1. ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యహ్నము మూడుగంటల వేళకు పేతురు, యోహాను దేవాలయమునకు వెళ్ళిరి.
2. ఆ దేవాలయమునకు “అందమయినది” అని పిలువబడెడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టుకుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయము లోనికి పోవువారినుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివానిని ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారమువద్దకు మోసికొని వచ్చుచుండెడివారు.
3. ఆనాడు పేతురు, యోహానులు దేవాలయములోనికి పోవుచున్నప్పుడు, ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను.
4. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి, పిమ్మట యోహానుతో పాటు “మా వైపు చూడుము” అని వానితో చెప్పగా,
5. వాడు వారేమైన ఇచ్చెదరేమో నని ఆశతో వారి వంక చూచెను.
6. అప్పుడు పేతురు “నా దగ్గర వెండి, బంగారమేమియు లేదు. నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము” అని పలికి
7. వాని కుడిచేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు, మడమలు బలపడగా,
8. వాడు ఎగిరిగంతువేసి, నిలువబడి, అటునిటు నడువసాగెను. అంతట వాడు నడుచుచు, గంతులు వేయుచు, దేవుని స్తుతించుచు వారితో కలసి దేవాలయములోనికి పోయెను.
9. అప్పుడు అచటనున్న జనసమూహమంతయు ఆ కుంటివాడు నడచుటను, దేవుని స్తుతించుటను చూచిరి.
10. ఈ దేవాలయపు అందమయిన ద్వారమువద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని వారు గుర్తుపట్టి, జరిగినదానిని గూర్చి విస్మయము చెంది పరవశులైరి.
11. పేతురు, యోహానులను అతడు అంటిపెట్టుకొనియుండగా, ప్రజలందరు ఆశ్చర్యపడి సొలోమోను మంటపమువద్దకు పరుగెత్తివచ్చిరి.
12. పేతురు వారిని చూచి, “యిస్రాయేలు ప్రజలారా! మీరేల దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరేల ఇట్లు రెప్పవేయక మావైపు చూచుచున్నారు? మేము మా స్వశక్తిచేతగాని, భక్తిచేతగాని ఈ మనుష్యుని నడిపించితిమని అనుకొనుచున్నారా?
13. అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు, తన సేవకుడైన యేసును మహిమపరచి యున్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదలి పెట్ట నిశ్చయించినప్పటికిని, మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి.
14. ఆయన పవిత్రుడు, నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయుమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయుమని అడిగితిరి.
15. కనుక, మీరు జీవనకర్తను చంపి యున్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము.
16. ఆయన నామమునందలి విశ్వాసము మూలమున, ఆయన నామమే, మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచినది. ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగచేసెను.
17. సోదరులారా! మీరు, మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియును.
18. కాని తన మెస్సయా బాధలు పడవలెనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను.
19. మీరు హృదయపరివర్తన చెంది, దేవునివైపు మరలిన యెడల, ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షమునుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతికాలములు వచ్చునట్లు,
20. మీ కొరకు నియమింపబడిన క్రీస్తు అనబడు. యేసును ఆయన మీకు పంపును.
21. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తలద్వారా పలికినది అంతయు నెరవేర్చుకాలము వచ్చువరకు యేసు పరలోకమందు ఉండవలెను.
22. ఏలయన. 'ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజలనుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చెప్పునదంతయు మీరు వినవలెను.
23. ఆ ప్రవక్త చెప్పెడు దానిని విననివాడు ఎవడైనను, దైవప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును' అని మోషే చెప్పెను.
24. సమూవేలు, అతని తరువాత వచ్చిన ప్రవక్తలందరును, ఈ దినములను గురించి ముందే ఎరిగించి ఉండిరి.
25. దేవుడు మీ కొరకే తన ప్రవక్తలద్వారా వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధనయందు మీరు వారసులు. 'నీ సంతానము ద్వారా, నేను లోకములో ఉన్న ప్రజలందరిని ఆశీర్వదింతును', . అని దేవుడు అబ్రహాముతో ఒప్పందము చేసికొనెను.
26. కనుక, మీలో ప్రతివాడు తన దుష్టత్వము నుండి మరలునట్లు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపియున్నాడు” అని వారితో చెప్పెను. .