ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 22 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము

 1. "సోదరులారా! తండ్రులారా! నా పక్షమున నేను చెప్పుకొనబోవు మాటలను ఆలకింపుడు”.

2. అతడు హీబ్రూ భాషలో మాట్లాడుట విని వారు మొదటి కంటె ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు పౌలు ఇట్లు మాట్లాడసాగెను.

3. “నేను సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను. కాని ఇక్కడ యెరూషలేమునందే పెరిగి, గమాలియేలు వద్ద విద్యాభ్యానము గావించితిని. మన పూర్వుల చట్టమును గూర్చి, గట్టి ఉపదేశము పొందితిని. ఈనాడు ఇటనున్న మీరు అందరును దేవునకు మిమ్ము మీరు అంకితము కావించుకొనినట్లే నేనును నన్ను నేను అంకితము కావించుకొంటిని.

4. ప్రభు మార మును అనుసరించిన ప్రజలను మరణము పాలగు నట్లు హింసించితిని. స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడవేయించితిని.

5. ప్రధానార్చకుడును, విచారణసభలోని సభ్యులు అందరును నేను చేసిన దానికి సాక్షులు. నేను వారియొద్దనుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసికొనివచ్చి, యెరూషలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి, తీసికొని వచ్చుటకై అటకు వెళ్ళితిని.

6. "అట్లు నేను పయనించి, దమస్కు సమీపించి నప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశమునుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టును ప్రకాశించినది.

7. అప్పుడు నేను నేలమీద పడిపోగా, 'సౌలూ! సౌలూ! నీవు ఏల నన్ను హింసించుచున్నావు?” అని ఒక స్వరము నాకు వినిపించినది.

8. నేను 'ప్రభువా! నీవు ఎవరవు?” అని అడిగితిని. 'నేను, నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును' అని ఆయన నాతో చెప్పెను.

9. అప్పుడు నా వెంటనున్నవారు వెలుగును చూచిరి గాని, నాతో మాట్లాడుచుండినవాని స్వరమును మాత్రము వినలేదు.

10. 'ప్రభూ! నేను ఏమి చేయవలెను?' అని ప్రశ్నింపగా, ఆయన, 'లేచి దమస్కుపురమునకు పొమ్ము. నీవు ఏమి చేయవలెనని దేవుడు నిశ్చయించెనో అది అంతయు అక్కడ నీకు తెలుపబడును' అని నాతో పలికెను.

11. కన్నులు మిరుమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటచే, నేను ఏదీ చూడలేకపోతిని. అందుచే నా సహచరులు నా చేతిని పట్టుకొని దమస్కులోనికి నడిపించుకొని పోయిరి.

12. “అచ్చట, మన ధర్మశాస్త్రమునకు విధేయు డగు అననియా అను ఒక భక్తుడు ఉండెను. యూదులు అందరును అతడు మంచివాడు అని చెప్పుకొందురు.

13. అతడు నాయొద్దకు వచ్చి, నా ప్రక్కన నిలబడి, “సౌలు సోదరా! నీ చూపును మరల పొందుము' అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది, అతని వంక చూచితిని.

14. 'మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పుదానిని వినుటకు, నిన్ను ఎన్నుకొనియున్నాడు.

15. ఏలయన, నీవు చూచిన దానిని, విన్నదానిని జనులకందరకు తెలియజెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు.

16. ఇక ఆలస్యమేల? లేచి జ్ఞానస్నానము పొంది, ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను , కడిగివేసికొనుము' అని ఉపదేశించెను.

17. “నేను తిరిగి యెరూషలేమునకు వెళ్ళి, దేవాలయములో ప్రార్థించుకొనుచుండగ పరవశుడ నైతిని.

18. అప్పుడు ప్రభువు కనిపించి, 'త్వరపు డుము. వెంటనే లేచి యెరూషలేమును విడిచి వెళ్ళుము. ఏలయన, ఇచ్చటనున్న ప్రజలు నన్నుగూర్చి నీవు ఇచ్చు సాక్ష్యమును అంగీకరింపరు!' అని నాతో చెప్పెను.

19. 'ప్రభువా! నేను ప్రతి ప్రార్థనామందిర మునకు వెళ్ళి, నిన్ను విశ్వసించినవారిని పట్టి హింసించితి నని వారికి బాగుగా తెలియును.

20. నీ సాక్షియైన స్తెఫాను చంపబడినప్పుడు నేను అచ్చటనే ఉండి ఆ హత్యను ఆమోదించుచు, ఆ హంతకుల వస్త్రములకు కావలియుంటిని' అని మారు పలికితిని.

21. అందుకు ఆయన 'నీవు పొమ్ము. చాల దూరముగా అన్యుల యొద్దకు నిన్ను పంపుచున్నాను' అని ఆదేశించెను.”

22. ఇంత వరకు ప్రజలు వినిరి. కాని, పౌలు, ఈ విషయమును చెప్పగనే వారు, “ఇటువంటివాడు భూమిమీద ఉండకూడదు. అతను జీవించి ఉండ కూడదు” అని పెద్దగా కేకలు వేయ నారంభించిరి.

23. వారు అటుల కేకలువేయుచు వారి పై వస్త్రము లను గాలిలో ఊపుచు దుమ్మెత్తి పోయుచుండిరి.

24. సైన్యాధిపతి పౌలును కోటలోనికి తీసికొనిపోవ బంట్రోతులకు ఆనతిచ్చి, యూదులు ఎందుకు అటుల అరచుచున్నారో తెలిసికొనుటకు, పౌలును కొట్టుటకు ఆజ్ఞాపించెను.

25. పౌలును బంధించి కొరడాలతో కొట్టనున్నప్పుడు, అక్కడ నిలుచుండి చూచుచున్న శతాధిపతితో పౌలు “విచారణ చేయకయే రోము పౌరుని కొరడాలతో కొట్టించుట న్యాయసమ్మతమా?" అని ప్రశ్నించెను.

26. ఆ శతాధిపతి అది విని సైన్యాధిపతి వద్దకు పోయి “మీరేమి చేయుచున్నారు? ఆ మనుష్యుడు రోము పౌరుడట!” అని తెలియజేసెను.

27. అందుచే ఆ సైన్యాధిపతి పౌలు వద్దకు వచ్చి, “నీవు రోము పౌరుడవేనా? చెప్పుము” అని ప్రశ్నింపగా, “ఔను” అని పౌలు జవాబిచ్చెను.

28. ఆ సైన్యాధిపతి, “నేను చాల డబ్బుఖర్చుపెట్టి రోము పౌరుడనైతిని” అని పలుకగా పౌలు “కాని నేను పుట్టుకతోనే రోము పౌరుడను” అని బదులు పలికెను.

29. పౌలును ప్రశ్నింపబోవు మనుష్యులు వెంటనే వెనుకకు తగ్గిరి. పౌలు రోము పౌరుడని తెలిసికొని సంకెళ్ళతో బంధించినందుకై, ఆ సైన్యాధిపతి కూడ భయపడెను.

30. యూదులు పౌలుపై మోపిన నేరము ఏమిటో కచ్చితముగా తెలిసికొనవలెనని తలచి, ఆ సైన్యాధిపతి మరుసటిరోజు పౌలు సంకెళ్ళు తీసి వేయించి, ప్రధానార్చకులను, విచారణసభను సమావేశము కావలెనని ఆజ్ఞాపించెను. పిమ్మట పౌలును తీసికొనివచ్చి ఆ సభ ఎదుట నిలువబెట్టెను.