1. అన్యులు కూడ దేవుని వాక్కును అంగీకరించిరని, యూదయా నీమలో ఉన్న అపోస్తలులు, సోదరులు వినిరి.
2. పేతురు యెరూషలేమునకు వచ్చినపుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించు యూదులు అతనిని విమర్శించిరి.
3. "సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగాపోయి, వారితో కలిసి ఏల భుజించితివి?” అని పేతురును వారు ప్రశ్నించిరి.
4. అందుచే పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గూర్చి మొదటినుండి చివరివరకు వివరింపసాగెను:
5. "నేను యొప్పా నగరములో ప్రార్థన చేసికొను చుండగా, తన్మయత్వములో నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనములో పరలోకమునుండి నాలుగు కొంగులతో క్రిందకు దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటివంటి దానిని చూచితిని. అది నా ఎదుటకు వచ్చి ఆగినది.
6. నేను పరిశీలించి చూడగా అందులో చతుష్పాద జంతువులు, అడవి మృగములు, ప్రాకెడి ప్రాణులు, ఆకాశపక్షులు నాకు కనిపించినవి.
7. అప్పుడు 'పేతురూ! లెమ్ము, వీనిని చంపుకొని తినుము' అను ఒక స్వరము నాకు వినబడెను.
8. కాని నేను 'ప్రభూ! వలదు నేను ఎప్పుడైనను నిషిద్ధమైనదియు, అపరిశుద్ధమైనదియు తినలేదు' అని బదులు పలికితిని.
9. మరల ఆకాశమునుండి ఆ స్వరము 'దేవుడు శుద్ధమైనదని ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు' అని వినిపించెను.
10. ముమ్మారు అట్లు జరిగిన పిదప అది అంతయు పరలోకమునకు తీసికొనిపోబడెను.
11. ఆ సమయములోనే, క్రైసరియా నుండి నా కొరకు పంపబడిన ముగ్గురు మనుష్యులు నేను ఉండిన ఇంటియొద్దకు వచ్చిరి.
12. సందేహింపక వారితో వెళ్ళుము' అని ఆత్మ నాతో చెప్పెను. ఈ ఆరుగురు సోదరులును నాతో కైసరియాకు వచ్చిరి. మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళితిమి.
13. 'నీవు యొప్పాకు మనుష్యుని పంపి పేతురు అనబడు సీమోనును పిలిపింపుము.
14. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబ మును రక్షింపబడుదురు' అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను.
15. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లుగానే, పవిత్రాత్మ వారిపైనను దిగివచ్చెను.
16. 'యోహాను నీటితో బషిస్మమిచ్చెను. కాని మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానము పొందుదురు' అని ప్రభువు చెప్పిన విషయము అపుడు నాకు జ్ఞాపకము వచ్చినది.
17. మనము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకును ఇచ్చెను. ఆయనను కాదనుటకు నేను ఎవడను?” అని పేతురు వారికి తెలియజెప్పెను.
18. వారు ఇది విని విమర్శించుట మానివేసి 'పశ్చాత్తాపపడి, నిత్యజీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడ అవకాశము కల్పించెను' అని దేవుని స్తుతించిరి.
19. సైఫాను చంపబడినపుడు జరిగిన హింసా కాండవలన చెల్లాచెదరైన వారిలో కొందరు దేవుని వాక్కును యూదులకు మాత్రమే బోధించుచు ఫినీషియా, సైప్రసు, అంతియోకియాల వరకు వెళ్ళిరి.
20. కాని సైప్రసు, సిరేనినుండి వచ్చిన కొందరు అంతియోకియానకు వెళ్ళి ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలిడిరి.
21. ప్రభువు హస్తము వారికి తోడైయుండెను. కనుక అనేకులు విశ్వసించి ప్రభువు వైపు తిరిగిరి. .
22. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాను అంతియోకియా నకు పంపిరి.
23. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువుయెడల హృదయ పూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను.
24. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోను, విశ్వాసముతోను నిండియుండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను.
25. పిదప బర్నబా సౌలును వెదకుటకై తార్సుకు వెళ్ళెను.
26. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియానకు తీసికొనివచ్చెను. ఒక ఏడాది వారిద్దరు అచటి సంఘమును కలసికొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటి సారిగా 'క్రైస్తవులు' అని పిలువబడిరి.
27. ఆ రోజులలో " కొందరు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియోకియానకు పోయిరి.
28. వారిలో అగాబు అనువాడు లేచి నిలువబడి భూలోకమంతటను గొప్ప కరువు రానున్నదని ఆత్మ శక్తిచే ప్రవచించెను. ఆ కరువు కౌదియా చక్రవర్తి కాలములో సంభవించెను.
29. అందుచే శిష్యులు తమ శక్తి కొలది యూదయాలో నివసించుచున్న సోదరులకు సాయము పంపవలెనని నిర్ణయించు కొనిరి.
30. వారట్లు చేసి బర్నబా, సౌలుల ద్వారా ఆ డబ్బును సంఘపు పెద్దలకు పంపించిరి.