1. మేము వారికి వీడుకోలు చెప్పి వెళ్లితిమి. తరువాత మేము తిన్నగా ఓడ ప్రయాణము సాగించి కోసుకు వచ్చితిమి. ఆ మరునాడు రోదు చేరితిమి. అక్కడ నుండి పతరాకు వెళ్ళితిమి.
2. అక్కడ ఫినీసియాకు పోనున్న ఒక ఓడ కనబడగా, మేము దానిలో ఎక్కి ప్రయాణము చేసి,
3. సైప్రసుకు దాదాపుగా వచ్చి, తదుపరి దక్షిణముగా సిరియాకు ప్రయాణము సాగించితిమి. ఆపైన, ఓడ సరకులు దింపవలసియున్న తూరు రేవుకు వెళ్ళితిమి.
4. అక్కడ కొందరు విశ్వాసులను కనుగొని ఏడు రోజులు వారితో ఉంటిమి. వారు పవిత్రాత్మ ప్రేరేపితులై పౌలును యెరూషలేమునకు వెళ్ళవలదని చెప్పిరి.
5. కాని, ప్రయాణమునకు సమయము కాగా మేము వారిని వీడి బయలువెడలితిమి. వారందరు ఆలుబిడ్డలతో, నగరము వెలుపలవరకు మా వెంట వచ్చిరి. అక్కడ సాగరతీరమున మేము అందరము మోకరిల్లి ప్రార్థించితిమి.
6. అప్పుడు మేము ఒకరికి ఒకరము వీడుకోలు చెప్పుకొని ఓడను ఎక్కితిమి. వారు వెనుదిరిగి ఇండ్లకు పోయిరి.
7. మేము తూరు నుండి సముద్ర ప్రయాణము కొనసాగించి షోలమాయిసు వెళ్ళితిమి. అక్కడ మేము సోదరులకు శుభవచనములు పలికి వారితో ఒక దినము గడిపితిమి.
8. ఆ మరుసటిదినము మేము వారిని వీడ్కొని కైసరియాకు చేరుకొని, అక్కడ సువార్తా బోధకుడు ఫిలిప్పు ఇంటనుంటిమి. యెరూషలేములో ఎన్నుకొనబడిన ఏడుగురిలో అతడు ఒకడు.
9. అతనికి అవివాహితులగు కుమార్తెలు నలుగురు కలరు. వారును దేవుని వాక్కును ప్రవచించుచుండిరి.
10. అక్కడ మేము కొన్నిదినములు ఉండగా యూదయా నుండి 'అగాబు' అను ఒక ప్రవక్త వచ్చెను.
11. అతడు మాయొద్దకు వచ్చి, పౌలు నడుమునకు కట్టుకొను త్రాటిని తీసికొని దానితో తన కాళ్ళను చేతులను గట్టిగా బంధించుకొని, “ఈ త్రాడు గలవాడు యెరూషలేములో యూదులచే ఈ విధముగా బంధింప బడి అన్యులకు అప్పగింపబడునని పవిత్రాత్మ చెప్పు చున్నాడు” అని పలికెను.
12. దీనిని విని మేమును, అక్కడ ఉన్న ప్రజలును పౌలును యెరూషలేమునకు వెళ్ళవలదని బతిమాలితిమి. .
13. కాని, పౌలు, “మీరు చేయుచున్నదేమి? మీరు ఇట్లు ఏడ్చుచు నా హృదయమును బద్దలు చేయు చున్నారు. నేను యెరూషలేములో బంధింపబడుటకే కాదు, ప్రభువైన యేసు కొరకు ప్రాణములను అర్పించుటకు సిద్ధముగా ఉన్నాను” అని మాతో పలికెను.
14. మేము అతనిని ఒప్పింపలేక పోయి తిమి కనుక, “దేవుని చిత్తము నెరవేరునుగాక!” అని మా ప్రయత్నమును విరమించితిమి.
15. అక్కడ కొంతకాలము గడిపిన పిదప మేము మా సామగ్రిని సిద్ధపరచుకొని యెరూషలేము వెళ్ళి తిమి.
16. కైసరియాకు చెందిన శిష్యులు కొందరు మా వెంటవచ్చి, ప్రారంభమునుండి, విశ్వాసియైన సైప్రసు దేశస్తుడగు మ్నాసోను అనువాని యింటికి బసచేయుటకై మమ్మును తీసికొనిపోయిరి.
17. మేము యోరూషలేమునకు చేరినప్పుడు అక్కడి సోదరులు సంతోషముతో మాకు స్వాగతము పలికిరి.
18. ఆ మరునాడు పౌలు యాకోబును చూచుటకై మాతో వెడలెను. అప్పుడు క్రైస్తవ సంఘపు పెద్దలు అందరును అక్కడ హాజరైరి.
19. పౌలు వారికి శుభము పలికి, దేవుడు తన పని ద్వారా, అన్యుల మధ్యలో చేసిన వానిని అన్నింటిని క్షుణ్ణముగా వివరించెను.
20. అతడు చెప్పినది విని వారందరు దేవుని స్తుతించిరి. వారు పౌలుతో, “సోదరా! వేలకు వేలు యూదులు ఎట్లు విశ్వాసులై ఉన్నారో వారు అందరు ఎట్లు మోషే చట్టము ఎడల మిక్కిలి ఆసక్తి కలిగి ఉన్నారో నీకు తెలియును.
21. అన్యుల దేశములలో నివసించుచున్న యూదులకు మోషే చట్టమును విడనాడమనియు తమ బిడ్డలకు సున్నతి చేయవలదనియు, యూదుల ఆచారమును పాటింప వలదనియు, నీవు బోధించుచున్నట్లు ఇచ్చటి యూదులు వినియున్నారు.
22. ఇప్పుడు ఏమి చేయుదము? నీవు ఇచ్చటకు వచ్చియున్నావని తప్పక వారు తెలిసి కొందురు.
23. కనుక మేము చెప్పినట్లు చేయుము. ఇక్కడ మ్రొక్కుబడి చేసికొనిన నలుగురు మనుష్యులు ఉన్నారు.
24. నీవు వారితో వెళ్ళి, వారితో కలిసి, శుద్దీకరణ సంస్కారమునందు పాల్గొని, తల థైరము చేయించుకొనుటకు వారికి అగు ఖర్చులను చెల్లింపుము. ఇట్లు చేసినచో నిన్ను గురించి విన్న వానిలో ఏదియు నిజము కాదనియు, నీవు కూడ మోషే చట్టమును పాటించుచున్నావనియు వారు భావించెదరు.
25. విశ్వాసులై ఉన్న అన్యులకు, విగ్రహములకు సమర్పిం చిన ఆహారముగాని, రక్తముగాని, గొంతు పిసికి చంపిన జంతువు యొక్క మాంసముగాని, భుజింపరాదనియు, జారత్వమునుండి దూరముగా ఉండవలెననియు మా నిర్ణయమును గూర్చి వ్రాసియున్నాము" అనిరి.
26. అప్పుడు పౌలు ఆ నలుగురు మనుష్యులను తీసికొని పోయి మరుసటి దినమున వారితోపాటు శుద్ధిచేసికొని దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివ్యక్తి తరపున బలి అర్పణ జరుగువరకు శుద్ధీకరణము నెరవేర్చు దము అనెను.
27. దాదాపు ఏడు దినములు పూర్తియగు చుండగా ఆసియా మండలపు యూదులు కొందరు పౌలు దేవాలయమందుండుట చూచిరి. అప్పుడు వారు జనసమూహమును రెచ్చగొట్టి వెంటనే పౌలును పట్టుకొనిరి.
28. “యిస్రాయేలు ప్రజలారా! సహాయ పడుడు. ఈ మనుష్యుడే అన్ని ప్రాంతములందు సంచరించుచు, యిస్రాయేలు ప్రజలందరకు మోషే చట్టమునకు ఈ దేవాలయమునకు వ్యతిరేకముగా బోధించుచున్నాడు. ఇప్పుడు ఇతడు కొందరు అన్యు లను గూడ దేవాలయము లోనికి తీసికొనివచ్చి, ఈ పావన స్థలమును అపవిత్రము చేసియున్నాడు” అని అరచిరి.
29. ఎఫెసు నగరమునుండి వచ్చిన త్రిపాము, పౌలుతో నగరమునందుండగా చూచి, పౌలు వానిని దేవాలయములోనికి తీసికొని వచ్చెనని తలంచి వారు ఇట్లు పలికిరి.
30. ఈ గందరగోళము నగరమంతయు వ్యాపించిపోయెను. ప్రజలందరు పరుగెత్తుకొనిపోయి, ఒక్కుమ్మడిగా పౌలును పట్టుకొని అతనిని దేవాలయము నుండి ఈడ్చుకొని వచ్చిరి. వెంటనే దేవాలయపు తలుపులు మూయబడెను.
31. యెరూషలేమంతయు అల్లకల్లోలముగా ఉన్నదను వార్త సైన్యాధిపతికి అందునప్పటికే, ఆ అల్లరిమూక పౌలును చంప ప్రయత్నించుచుండెను.
32. వెంటనే సైన్యాధిపతి కొందరు సైనికులను శతాధిపతులను తీసికొని దేవాలయమువద్దకు పరుగున వచ్చెను. సైనికులతో కూడివచ్చిన అతనిని చూచి, వారు పౌలును హింసించు టను నిలిపివేసిరి.
33. ఆ సైన్యాధిపతి వచ్చి పౌలును పట్టుకొని రెండు గొలుసులతో గట్టిగా బంధింపుడని ఆజ్ఞాపించెను. అతడు వారిని, “ఇతడు ఎవరు? ఏమి చేసెను?” అని ప్రశ్నించెను.
34. ఆ అల్లరి గుంపులో కొందరు ఒకటి, మరికొందరు మరొకటి, తలకొక రీతిగా కేకలు పెట్టిరి. ఆ కోలాహలములో సైన్యాధిపతి నిజముగా జరిగినదేమియో తెలిసికొనలేకపోయెను. కావున, పౌలును కోటకు తీసికొనిపొండని అతడు సైనికులకు ఆజ్ఞాపించెను.
35. వారు అతనితో మెట్ల సమీపమునకు చేరిరి. కాని అల్లరిమూక విపరీతముగా ఉండుటచే అక్కడనుండి సైనికులు అతనిని మోసికొని పోవలసివచ్చెను.
36. ఎందుకన, వారందరు అతని వెంటబడి, “వీనిని చంపుడు! చంపుడు!" అని కేకలు వేయుచుండిరి. ,
37. వారు పౌలును కోటలోనికి తీసికొని పోవు నప్పుడు అతడు సైన్యాధిపతితో “నేను మీతో కొంత మాట్లాడవచ్చునా?” అని అడిగెను. అందుకతడు “నీకు గ్రీకు భాష తెలియునా?
38. అటులైన కొంతకాలము క్రిందట తిరుగుబాటును లేవదీసి, నాలుగువేలమంది నరహంతలను ఎడారిలోనికి నడిపించుకొని పోయిన ఆ ఐగుప్తీయుడవు నీవు కావా?” అని ప్రశ్నించెను.
39. అప్పుడు పౌలు, “నేను యూదుడను. సిలీషియా లోని తార్సులో జన్మించితిని. ముఖ్యమైన నగర పౌరుడను. నన్ను ప్రజలతో మాట్లాడనీయుము” అని మనవి చేసెను.
40. సైన్యాధిపతి అట్లే సెలవీయగా, పౌలు మెట్లపై నిలబడి నిశ్శబ్దముగా ఉండుడు అని ప్రజలకు సైగచేసి, వారు ప్రశాంతముగా ఉండగా వారితో హీబ్రూ భాషలో ఇట్లు మాట్లాడెను: