ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 20 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము

 1.ఈ అల్లకల్లోలము అణగిన తరువాత, పౌలు విశ్వాసులనందరను చేరబిలిచి, వారిని ప్రోత్సహించి, వారి యొద్ద సెలవు తీసికొని, మాసిడోనియాకు వెళ్ళెను.

2. అతడు ఆ ప్రాంతముల మీదుగా పోవుచు, అకయా ప్రజలను ప్రోత్సహించుచు,

3. గ్రీసు దేశమునకు వచ్చి మూడు మాసములు ఉండెను. తరువాత సిరియా వెళ్ళుటకు సిద్ధపడుచుండగా యూదులు అతనిపై కుట్రపన్నుచుండుటను పసికట్టి, మాసిడోనియా మీదుగా వెనుకకు పోవలెనని నిశ్చయించుకొనెను.

4. బెరయాకు చెందిన పిఱుసు కుమారుడైన సొపాతేరు అతని వెంట వెళ్ళెను. మరియు తెస్సలోనిక నుండి వచ్చిన అరిస్టార్కుసు, సెకుందుసు, దెర్బె నుండి వచ్చిన గాయు, తిమోతి, ఆసియా మండలమునుండి వచ్చిన తుకికు, త్రోఫిము

5. అను వీరు ముందుగా వెళ్ళి, త్రోయలో మా కొరకు వేచియుండిరి.

6. పులియని రొట్టెల పండుగ తరువాత, ఫిలిప్పీనుండి ఓడనెక్కి పయనించి ఐదురోజుల అనంతరము త్రోయలో వారిని కలిసికొని అచట ఏడుదినములు గడిపితిమి.

7. అదివారము మేము భుజించుటకు ఒక చోట చేరితిమి. మరునాడు తాను వారిని వదలి వెళ్ళవలసియున్నందున, పౌలు నడిజామువరకు ప్రజలతో మాట్లాడుచునే ఉండెను.

8. మేము సమావేశమైన పై అంతస్తు గదిలో చాలా దీపములు వెలుగుచునే యుండెను.

9. యూతికూసు అను పేరుగల యువకుడు ఒకడు కిటికీలో కూర్చుండి ఉండెను. పౌలు ఇంకను మాట్లాడుచుండగా అతడు కునికిపాట్లు పడి, గాఢనిద్రపట్టగా, ఆ నిద్రలో మూడవ అంతస్తు నుండి క్రింద పడిపోయెను. వెంటనే వారు అతనిని లేవనెత్త బోగా, అతడు అప్పటికే ప్రాణములు విడిచెను.

10. కాని పౌలు క్రిందకు దిగి, అతనియొద్దకు వెళ్ళి, వానిపై వంగి, కౌగిలించుకొని, “విచారపడకుడు. ఇతడు ఇంకను బ్రతికియే ఉన్నాడు” అని పలికెను.

11. అప్పుడు పౌలు తిరిగి పై అంతస్తు లోనికి పోయి, రొట్టెను త్రుంచి భుజించెను. ప్రొద్దుపొడుపువరకు అతడు చాలసేపు మాట్లాడిన పిదప పౌలు వారిని వీడి వెళ్ళెను.

12. వారు ఆ యువకుని సజీవునిగా ఇంటికి తీసికొని వచ్చి ఎంతో ఊరట పొందిరి.

13. మేము ఓడనెక్కి అస్సోసునకు పయ నించితిమి. పౌలును కూడ ఓడలో ఎక్కించుకొన దలచితిమి. కాని అతడు భూమార్గమున తాను అటకు వెళ్లుటకు ఏర్పాటు చేసికొనెను.

14. అస్సోసులో మమ్ములను అతడు కలిసికొనినప్పుడు మేము అతనిని ఓడలో ఎక్కించుకొని మితిలేనుకు వెళ్లితిమి.

15. అక్కడ నుండి మేము ఓడలో పయనించి, మరునాటికి కియోసును చేరుకొంటిమి. ఒక దినము గడచిన తరువాత మేము సామొసుకు వచ్చి, మరుసటి రోజున మిలేతు చేరితిమి.

16. ఆసియా మండలములో ఏమాత్రము కాలహరణము చేయకూడదనుకొని నందున పౌలు ఎఫెసు దాటిపోవ నిశ్చయించుకొనెను. ఎందుకనగా, సాధ్యమైనంతవరకు పెంతెకోస్తు పండుగ నాటికి అతడు యెరూషలేమునకు చేరుకొన వలెనని తొందరపడుచుండెను.

17. క్రైస్తవ సంఘపు పెద్దలు తనను కలిసి కొనవలెనని పౌలు మిలేతు నుండి ఎఫెసునగరము నకు వర్తమానమును పంపెను.

18. వారు అచ్చటికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో “ఆసియా మండలములో అడుగిడిన మొదటిదినమునుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లు గడిపితినో మీరు ఎరుగుదురు.

19. యూదుల కుతంత్రమువలన నాకు కలిగిన కష్టకాలములో నేను ప్రభువు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వముతోను, కన్నీటితోను నెరవేర్చి తిని.

20. నేను బహిరంగముగా మీ ఇండ్లయందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధముల సాయపడుటకు నేను వెనుదీయలేదు.

21. పాపముల నుండి దేవుని వైపునకు మరలవలెనని, మన ప్రభువైన యేసును విశ్వసింపవలెనని యూదులను, అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రముగా హెచ్చరించితిని.

22. మరి ఇప్పుడు పవిత్రాత్మకు విధేయుడనైన నేను యెరూషలేమునకు పోవుచున్నాను. అక్కడ నాకు ఏమి జరుగనున్నదో తెలియదు.

23. చెరసాలయు, కష్టములును నా కొరకై వేచియున్నవని పవిత్రాత్మ ప్రతి నగరమునను నన్ను హెచ్చరించుట మాత్రమే నాకు తెలియును.

24. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని. కనుక, ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అంతకు మినహా నా జీవితము ప్రయో జనకరమని నేను భావించుట లేదు.

25. దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుచు, నేను మీ అందరి మధ్యలో సంచరించియున్నాను. మీలో ఎవరును నన్ను మరల చూడరని ఇప్పుడు నాకు తెలియును.

26. కాబట్టి ఈ దినమే దీనిని మీకు ఎరుక చేయుచున్నాను. మీలో ఎవరు నశించినను దానికి నేను దోషిని కాను.

27. ఏలయన, దేవుని సంకల్పమును మీకు ఎరిగించుటలో, నేను వెనుకంజ వేయలేదు.

28. మీ విషయమై జాగ్రత్త పడుడు. పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా, తన సొత్తుగా చేసికొనిన దైవసంఘమునకు కాపరులుగా ఉండుడు.

29. ఏలయన, మేము మిమ్ములను విడిచిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. అవి మందను వదలిపెట్టవు.

30. మీలో నుండియే కొందరు అబద్ద ములు చెప్పి, శిష్యులను తమ పక్షమునకు మరల్చు కొను కాలము వచ్చును.

31. జాగ్రత్తగా ఉండుడు. మూడు సంవత్సరముల పర్యంతము నేను రేయింబ వళ్ళు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితి నని మీరు గుర్తుంచుకొనుడు.

32. “ఇప్పుడు దేవునికి, ఆయన కృపావాక్కు నకు మిమ్ము అప్పగించుచున్నాను. ఇదియే మిమ్ములను నిర్మించుచు, శుద్ధులైన వారందరిలో వారసత్వమును కల్పించును.

33. ఎవరి వెండినైనను, బంగారము నైనను, వస్త్రములనైనను నేను ఆశింపలేదు.

34. నేను ఈ నా సొంతచేతులతోనే పనిచేసి నాకును, నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చియుంటినని మీకు తెలియునుగదా!

35. 'పుచ్చుకొనుటకంటె, ఇచ్చుట ధన్యము' అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొని కష్టించి, కృషిచేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలెనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శము ఇచ్చితిని” అని పలికెను.

36. పౌలు ఇట్లు చెప్పి ముగించి, వారందరితో తానుగూడ మోకరిల్లి ప్రార్థించెను.

37. వారు వీడుకోలు సూచనగా పౌలును కౌగిలించుకొనుచు, ముద్దుపెట్టుకొనుచు అందరును కన్నీరు కార్చిరి.

38. మరల వారు ఎన్నటికిని అతనిని చూడబోరని, అతడు చెప్పినమాటలను తలంచుకొని వారు కంటికిమంటికి ఏకధారగా ఏడ్చిరి. అంతటవారు ఓడవరకు అతనిని సాగనంపిరి.