ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 15 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము

 1. యూదయానుండి కొందరు మనుష్యులు అంతియోకియానకు వచ్చి, సోదరులకు, “మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు” అని బోధింపసాగిరి.

2. ఈ విషయమును గూర్చి వారికిని, పౌలు, బర్నబాలకును తీవ్రమైన వాదప్రతి వాదములు జరిగెను. అందుచే పౌలు, బర్నబా, మరికొందరు, యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోను, పెద్దలతోను మాట్లాడవలెనని నిశ్చయించిరి.

3. క్రైస్తవ సంఘముచే పంపబడి, వారు ఫినీషియా, సమరియాల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియపరచిరి. ఈ వర్తమానము సోదరులకందరకు చాల సంతోషమును కలిగించెను.

4. వారు యెరూషలేమునకు చేరుకొనగానే క్రైస్తవసంఘము, అపోస్తలులును, పెద్దలును వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి, చేసినదంతయు వారు వీరికి తెలిపిరి.

5. కాని పరిసయ్యుల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి, “వారు సున్నతి చేయించు కొనవలెను. మోషే చట్టమునకు విధేయత చూప వలెను” అని పలికిరి.

6. అందుచే అపోస్తలులును, పెద్దలును ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి.

7. పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలువబడి, “సోదరులారా! అన్యులు సువార్తా సందేశమును విని విశ్వసించుటకు, వారికి ప్రసంగించుటకై ఆరంభముననే దేవుడు నన్ను మీనుండి ఎన్నుకొనెనని మీకు తెలియును.

8. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు ఒసగినట్లే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా, తన సమ్మతిని వెలిబుచ్చియున్నాడు.

9. మనకును, వారికిని మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి. కనుక వారి విశ్వాసమును బట్టి వారి హృదయములను శుద్ది చేసెను.

10. కనుక మనముగాని, మన పూర్వీకులుగాని మోయలేని కాడిని విశ్వాసులపై మోపి, మీరు ఎందుకు దేవుని ఇప్పుడు పరీక్షింప ప్రయత్నించెదరు?

11. ప్రభువైన యేసు అనుగ్రహము వలన రక్షింపబడుదుమని మనము విశ్వసింతుము. అట్లే వారును రక్షణము పొందుదురు” అనెను.

12. అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచకక్రియలను ఆశ్చర్యకార్యములను గూర్చి బర్నబా, పౌలులు తెలియజెప్పగా, ఆ సభ అంతయు విని కిమ్మనకుండెను.

13. మాట్లాడుట పూర్తియైన పిదప యాకోబు లేచి, “సోదరులారా! ఆలకింపుడు.

14. ఎట్లు దేవుడు మొదట అన్యులపై శ్రద్ధచూపి, అందు కొందరను తన సొంత ప్రజలుగా చేసికొనెనో సీమోను వివరించియున్నాడు.

15. ప్రవక్తల ప్రవచనములు ఈ విషయమున పూర్తిగా సరిపోవుచున్నవి. ఏలయన, ఇట్లు వ్రాయబడినది:

16. 'దీని తరువాత నేను మరల వచ్చి, పడిపోయిన దావీదు గుడారమును లేపెదను. దాని శిథిలములను కూడదీసి, మరల దానిని నిర్మించెదను.

17. నేను నా సొంత జనులై యుండుటకు పిలిచియున్న సమస్త జాతులును, తదితర ప్రజలందరును ప్రభువును వెదకెదరు.

18. ప్రారంభముననే దీనిని తెలియజేసిన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు.'

19. “ఇది నా అభిప్రాయము, కావున దేవుని వైపునకు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు.

20. దీనికి బదులు, విగ్రహములకు అర్పింపబడుటచే అపరిశుద్ధమగు ఎట్టి ఆహారమును భుజింపరాదనియు, జారత్వమునకు దూరముగా ఉండవలెననియు, గొంతు పిసికి చంపిన ఏ జంతువును తినరాదనియు,రక్తమును తాగరాదనియు, వారికి మనము వ్రాయవలయును.

21. ఏలయన, ప్రతి విశ్రాంతిదినమున ప్రార్థనా మందిరములలో చాలకాలమునుండి మోషేధర్మ శాస్త్రము చదువబడుచుండెను. మరియు అతని వాక్కులు ప్రతి పట్టణమునందును ప్రసంగింపబడు చున్నవి” అని పలికెను.

22. అప్పుడు అపోస్తలులు, పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలసి వారిలోనుండి కొందరను ఎన్నుకొని, పౌలు, బర్నబాలతో అంతియోకియానకు పంప నిశ్చయించుకొనిరి. సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్నబాసు అనబడు యూదాసును, సిలాసును వారు ఎన్నుకొనిరి.

23. వారు వారికి ఇట్లు వ్రాసి పంపిరి: “అంతియోకియా, సిరియా, సిలీషియాలలో నివసించుచున్న అన్యులగు సోదరులకందరకు, సోదరులము, అపోస్తలులము, పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాము.

24. మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి, మీకు ఏదో చెప్పి, మిమ్ము కష్టపెట్టి కలవర పెట్టిరని మేము వినియున్నాము. దీనిని గూర్చి వారు ఏ మాత్రము మా ఉత్తరువులను పొందియుండలేదు.

25. అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని, మీ వద్దకు పంపదలచితిమి.

26. మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియమిత్రులగు బర్నబా, పౌలులతో వారు వచ్చెదరు.

27. మేము యూదాసును, సిలాసును మీ వద్దకు పంపుచున్నాము. మేము వ్రాయుచున్న విషయము లను స్వయముగా వీరే మీకు చెప్పెదరు.

28. ఎందుకనగా, ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును, మాకును తోచినది.

29. కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు. రక్తపానము చేయకుడు. గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు. జారత్వమునకు దూరముగా ఉండుడు. ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు. మీకు శుభమగుగాక!”

30. ఆ రాయబారులు అంతియోకియానకు పంపబడిరి. వారు అక్కడ విశ్వాసులసంఘమునంతటిని సమావేశపరచి, వారికి ఆ లేఖను అందించిరి.

31. ఆ ప్రజలు ఉత్తరమును చదువుకొని, ప్రోత్సాహకరమైన ఆ సందేశము వలన ఆనందభరితులైరి.

32. యూదాసు, సిలాసు ప్రవక్తలై ఉండుటచే వారికి ధైర్యమును, బలమును ఇచ్చుచు, ఎంతో కాలము వారితో ముచ్చటించిరి.

33. కొంత కాలము అక్కడ గడిపిన పిదప సోదరులు వారిని ప్రశాంతముగా సాగనంప, వారు తిరిగి వారిని పంపినవారి యొద్దకు వెళ్ళిరి.

34. కాని సిలాను అక్కడే ఉండుటకు నిశ్చయించుకొనెను.

35. పౌలు, బర్నబాలు అంతియోకియాలో కొంతకాలము గడిపి, ఇతరులతో కలిసి ప్రభువు వాక్కును బోధించుచుండిరి.

36. తరువాత పౌలు బర్నబాతో “మనము ప్రభువు వాక్కును గూర్చి ప్రసంగించిన ప్రతి పట్టణమునకు, మరలపోయి అక్కడ మన సోదరులు ఎట్లు ఉన్నారో చూతము” అనెను.

37. బర్నబా తమతో మార్కు అను మారుపేరు గల యోహానును తీసికొనిపోగోరెను. కాని, పౌలు అతనిని తీసికొని పోవుట మంచిదికాదని తలంచెను.

38. ఏలయన, వారి సువార్తా ప్రచారములో అతడు చివరి వరకు వారితో ఉండక, వారిని పంఫీలియాలో విడిచిపెట్టి వెనుకకు మరలిపోయెను.

39. అందుచేత వారిద్దరి మధ్య ఈ విషయముపై తీవ్రమైన తర్జనభర్జనలు జరిగెను. కనుక వారు విడిపోయిరి. బర్నబా మార్కును తీసికొని ఓడనెక్కి సైప్రసునకు పోయెను,

40. పౌలు సిలాసును ఎన్నుకొని, సోదరులచే దేవుని కృపకు అప్పగింపబడి ఆ ప్రాంతమును విడిచి,

41. సిరియా, సిలీషియా మీదుగా వెళ్ళుచు, అక్కడ ఉన్న క్రీస్తు సంఘములను బలపరచెను.