1. పెంతెకోస్తు పండుగదినము వచ్చినప్పుడు, వారందరు ఒకచోట కూడియుండిరి.
2. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి ఒక ధ్వని ఆకాశమునుండి. అకస్మాత్తుగా వారు కూర్చుండి యుండిన ఇల్లంతయు నిండెను.
3. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకలవలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరిమీద నిలుచుట వారికి కనబడెను.
4. వారందరు పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్చక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్యభాషలలో మాట్లాడసాగిరి.
5. ఆకాశము క్రిందనుండు ప్రతిదేశము నుండి వచ్చిన దైవభక్తులగు యూదులు, యెరూషలేములో నివసించుచుండిరి.
6. ఆ శబ్దము విని అక్కడకు వచ్చిన జనసమూహములోని ప్రతి వ్యక్తియు, తమతమ సొంతభాషలో వారు మాట్లాడుట విని, కలవరపడిరి.
7. వారు విస్మయ మొంది ఆశ్చర్యముతో, ఇట్లు మాట్లాడుచున్న వీరందరు గలిలీయులుకారా? ఇదేమి!
8. వీరు మాట్లాడునది మనమందరము, మన సొంతభాషలో వినుచున్నామే?
9. పార్తియ, మాదియా, ఏలాము, మెసపొటామియా, యూదయా, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు,
10. ఫ్రిసియా, పంఫీలియ, ఐగుప్తు, సిరేనె దగ్గర లిబియా ప్రాంతములనుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు,
11. యూదులు, యూదమతమున ప్రవేశించినవారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా, మన సొంత భాషలలో వినుచున్నాము”
12. అని విభ్రాంతినొంది, తబ్బిబ్బుపడుచు, 'ఇదేమి చోద్యమో!' అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.
13. కాని కొందరు, “వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారు” అని అపహాస్యము చేసిరి.
14. అప్పుడు పేతురు, ఆ పదునొకొండుగురు అపోస్తలులతో లేచి నిలుచుండి, ఆ ప్రజాసమూహ మును ఉద్దేశించి, బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను: “యూదయా జనులారా! యెరూషలేములో నివసించు చున్న సమస్తజనులారా! నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు.
15. మీరు అనుకొనుచున్నట్లు వీరు మద్యపానము చేయలేదు. ఇప్పుడు ఉదయము తొమ్మిదిగంటల' సమయమేగదా!
16. యోవేలు ప్రవక్త చెప్పిన విషయమేమనగా:
17. 'అంత్యదినములయందు ఇట్లు జరుగునని దేవుడు చెప్పుచున్నాడు: మానవులందరిమీద, నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులును, కుమార్తెలును ప్రవచించెదరు. మీ యువకులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కనెదరు.
18. అవును, ఆ రోజులలో నా దాసుల మీదను, దాసురాండ్ర మీదను, నేను నా ఆత్మను కుమ్మరించెదను. కనుక వారు ప్రవచించెదరు.
19. పైన ఆకాశమందున అద్భుతములను, క్రింద భూమిపై ఆశ్చర్యకార్యములను, రక్తమును, అగ్నిని, దట్టమయిన పొగను చూపెదను.
20. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు, సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారును.
21. అప్పుడు ప్రభువు నామమును బట్టి జపించెడివారు రక్షింపబడుదురు.”
22. “యిస్రాయేలు ప్రజలారా! ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యములద్వారా, సూచకక్రియల ద్వారా దేవుడు మీకు రూఢి ఒనర్చెను. ఇది మీకై మీరు మీ గ్రహించునట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మధ్యనే చేసెను.
23. దేవుని సంకల్పమును అనుస రించియు, ఆయన భవిష్యజ్ఞానమును అనుసరించియు, అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతులగుండా సిలువవేయించి చంపించితిరి.
24. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము కనుక, దేవుడు మరణవేదనలను తొలగించి, ఆయనను మృతులలోనుండి లేపెను.
25. ఏలయన, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను: . 'నేను ఎల్లప్పుడు ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు. కనుక నేను చలనమొందను.
26. అందువలన నా హృదయము ఆనందించినది. నా నాలుక ఆనందముతో నిండియున్నది. నేను మర్త్యుడనైనను ఆశతో నిరీక్షింతును.
27. ఏలయనగా, నీవు నాఆత్మను పాతాళమున విడిచి పెట్టవు. పరిశుద్ధుడగు నీ సేవకుని క్రుళ్ళిపోనీయవు.
28. నీవు నాకు జీవమార్గములను తెలిపియున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి, నన్ను ఆనందముతో నిం పెదవు.'
29. “సహోదరులారా! మన పితరుడగు దావీదును గూర్చి, నేను మీతో తేటతెల్లముగా మాట్లాడవలెను. అతడు చనిపోయి సమాధిచేయబడెను. నేటివరకును అతని సమాధి మనమధ్య ఉన్నది.
30. అతడు ఒక ప్రవక్తయైయుండి తమ వంశస్తులలో ఒకని రాజుగా చేయుదునని, దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి యుండెను కనుక,
31. 'క్రీస్తు పాతాళములో విడువబడలేదు. ఆయన శరీరము క్రుళ్ళిపోలేదు' అని దావీదు ముందుగా తెలిసికొని, ఆయన పునరు త్థానమును గూర్చి చెప్పెను.
32. ఈ యేసును దేవుడు సమాధినుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు, మేము అందరము సాక్షులము,
33. ఆయన దేవుని కుడిప్రక్కకు చేర్చబడి, తన తండ్రి వాగ్దానము ప్రకారము పవిత్రాత్మను పొంది, మీరిపుడు చూచుచు, వినుచున్న ఆత్మను కుమ్మరించియున్నాడు.
34. ఏలయన, దావీదు తనంతట తాను పరలోకమునకు పోలేదుకాని అతడు ఇట్లనెను:
35. 'నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచువరకు, నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.'
36. మీరు సిలువపై చంపిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని యిస్రాయేలు జనులందరు తప్పనిసరిగా తెలిసికొనవలయును!” అని చెప్పెను.
37. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని, హృదయ ములో నొచ్చుకొని, “సహోదరులారా! మేము ఏమి చేయవలెను?” అని పేతురును, అపోస్తలులను అడుగగా పేతురు,
38. “మీరు హృదయపరివర్తన చెంది మీ పాపపరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున, జ్ఞానస్నానము పొందవలయును. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు.
39. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరకును, అనగా, ప్రభువైన దేవుడు తనయొద్దకు పిలుచు వారందరకును చెందును” అని వారితో చెప్పెను.
40. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో, “దుర్మార్గులగు ఈ జనులనుండి వేరై రక్షణ పొందుడు” అని పేతురు వారిని హెచ్చరించెను.
41. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ దినమున రమారమి మూడువేలమంది చేర్చబడిరి.
42. వీరు అపోస్తలుల బోధయందును, వారి సహవాసమందును, రొట్టెను త్రుంచుటయందును, ప్రార్థించుటయందును ఎడతెగక ఉండిరి.
43. అప్పుడు ప్రతివ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తలుల ద్వారా, అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను.
44. విశ్వసించిన వారందరు కలిసి, సమష్టిగా జీవించుచు తమకు కలిగినదానిలో అందరు పాలుపంచుకొనుచుండిరి.
45. మరియు వారు తమ స్థిరచరాస్తులను అమ్మి, అందరకును వారివారి అవసరములను బట్టి పంచి పెట్టిరి.
46. వారు ప్రతి రోజు కూటముగా దేవాలయములో కలిసికొనుచు, తమ ఇండ్లలో అందరు కలిసి రొట్టెను త్రుంచుచు,
47. సంతోషము, వినయముగల హృదయములతో భుజించుచు, దేవుని స్తుతించుచు, ప్రజలకందరకును ప్రీతిపాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని, ప్రభువు ప్రతిరోజు వారితో చేర్చుచుండెను.