ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 18 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము

 1. తరువాత పౌలు ఏతెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను.

2. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరుగల యూదునికలిసికొనెను. అతడు తన భార్యయగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చియుండెను. ఏలయన, క్లోరియా చక్రవర్తి యూదులందరును రోము నగరమును వదలి వెళ్ళవలయునని శాసించియుండెను.

3. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారివలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయుచుండెను.

4. అతడు ప్రతి విశ్రాంతిదినమున ప్రార్ధనా మందిరములో తర్కించుచు యూదులను, గ్రీను దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచుండెను.

5. సిలాసు, తిమోతిలు మాసిడోనియానుండి వచ్చినప్పుడు, యేసే మెస్సియా అని పౌలు సాక్ష్యమిచ్చుచు, దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమునంతను వినియోగించు చుండెను.

6. కాని, వారు అతనిని ఎదిరించుచు అతనిని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తులను దులుపుచు, “మీరు పెడదారిన పోయినచో మీ రక్తము మీమీద ఉండునుగాక! దానికి నేను నిర్దోషిని. ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయెదను” అని హెచ్చ రించెను.

7. అంతట వారిని వీడి తీతుయుస్తు అను పేరుగల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థనామందిరము ప్రక్కనే ఉండెను.

8. ప్రార్ధనా మందిరమునకు అధికారియైన క్రిస్పు, అతని కుటుంబ ములోని వారందరు ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింతు నగరములోని ఇతరులు చాలమంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్నానమును పొందిరి,

9. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, “నీవు భయపడ వలదు. నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము. ఆ పనిని ఆపకుము.

10. ఏలయన, నేను నీతో ఉన్నాను. కావున నీకు ఎవరును హాని చేయలేరు. ఈ నగరములో నా ప్రజలు అనేకులు ఉన్నారు” అని చెప్పెను.

11. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట పదునెనిమిది మాసములు ఉండెను.

12. గల్లియో, అకయాకు అధిపతిగా ఉన్నపుడు యూదులు ఒకచోట కూడి పౌలును చుట్టుముట్టి, పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసికొని వచ్చి,

13. “ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప యత్నించు చున్నాడు” అని ఫిర్యాదు చేసిరి.

14. పౌలు అప్పుడు మాట్లాడబోవుచుండగా గల్లియో యూదులతో, "ఇది ఏదైన దోషముగాని, ఘోరమైన నేరముగాని అయిన యెడల యూదులగు మీరు చెప్పుదానిని విని, నేను మిమ్ము సహించుట న్యాయమే.

15. కాని ఇవి మీ సిద్దాంతములకు, బిరుదములకు న్యాయ సూత్రము లకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను" అని పలికి,

16. వారిని న్యాయస్థాన మునుండి బయటకు గెంటివేసెను.

17. అప్పుడు వారు వెంటనే ప్రార్థనామందిరపు అధికారియగు సోస్తనీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కాని గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు.

18. పౌలు మరి కొంతకాలము కొరింతులో గడిపిన పిదప, అచటి సోదరులను వీడ్కొని, ప్రిసిల్లా, అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కెంక్రేయలో చేసికొన్న మ్రొక్కుబడి ప్రకారము తల క్షౌరము చేయించుకొనెను.

19. వారు ఎఫెసును చేరిరి. అచట పౌలు ప్రిసిల్లా, అక్విలాలను విడిచిపెట్టి ప్రార్థనా మందిరమునకు వెళ్లి, యూదులతో చర్చించెను.

20. మరికొంత కాలము తమతో ఉండుమని వారు అతనిని ప్రాధేయపడినను అతడు సమ్మతింపలేదు.

21. అతడు వారిని విడిచి వెళ్ళునపుడు, “దేవుని చిత్తమైనచో, మరల నేను మీ యొద్దకు వచ్చెదను” అని చెప్పి ఎఫెసు నుండి ఓడనెక్కి పోయెను.

22. అతడు కైసరియా చేరుకొని, యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవ సంఘమునకు శుభాకాంక్షలు చెప్పి, తరువాత అంతియోకియానకు పోయెను.

23. అక్కడ కొంతకాలము గడిపిన పిదప, మరల ప్రయాణమై, గలతియా, ఫ్రిసియా ప్రాంతముల మీదుగా పోయి విశ్వాసులందరను దృఢపరచెను.

24. అలెగ్జాండ్రియాలో జన్మించిన అజల్లో అను పేరుగల యూదుడు ఒకడు ఎఫెసు నగరమునకు వచ్చెను. అతడు మంచి వక్త, లేఖనములందు క్షుణ్ణమయిన జ్ఞానము గలవాడు.

25. అతడు ప్రభువు మార్గములో ఉపదేశమును పొంది, యేసును గూర్చిన సత్యములను గొప్ప ఉత్సాహముతో బోధించు చుండెను. అతనికి యోహాను బప్తిస్మమును గురించి మాత్రమే తెలియును.

26. అతడు ధైర్యముగా ప్రార్థనా మందిరములలో ప్రసంగించుటకు మొదలిడెను. ప్రిసిల్లా, అక్విలాలు అతని బోధన విని, అతనిని వారి ఇంటికి తీసికొనిపోయి, దేవుని మార్గమును గూర్చి ఇంకను ఎక్కువగా అతనికి వివరించి చెప్పిరి.

27. అపోలో గ్రీసుదేశమునకు పోవుటకు నిశ్చయించుకొని నందున, ఎఫెసులోని విశ్వాసులు అతనిని ప్రోత్సహించి, గ్రీసు దేశములోని తమ సోదరులకు, అతనికి స్వాగత మిండని ఉత్తరములు వ్రాసి పంపిరి. అతడు అక్కడకు చేరి, దేవుని దయవలన విశ్వాసులైయుండిన వారలకు తోడ్పడెను.

28. ఏలయన, బహిరంగ వేదికలపై చేయ బడిన చర్చలలో అతడు తన బలీయమైన వాదము లచే, యేసే మెస్సియా అని లేఖనముల నుండి నిరూపించుచు యూదులను వాదములందు ఓడించెను.