ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 14 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము

 1. ఇకోనియాలో కూడ అట్లే జరిగెను. పౌలు, బర్నబా యూదుల ప్రార్థనామందిరములో ప్రవేశించి బోధించినందున ఎందరో యూదులును, గ్రీసు దేశస్తులును విశ్వసించిరి.

2. కాని విశ్వసింపని యూదులు సోదరులకు విరుద్ధముగా అన్యులను పురికొల్పి వారి మనస్సులను మార్చివేసిరి.

3. అపోస్తలులు చాలకాలము అక్కడనే ఉండి, ప్రభువును గూర్చి ధైర్యముగా బోధించిరి. ఆయన సూచక క్రియలను, ఆశ్చర్యకార్యములను చేయుటకు వారికి శక్తి నిచ్చి తన అనుగ్రహమును వెల్లడించువారి సందేశము నిజమేయని రుజువుపరచెను.

4. నగరములోని జనులు కొందరు యూదుల పక్షమున, మరి కొందరు అపోస్తలుల పక్షమునుచేరి రెండు వర్గములుగా చీలిపోయిరి.

5. అప్పుడు అన్యులు, యూదులు ఇరువురును వారి నాయకులతో కలసి అపోస్తలులను బాధించి రాళ్ళతో కొట్టుటకు ప్రయత్నించిరి.

6. అపోస్తలులు ఈ విషయమును తెలిసికొని లికోనియాలోని పట్టణ ములైన లిస్తా, దెర్బె మరియు చుట్టుపట్టు ప్రాంతముల కును పారిపోయి,

7. అక్కడ సువార్తను బోధించిరి.

8. లిస్త్రాలో నడువశక్తిలేని కుంటివాడు ఒకడు కూర్చుండియుండెను. అతడు పుట్టుకతోనే కుంటివాడు. ఎన్నడును నడువలేదు.

9. అతడు పౌలు మాటలను ఆలకించుచుండెను. పౌలు వానిని గమనించి ఆరోగ్యము పొందదగిన విశ్వాసము గలవాడని గ్రహించియుండుటచే సూటిగా వానివంక చూచి,

10. “నీవు లేచి నీ కాళ్ళపై నిలువబడుము” అని బిగ్గరగా పలికెను. వెంటనే అతడు గంతులు వేసి నడువనారంభించెను.

11. పౌలు చేసిన ఆ పనిని చూచి అక్కడ జనసమూహములు “దేవుళ్ళు ఈ మనుష్యుల రూపములో మన వద్దకు దిగివచ్చిరి" అని లికోనియా భాషలో బిగ్గరగా అరవ నారంభించిరి.

12. అప్పుడు వారు బర్నబాకు 'ద్యుపతి' అనియు, పౌలు ప్రధాన ఉపదేశకుడు కావున అతనికి 'హెర్మే' అనియు పేర్లు పెట్టిరి.

13. ఆ పట్టణమునకు ఎదురుగా బృహస్పతి ఆలయము ఒకటి కలదు. అచటి పూజారి వట్టణ ముఖద్వారమువద్దకు గిత్తలను, పూల మాలలను తీసికొనివచ్చి జనులతో కలిసి బలిని అర్పింపతలచెను.

14. అది విని బర్నబా, పౌలులు తమ దుస్తులను చింపుకొని, జనసమూహము మధ్యకు పరుగెత్తు కొనివచ్చి,

15. “ఓ ప్రజలారా! మీరు ఎందులకిట్లు చేయుచున్నారు? మేము కూడ మీ వలే మానవమాత్రులమేగదా! ఆకాశమును, భూమిని, సముద్రమును వానిలో ఉండు సమస్తమును సృష్టించిన సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనము లేని మూఢాచారములనుండి మిమ్మును మరలించి, సువార్తను మీకు ప్రకటించుటకు మేమిచ్చటకు వచ్చి ఉన్నాము.

16. "పూర్వకాలములో దేవుడు సమస్త జాతులనువారి ఇష్టానుసారము జీవింపనిచ్చెను.

17. ఆయన ఆకాశమునుండి వర్షమునొసగి సకాలములో పంటలను పండించి మీకు ఆహారమునిచ్చి, మీ హృదయములను ఆనందముతో నింపుట మొదలగు మేలులు చేయుట ద్వారా తనకు తాను సాక్ష్యమును ఇచ్చియుండెను” అని ఎలుగెత్తి పలికిరి.

18. ఈ మాటలతో అపోస్తలులు ఆజనసమూహములను తమకు బలి నర్పించు యత్నము నుండి అతికష్టము మీద మరల్పగలిగిరి.

19. అంతియోకియానుండి, ఇకోనియానుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవనము గావించుకొని, పౌలును రాళ్ళతో కొట్టి అతడు మరణించియుండెనని భావించి, పట్టణము బయటకు ఈడ్చివేసిరి.

20. కాని శిష్యులు అతని చుట్టును చేరగా, అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బెకు ప్రయాణమై పోయెను.

21. పౌలు, బర్నబా దెర్బెలో సువార్తను బోధించి, అనేకులను తమ శిష్యులుగా చేసికొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, పిసీడియాలోని అంతియోకియానకు పోయిరి.

22. అక్కడ శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. “మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను” అని వారికి బోధించిరి.

23. ప్రతి క్రీస్తు సంఘము నందును వారు పెద్దలను నియమించి, వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్ధనలతోను, ఉపవాసములతోను వారిని అప్పగించిరి.

24. పిసీదియా భూభాగము మీదుగా పోవుచు, వారు పంఫీలియాకు వచ్చిరి.

25. పెర్గాలో దేవుని వాక్కును బోధించి, అతాలియాకు వెళ్ళిరి.

26. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగివచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహము నకు అప్పగింపబడిన స్థలము ఇదియే.

27. వారు అంతియోకియానకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగుచేసి, దేవుడు వారితో ఉండి చేసినదంతయు, అన్యులు విశ్వసించుటకు, ఆయన ద్వారమును ఎట్లు తెరచిన దియు వారికి తెలియజేసిరి.

28. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలకాలము ఉండిరి.