని ప్రశ్నింపగ,

8. పేతురు పవిత్రాత్మతో పూరితుడై “ప్రజానాయకులారా! పెద్దలారా!

9. ఈ కుంటివానికి జరిగిన మేలునుగూర్చి అతడు ఎట్లు బాగుచేయబడెనని మీరు ఈనాడు మమ్మును ప్రశ్నించుచున్నారు.

10. మీరును, యిస్రాయేలు ప్రజలందరును తెలుసుకొనవలసినది ఇదియే: మీచేత నిలువ వేయబడినవాడును, మృతులలోనుండి దేవునిచేత లేపబడినవాడునైన నజరేయుడగు యేసుక్రీస్తు నామముననే ఈ మనుష్యుడు పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచియున్నాడు.

11. ఇల్లు కట్టు వారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అదియే ఇంటికి మూలరాయి అయినది.

12. ఆయన యందు తప్ప వేరొకనియందు రక్షణము లేదు. ఏలయన, ఆకాశముక్రింద రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు” అని వారికి సమాధాన మిచ్చెను.

13. చదువురాని ఈ సాధారణ మనుష్యులగు పేతురు, యోహానులు అంత ధైర్యముగా సమాధాన మిచ్చుటచే ఆ సభాసభ్యులు ఆశ్చర్యపడిరి. వారిద్దరు నిజముగా యేసు యొక్క సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి.

14. ఆ స్వస్థపరుపబడిన వాడు పేతురు, యోహానులతో అక్కడే నిలువబడి ఉండుట చూచి, ఆ అధికారులు ఏమియు ఎదురు చెప్పలేక పోయిరి.

15. కనుక ఆ అధికారులు వారిని బయటకు పొమ్మని చెప్పి, వారిలో వారు చర్చించుకొనసాగిరి.

16. “మనము వీరిని ఏమి చేయుదము? వీరు చేసిన ఈ అసాధారణమైన అద్భుతము యెరూషలేములో నివసించు ప్రతివానికి తెలియును. మనము దీనిని కాదనలేము.

17. అయినను ఈ విషయము ఇకపై ప్రజలలోనికి ప్రాకిపోకుండ వారు ఇంకెన్నడును యేసు పేరిట ఎవరితోను మాట్లాడరాదని హెచ్చరింతము” అని నిశ్చయించిరి.

18. కనుక వారు వారిని లోనికి పిలిపించి, యేసు పేరిట వారు ఎంత మాత్రము మాట్లాడరాదనియు, బోధింపరాదనియు ఆజ్ఞాపించిరి.

19. “మేము మీ మాటను పాటింపవలయునా? లేక దేవుని మాట పాటింపవలయునా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు.

20. ఏలయన, మేము మా కన్నులార చూచినదానిని గూర్చి, చెవులార విన్నదానిని గూర్చి మాట్లాడకుండ ఉండలేము” అని పేతురు, యోహానులు వారికి బదులు పలికిరి.

21. ఆ కుంటివానికి జరిగిన అద్భుతమునకై ప్రజలందరు దేవుని స్తుతించుచుండుటచే సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వారిని మరింత గట్టిగా బెదరించి వదలిపెట్టిరి.

22. అద్భుతమువలన స్వస్తుడైన ఆ కుంటివాని  ప్రాయము నలువది సంవత్సరములకు పైబడియుండెను.

23. విడుదల చేయబడిన వెంటనే పేతురు, యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి ప్రధానార్చకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి.

24. అది విని వారందరుకలని దేవుని ఇట్లు ప్రార్థించిరి: “పరలోకమును, భూలోకమును, సముద్రమును వానిలోనుండు సమస్తమును సృష్టించిన ఓ ప్రభూ!

25. పవిత్రాత్మ మూలమున నీ సేవకుడును, మా తండ్రియునైన దావీదు ద్వారా నీవు ఇట్లు చెప్పియుంటివి: 'అన్య జనులు ఏల కోపమున చెలరేగుచుండిరి? వ్యర్ధమైన విషయములను గూర్చి జనులు ఏల యోచించుచుంటిరి?

26. ప్రభువునకు, ఆయన అభిషిక్తునకు విరుద్ధముగా భూలోకములోని రాజులు లేచిరి. అధికారులు ఒక్కుమ్మడిగా కూడిరి'.

27. నీవు అభిషేకించిన నీ పావన సేవకుడైన యేసుకు విరోధముగా అన్యజనులతోను, యిస్రా యేలు ప్రజలతోను హేరోదును, పొంతిపిలాతులు నిజముగా ఈ నగరమందు ఏకమైరి.

28. నీవు నీ హస్తముతోను, సంకల్పముతోను ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమైరి.

29. ఓ ప్రభూ! వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుము. నిండు ధైర్యముతో నీ సందేశమును గూర్చి మాట్లాడుటకు నీ సేవకులమైన మమ్ము అనుమతింపుము.

30. స్వస్థపరచుటకై నీ హస్తమును చాపుము. మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుము.”

31. వారు ఇలా ప్రార్థింపగా, వారు ఉన్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరు, పవిత్రాత్మతో నింవబడి ధైర్యముతో దేవునివాక్కును గూర్చి మాట్లాడసాగిరి.

32. విశ్వసించిన వారందరు ఒకే మనస్సుతోను, ఒకే హృదయముతోను జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను 'ఇది నా సొంతము' అని ఎవడును చెప్పుకొనుటలేదు. వారికి ఉన్నదానిని అందరు పంచుకొనుచుండిరి.

33. ప్రభువైన యేసు పునరుత్థానమునుగూర్చి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను.

34. వారిలో ఏ ఒక్కనికిని కొరతలేదు. ఏలయన, పొలముగలవారు, ఇండ్లుగలవారు వానిని అమ్మి, వచ్చిన పైకమును,

35. అపోస్తలుల పాదములయొద్ద వుంచుచుండిరి. ఆ పైకము వారివారి అవసరములకు తగినట్లు పంచి పెట్టుచుండిరి.

36. సైప్రసు దేశమున జన్మించిన లేవీయుడగు యోసేపు అనువాడు ఒకడు ఉండెను. వానిని అపోస్తలులు 'బర్నబా' అని పిలుచుచుండిరి. (బర్నబా అనగా, 'ఉత్సాహపరచువాడు' అని అర్థము)

37. అతడు తన సొంతభూమిని అమ్మి, వచ్చిన పైకమును తెచ్చి అపోస్తలుల పాదములచెంత పెట్టెను.