1. అప్పుడు పౌలు సభ వారి వంక తిన్నగా చూచి, "సోదరులారా! నేను నేటివరకు దేవుని సమక్షములో, మంచి మనస్సాక్షిగలవాడనై జీవించితిని" అని పలికెను.
2. అది విని ప్రధానార్చకుడైన అననియా పౌలు నోటిపై కొట్టుడని దగ్గర నిలువబడి ఉన్నవారికి ఆజ్ఞాపించెను.
3. పౌలు అననియాతో, “సున్నముకొట్టిన గోడా! దేవుడు నిన్ను కొట్టును. నీవు చట్ట ప్రకారము నన్నుగూర్చి న్యాయవిచారణ చేయుటకు కూర్చుండియున్నావు. కాని, నన్ను కొట్టుమని ఆ పించి ఆ చట్టమును ఉల్లంఘించుచున్నావు” అని పలికెను.
4. అప్పుడు పౌలుకు దగ్గరలో ఉన్నవారు, “నీవు దేవుని ప్రధానార్చకుని అవమానించుచున్నావా?” అనగా పౌలు,
5. "సోదరులారా! అతడు ప్రధానార్చకు డని నాకు తెలియదు. ఏలయన, 'నీవు నీ ప్రజాపాలకుని గూర్చి చెడుగా మాట్లాడరాదు' అని వ్రాయబడియున్నది” అని వారికి బదులుపలికెను.
6. ఆ సభలోని వారిలో కొందరు సదూకయ్యులని, మరికొందరు పరిసయ్యులని గ్రహించి పౌలు వారితో, “సోదరులారా!' నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను, మరణించినవారు మరల జీవముతో లేతురని నా నమ్మకము. అందువలననే నేనిపుడు విచారింపబడుచున్నాను” అనెను.
7. అది వినగానే పరిసయ్యులు, సదూకయ్యులు కలహించు కొనసాగిరి. ఆ సభ రెండు పక్షములుగా చీలిపోయెను.
8. ఏలయన సదూకయ్యులు మృతుల పునరుత్థానము లేదని, దేవదూతగాని, ఆత్మగాని లేదని చెప్పుదురు. కాని పరిసయ్యులు ఇవి కలవని నమ్ముదురు.
9. అందుచే కేకలింకను పెద్దవైనవి. పరిసయ్యుల పక్షమునకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి, “ఈ మనుష్యునిలో మాకు ఏమియు దోషము కనిపించుటలేదు. బహుశః ఆత్మగాని, దేవదూతగాని నిజముగా ఇతనితో మాట్లాడియుండవచ్చును” అని గట్టిగా వ్యతిరేకించిరి.
10. వాదము తీవ్రము కాగా, వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చి వేయుదురేమో అని సైన్యాధిపతి భయపడి, తన సైనికులకు సభలో ఉన్న పౌలును దూరముగా తీసికొనిపోయి కోట లోపల ఉంచుడని ఆజ్ఞాపించెను.
11. మరునాటి రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలువబడి, “ధైర్యముగా ఉండుము. ఇచట యెరూషలేములో, నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చినట్లే నీవు రోమునందు కూడ చేయవలెను” అని పలికెను.
12. మరుసటి దినమున యూదులు ఒకచోట కలిసికొని కుతంత్రముచేసి, పౌలును చంపువరకును అన్నపానీయములు ఏవియు ముట్టకూడదని శపథము చేసిరి.
13. ఈ కుట్రలో పాల్గొనిన వారు మొత్తము నలువది మందికి పైగా ఉండిరి.
14. అప్పుడు వారు ప్రధాన అర్చకులయొద్దకు, పెద్దలయొద్దకు పోయి, “పౌలు ప్రాణములు తీయువరకు అన్నపానీయములు ముట్టరాదని మేము ఒక శపథము చేసికొంటిమి.
15. కనుక ఇప్పుడు మీరును, విచారణ సభయు పౌలును మీ వద్దకు తీసికొని రావలసినదిగా సైన్యాధి పతికి వర్తమానము పంపుడు. అతనిని గూర్చి మీరు ఇంకను లోతుగా విచారింపవలసి ఉన్నట్లు నటింపుడు. అతడు ఇచ్చటకు చేరకమునుపే అతనిని సంహరించు టకు మేము సిద్ధముగా ఉందుము” అని వారితో చెప్పిరి.
16. పౌలు సోదరి కుమారుడు ఈ కుట్రను గురించి విని కోటలోనికి పోయి, ఈ విషయమును పౌలుతో చెప్పెను,
17. అప్పుడు పౌలు శతాధిపతు లలో ఒకనిని పిలిచి, “ఈ యువకుని సైన్యాధిపతి చెంతకు తీసికొని పొమ్ము. ఇతడు అతనికేదో చెప్పవలసి ఉన్నది” అనెను.
18. శతాధిపతి ఆ యువకుని సైన్యాధిపతియొద్దకు తీసికొనిపోయి “బంధితుడగు పౌలు నన్ను పిలిచి ఈ యువకుని మీయొద్దకు తీసికొనిపొమ్మని కోరినాడు. ఇతడు మీకు చెప్పవలసిన విషయమేదో ఉన్నది” అని అతనితో చెప్పెను.
19. సైన్యాధిపతి అతని చేయిపట్టుకొని తానే స్వయముగా ప్రక్కకు తీసికొనిపోయి, “నీవు చెప్పదలచినదేమి?” అని ప్రశ్నింప,
20. ఆ యువకుడు సైన్యాధిపతితో, “పౌలును గురించి సరియైన సమాచారము తెలిసికొన వలెను అను నెపముతో అతనిని రేపు న్యాయసభలోనికి రప్పింపవలెనని, యూదులు మిమ్ము అడుగ నిశ్చయించుకొనినారు.
21. కాని, మీరు వారి మాట వినవలదు, ఏలయన, నలువదిమందికి పైగా వారిలోని వారు పౌలుకొరకు పొంచి కాచుకొనియున్నారు. వారందరు పౌలును చంపువరకు అన్నపానీయములు ముట్టరాదని శపథము చేసి మీ నిర్ణయమునకై నిరీక్షించుచున్నారు” అని మనవి చేసెను.
22. సైన్యాధిపతి ఆ యువకునితో, “ఈ విషయమును నీవు నాకు తెలియపరచినట్లు ఎవరికిని చెప్పవలదు" అని హెచ్చరించి పంపివేసెను.
23. అప్పుడు సైన్యాధిపతి ఇద్దరు శతాధి పతులను పిలిచి, వారితో, “ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరియాకు వెళ్ళుటకు రెండువందల మంది సైనికులను, వారితో కూడ డెబ్బదిమంది ఆశ్వికులను రెండువందల మంది కాల్బలమును సిద్ధపరుపుడు.
24. పౌలు కొరకు కొన్ని గుఱ్ఱములను సిద్ధము చేయుడు. అతనిని అధిపతియైన ఫెలిక్సు వద్దకు క్షేమముగా చేర్చుడు” అని ఆజ్ఞాపించి,
25. ఫెలిక్సుకు ఈ విధముగా ఉత్తరము వ్రాసెను:
26. "గౌరవనీయులగు ఫెలిక్సు అధిపతికి కౌదియా లీసియా అభివందనములు.
27. ఈ మనుష్యుని యూదులు చుట్టుముట్టి పట్టుకొని చంప బోవుచుండ, ఇతడు రోము పౌరుడని నేను తెలిసికొని నా సైనికులతో వెడలి అతనిని తప్పించితిని.
28. ఇతని మీద వారు ఏమి నేరము మోపిరో తెలిసికొన వలెనని నేను ఇతనిని వారి విచారణ సభకు తీసికొని వెళ్ళితిని.
29. కాని, ఇతడు చెరసాలకుగాని లేదా మరణశిక్షకుగాని తగిన నేరమేమియు చేయలేదని నేను గ్రహించితిని. వారి ధర్మశాస్త్రమునకు సంబంధించిన నేరములు కొన్ని ఇతనిపై మోపబడినవి.
30. మరియు యూదులు ఇతనిపై కుట్ర పన్నుచున్నారను సమాచారము నాకు చేరగానే నేను ఇతనిని మీ చెంతకు పంప నిశ్చయించితిని. ఇతనికి వ్యతిరేకముగా వారి ఫిర్యాదులు ఏమైన ఉన్నచో వాటిని మీ ముందు ఉంచవచ్చునని నేను ఆ నేరారోపకులకు చెప్పితిని, మీకు శుభమగుగాక!”
31. సైనికులు వారికి ఈయబడిన ఆజ్ఞలను శిరసావహించి పౌలును ఆ రాత్రి యందే అంతిపత్రికి తీసికొనిపోయిరి.
32. మరునాడు ఆశ్వికులను అతనికి రక్షణగా ఉంచి కాల్బలము వెనుదిరిగి కోటకు వచ్చెను.
33. వారు అతనిని కైసరియాకు తీసికొనిపోయి అధిపతికి లేఖను అందించి పౌలును అతనికి అప్పగించిరి.
34. అధిపతి ఆ లేఖను చదువుకొని “నీవు ఏ ప్రదేశమునుండి వచ్చినవాడవు?” అని పౌలును ప్రశ్నించి, అతడు సిలీషియా వాడని తెలిసికొని,
35. “నీపై నేరము మోపినవారు వచ్చిన తరువాత, నిన్ను విచారించెదను" అని పలికెను. పిదప, పౌలును హేరోదు మందిరములో కావలివారి సంరక్షణలో ఉంచుడని ఆజ్ఞాపించెను.