ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 12 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము

 1. ఈ సమయములో హేరోదు రాజు సంఘములోని కొందరిని హింసింపసాగెను.

2. యోహాను సోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను.

3. ఇది యూదులను సంతోషపరచెనని తెలిసికొని అతడు పేతురును గూడ పట్టి బంధించెను. (ఇది పులియని రొట్టెల పండుగరోజులలో జరిగెను)

4. పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు నలుగురు చొప్పున నాలుగు జట్ల సైనికులు అతనిని కాపలాకాయుచుండిరి. పాస్కపండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసికొని రాదలచెను.

5. అందువలన పేతురు చెరసాలలో ఉంచ బడెను. కాని సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్ధించుచుండెను."

6. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసికొని రాదలచిన నాటిముందటి రాత్రి పేతురు ఇద్దరు కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు రెండు గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖ ద్వారము వద్ద బంట్రోతులు కాపలా కాయుచుండిరి.

7. హఠాత్తుగా ప్రభువు దూత అక్కడ ప్రత్యక్షము కాగా, చెఱసాలయందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు ప్రక్కను తట్టి, అతనిని మేల్కొలిపి, “త్వరగా లెమ్ము” అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రిందపడెను.

8. అప్పుడు ఆ దూత అతనితో, “నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి, నీ చెప్పులు తొడుగుకొనుము” అని చెప్పగా, పేతురు అట్లే చేసెను. మరల ఆ దూత, “నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము" అని పలుకగా, పేతురు దూత చెప్పినట్లు చేసి,

9. అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూచుచున్నట్లు భావించెను.

10. వారు మొదటి కాపలాను పిమ్మట రెండవ కాపలాను దాటి నగరములోనికి పోవుటకు ఇనుప ద్వారము వద్దకు వచ్చిరి. వారు అచటకు వచ్చినపుడు ఆ ద్వారము దాని అంతట అది తెరవబడగా వారు బయటకుపోయిరి. అటుల వారు ఒక వీథిలో కొంతవరకు నడచిపోగా, ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడయ్యెను.

11. అంతట పేతురు, తెలివి తెచ్చుకొని 'జరిగినది అంతయు వాస్తవము అని ఇప్పుడు నాకు రూఢిగా తెలియును. ప్రభువు తన దూతను పంపి హేరోదు బారినుండి, యూదా ప్రజలు నాకు తలపెట్టిన వానినన్నింటినుండి నన్ను తప్పించెను అని తెలిసికొంటిని' అనుకొనెను. .

12. అతడు అట్లు తెలిసికొని మార్కు అను మారుపేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంటికి పోయెను. అక్కడ చాలమంది ప్రజలు చేరి ప్రార్ధించు చుండిరి.

13. పేతురు బయట గుమ్మమువద్ద తలుపు తట్టుచుండగా రోదా అను సేవకురాలు తలుపు తీయుటకు వచ్చెను.

14. ఆమె పేతురు కంఠస్వరమును గుర్తించి, పట్టరాని సంతోషముతో తలుపు తెరువకయే మరల లోనికి పరుగెత్తుకొనిపోయి పేతురు బయట తలుపువద్ద నిలువబడియున్నాడు అని తెలియజేసెను.

15. “నీవు వెఱ్ఱిదానవు” అని లోపలివారు ఆ బాలికతో అనిరి. కాని ఆమె తాను చెప్పినది ముమ్మాటికి నిజమే అనెను. వారు 'అది. అతని దూతయై ఉండును' అని బదులు పలికిరి.

16. పేతురు ఇంకను తలుపు తట్టుచునే ఉండెను. వారు తలుపు తెరచి, పేతురును. చూచి అబ్బురపడిరి.

17. అతడు నిశ్శబ్దముగా ఉండుడని వారికి చేసైగ చేసెను. తరువాత ప్రభువు ఎట్లు తనను చెరసాలనుండి విడిపించెనో వారికి వివరించి చెప్పెను. “ఈ సంగతిని యాకోబునకు, సోదరులకును తెలియజేయుడు” అని చెప్పి వారిని వీడి వేరొక చోటికి వెళిపోయెను. "

18. తెల్లవారిన పిదప పేతురు ఏమయ్యెనో తెలియక కావలి వారిలో తీవ్రమైన కలవరము రేగెను.

19. హేరోదు పేతురును వెదకుటకై ఆజ్ఞను ఇచ్చెను. కాని పేతురును కనుగొనలేకపోయెను. కావున హేరోదు కావలివారిని ప్రశ్నించి వారు చంపబడవలెనని ఆజ్ఞాపించెను. పిమ్మట హేరోదు యూదయానుండి వెళ్ళి కైసరియాలో కొంతకాలము గడిపెను.

20. హేరోదుకు తూరు, సీదోను ప్రజలపై ఆగ్రహము కలిగినందున వారు గుంపుగా హేరోదు వద్దకు పోయిరి. మొదట వారు రాజభవనముపై అధికారి అగు బ్లాస్తుని తమ పక్షమున చేర్చుకొని హేరోదు వద్దకు వెళ్ళి, అతనితో సంధిచేసికొన గోరిరి. ఏలయన, వారి దేశము ఆహార పదార్థముల సరఫరాకై హేరోదు రాజ్యముపై ఆధారపడియుండెను.

21. ఒక నిర్ణీత దినమున హేరోదు , రాజ వస్త్రములను ధరించి, సింహాసనముపై కూర్చుండి ప్రసంగించెను.

22.. ప్రజలు అది విని, “ఇది దేవుని స్వరము, మానవులది కాదు” అని బిగ్గరగా పలికిరి.

23. హేరోదు దేవుని మహిమపరచనందున ప్రభువు దూత వెంటనే అతనిని మొత్తెను. అందువలన అతడు పురుగులు పడి చనిపోయెను.

24. దేవుని వాక్యము అంతటను వ్యాపించుచు వృద్ధియగుచుండెను.

25. బర్నబా, సౌలులు తమపనిని పూర్తిచేసుకొని మార్కు అను మారు పేరుగల యోహానును వెంట బెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వెళ్లిరి.