ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 10 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము

 1. కైసరియా పట్టణములో ఉన్న “ఇటాలియా పటాలము"నకు శతాధిపతియైన కొర్నేలి అనువాడు ఒకడు ఉండెను.

2. అతడు అతని కుటుంబములోని వారందరును దేవునియందు భక్తిశ్రద్ధలు కలిగియుండిరి. అతడు పేదసాదలకు దానధర్మములు చేయుచు సదా దేవుని ప్రార్థించుచుండెను.

3. ఒకనాటి పగలు ఇంచుమించు మూడుగంటల వేళ అతడు ఒక దర్శనమందు దేవదూత అతనివద్దకు వచ్చి “కొర్నేలీ!” అని పిలుచుటను స్పష్టముగా చూచెను.

4. అప్పుడు అతడు భయముతో దూతవైపు పారచూచి, “ఏమి ప్రభూ?” అని అడిగెను. అందుకు దేవదూత, “నీ ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్దముగ చేరినవి.

5. కనుక ఇప్పుడు నీవు కొందరు మనుష్యులను యొప్పా నగరమునకు పంపి, పేతురు అని మారుపేరు గల సీమోనును పిలిపింపుము.

6. అతడు సీమోను అను ఒక చర్మకారుని ఇంట అతిథిగా ఉన్నాడు. అతని ఇల్లు సముద్రతీరమున ఉన్నది” అని చెప్పెను.

7. దూత వెడలిపోగ కొర్నేలి తన పనివారిలో ఇద్దరిని మరియు తనకు సన్నిహితుడు, దైవభక్తుడైన ఒక సైనికుని పిలిచి,

8. జరిగినదంతయు వారికి -వివరించి వారిని యొప్పాకు పంపెను.

9. మరునాడు వారు పయనించుచు యొప్పా నగర సమీపమునకు వచ్చుచుండిరి. అంతలో మధ్యాహ్న సమయమున ప్రార్థన చేసికొనుటకు పేతురు మిద్దెపైకి ఎకెను.

10. అతడు ఆకలిగొనియుండుటచే, భుజింప దలచెను. భోజనము సిద్ధము చేయబడుచుండ అతనికి ఒకదర్శనము కలిగెను.

11. పరలోకము తెరచుకొనగా పెద్ద దుప్పటి వంటిది నాలుగు మూలలతో భూమి మీదికి దింపబడుటను అతడు ఆ దర్శనమందు కాంచెను.

12. దానిలో అన్ని రకముల భూచరములగు జంతువు లును, ప్రాకెడిప్రాణులును, ఆకాశపక్షులును ఉండెను.

13. అప్పుడు, “పేతురూ! లెమ్ము! వీనిని చంపితినుము” అను ఒక స్వరము అతనికి వినిపించెను.

14. అందుకు పేతురు, "ప్రభూ! వలదు. నేనెన్నడును నిషిద్ధమును, అపరిశుద్ధమునైనది ఏదియు తినలేదు” అని సమాధానమిచ్చెను.

15. అందుకు రెండవమారు ఆ స్వరము “దేవుడు పవిత్రపరచిన దానిని నీవు అపవిత్రమైనదని పలుకరాదు” అని వినిపించెను.

16. ముమ్మారు ఇట్లు జరిగిన పిదప అది పరలోకమునకు తీసికొని పోబడెను.

17. ఆ దర్శనమునకు అర్థము ఏమై ఉండునో అని పేతురు లోలోపల ఆశ్చర్యపడుచుండెను. ఇంతలో కొర్నేలిచే పంపబడినవారు సీమోను ఇల్లు ఎక్కడనో అడిగి తెలిసికొని ఆ ఇంటి గుమ్మము ఎదుట నిలువబడి ఉండిరి.

18. అప్పుడు వారు, "పేతురు అనబడు సీమోను ఇచ్చట ఉన్నాడా?” అని అడిగిరి.

19. పేతురు దర్శనము యొక్క అర్థమును గ్రహింప ప్రయత్నించుచు ఇంకను ఆలోచించుచుండెను. పవిత్రాత్మ అతనితో “పేతురూ! వినుము. ఇక్కడ ముగ్గురు మనుష్యులు నీ కొరకు వెదకుచున్నారు.

20. కాబట్టి నీవు లేచి, వారితో వెళ్ళుటకు సందేహింపకుము. ఏలయన, వారిని నేను పంపియున్నాను” అని పలుకగా,

21. పేతురు క్రిందకు పోయి, వారితో “మీరు వెదకుచున్న వాడను నేనే. మీరు ఏల ఇచ్చటకు వచ్చితిరి?” అని అడిగెను.

22. అందుకు వారు. “కొర్నేలి అను శతాధిపతి మమ్ము పంపినాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, అంతేగాక యూదులచేత గొప్పగా గౌరవింప బడుచున్నవాడు. నీవు చెప్పదలచిన దానిని తెలిసికొను టకు నిన్ను తన ఇంటికి ఆహ్వానించుటకు ఒక దేవ దూతచే అతడు ఆదేశింపబడెను” అని పలికిరి.

23. అది విని పేతురు వారిని లోపలకు తీసికొనిపోయి అతిథి సత్కారము చేసెను. మరునాడు అతడు సిద్ధపడి వారివెంట వెళ్ళెను. యొప్పాకు చెందిన సోదరులు కూడ కొందరు అతనివెంట వెళ్ళిరి.

24. ఆ మరునాటికి అతడు కైనరియా చేరుకొనెను. అక్కడ కొర్నేలి తన బంధువులను, ప్రాణ స్నేహితులను ఆహ్వానించి, పేతురు కొరకై ఎదురు చూచుచుండెను.

25. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి, పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను.

26. పేతురు అతనితో, “లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే” అని పలికెను.

27. పేతురు కొర్నేలితో మాటలాడుచు లోనికి వెళ్ళి, అచ్చట అనేకులు కూడియుండుట చూచెను.

28. పేతురు వారితో "యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమిచేయుట తగదని మీకు బాగుగా తెలియునుగదా! కాని ఏ మనుష్యునైనను నిషేధింపబడినవాడని, అపరిశుద్దుడని నేను భావింప రాదని దేవుడు నాతో చెప్పియున్నాడు.

29. కనుక, మీరు నా కొరకు మనుష్యులను పంపినపుడు, ఎట్టి సంకోచమును లేక నేను వచ్చితిని. నన్ను మీరు పిలిపించిన కారణమేమి?" అని ప్రశ్నించెను.

30. అప్పుడు కొర్నేలి, “నాలుగుదినముల క్రిందట ఇదే సమయములో పగలు మూడుగంటల వేళ, నేను నా ఇంటిలో ప్రార్థన చేసికొనుచుంటిని. హఠాత్తుగా కాంతిమంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలువబడి,

31. 'కొర్నేలీ! దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను. నీ ధర్మకార్యములను గుర్తించెను.

32. పేతురు అనబడు సీమోనును పిలిపించుటకు ఒకనిని యొప్పాకు పంపుము. అతడు చర్మకారుడగు సీమోను ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్రతీరమున ఉన్నది' అని నాకు తెలిపెను.

33. వెంటనే నేను నీకొరకు మనుష్యులను పంపితిని. నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతిచ్చిన దానిని ఆలకించుటకై వేచి యున్నాము” అని పేతురునకు తెలియజెప్పెను.

34. అంతట పేతురు నోరుతెరచి ఇట్లు ప్రసంగింప నారంభించెను: “దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని.

35. దేవునికి భయపడుచు, సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే.

36. అందరికి ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు యిస్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను  ప్రకటించుట మీరు ఎరిగినదే కదా!

37. యోహాను బోధించిన బప్తిస్మానంతరము గలిలీయలో ప్రారంభమై యూదయా అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే.

38. పవిత్రాత్మతోను, శక్తి తోను, దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియును. ఆయన అంతటను పర్యటించుచు, మేలు చేయుచు, పిశాచ శక్తికి లోబడిన వారందరిని స్వస్థపరచెను. ఏలయన, దేవుడు ఆయనతో ఉండెను.

39. యూదుల దేశములోను, యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నిటికిని మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి.

40. అయినను దేవుడు ఆయనను మూడవనాడు మృతులనుండి లేపి, మరల మాకు కనబడునట్లు చేసెను.

41. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి, ఆయనకు సాక్షులమైయున్న మాకు మాత్రమేగాని ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతులనుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి.

42. జీవితులకును, మృతులకును తీర్పరిగా దేవుడు నియమించినవాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు, సాక్ష్యమీయవలెననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను.

43. ఈయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరు పలికినది ఈయనను గురించియే.”

44. పేతురు ఇంకను మాట్లాడుచుండగ ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను.

45. పేతురుతో యొప్పానుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు, అన్యులపై కూడ దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి.

46. ఏలయన, ఆ అన్యులును క్రొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూచిరి.

47. పేతురు, “ఇప్పుడు మనవలెనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞానస్నానమును పుచ్చుకొను టను ఎవరైనను వారింపగలరా” అనుచు,

48. “యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్నానమును పొందుడు” అని వారిని ఆజ్ఞాపించెను. కొన్ని దినములు తమవద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి.