ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 1 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము

 1. ఓ తెయోఫిలూ! నా మొదటి గ్రంథమున యేసు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటిని గూర్చి వ్రాసితిని.

2. ఆయన పరలోకమునకు చేర్చుకొనబడిన దినమువరకు తాను ఎన్నుకొనిన అపోస్తలులకు, పవిత్రాత్మద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను.

3. యేసు మరణించినపిదప, నలువది దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు, తాను సజీవుడనని వారికి పలువిధముల ఋజువుపరచు కొనెను, దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను.

4. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: “మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి, నాతండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండుడు.

5. ఏలయన, యోహాను నీటితో బప్తిస్మమును ఇచ్చెను గాని కొన్ని దినములలో మీరు పవిత్రాత్మచేత జ్ఞానస్నానమును పొందుదురు.”

6. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, “ప్రభూ! ఇప్పుడు మీరు యిస్రాయేలునకు రాజ్యమును పునరుద్దరించెదరా?” అని అడుగగా,

7. యేసు వారితో, “కాలములును, సమయములును నా తండ్రి తన అధికారమున ఉంచుకొనియున్నాడు. వాటిని గూర్చి తెలిసికొనుట మీ పని కాదు.

8. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చునప్పుడు, మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యూదయా, సమరియా సీమలయందు అంతటను, భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు" అనెను.

9. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు ఎత్తబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండ, ఒక మేఘము ఆయనను కొనిపోయెను.

10. ఆయన వెళ్ళుచుండగా, వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన ఇద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి,

11. “గలిలీయులారా! మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలవచ్చును” అని వారితో చెప్పిరి.

12. అప్పుడు అపోస్తలులు ఓలీవు వనము అనబడు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతిదినమున నడువగలిగినంత దూరమున కలదు.

13. వారు యెరూషలేమున ప్రవేశించి, తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా- పేతురు, యోహాను, యాకోబు, అంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తలో మయి, మత్తయి, అల్పయి కుమారుడు యాకోబు, మతాభిమానియగు సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు.

14. వీరందరు, వీరితోపాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు, ఆయన సోదరులును ఒక చోటచేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.

15. ఆ దినములలో పేతురు సహోదరులమధ్య లేచి నిలబడి ఇట్లనెను: (అచట రమారమి నూట ఇరువది మంది సహోదరులు సమావేశమైరి)

16. “సోదరులారా! యేసును పట్టుకొనినవారికి దారి చూపిన యూదాను గూర్చి, పవిత్రాత్మ పూర్వము దావీదు నోట పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసియుండెను.

17. అతడు మనలో ఒకడై యుండి ఈ పరిచర్యయందు పాలుపంచుకొనెను.”

18. యూదా ఇస్కారియోతు గురుద్రోహము వలన సంపాదించిన రూకలతో ఒక పొలమును కొనెను. అతడు తలక్రిందుగా పడగా, పొట్టపగిలి లోపల ఉన్న ప్రేవులన్నియు బయటపడెను.

19. ఈ విషయము యెరూషలేములో నివసించు వారందరకు తెలిసెను. కనుక, ఆ పొలము వారి మాతృభాషలో 'అకెల్దామ' అని పిలువబడెను. దానికి 'రక్తభూమి' అని అర్ధము.

20. పేతురు ఇంకను వారితో, “ఏలయన, 'అతని ఇల్లు నిర్జనమగునుగాక! దానిలో ఎవడును నివసింపకుండునుగాక! వేరొకడు అతని ఉద్యోగమును తీసికొనును గాక!' అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.

21. కాబట్టి మన ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరియొకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసినవాడు,

22. యోహాను బప్తిస్మమును ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభువు పరలోకమునకు కొనిపోబడిన దినమువరకును, ఆయన మనమధ్య సంచరించిన కాలమున మనతో ఉండినవాడై ఉండవలయును” అనెను.

23. కావున వారు, యూస్తు అను మారు పేరుగల బర్నబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇరువురిని ముందు నిలువబెట్టి ఇట్లు ప్రార్థించిరి:

24. “ఓ ప్రభువా! మీకు అందరి హృదయములు తెలియును. తన దారిన పోవుటకు యూదా విసర్జించిన ఈ పరిచర్యలోను, అపోస్తలత్వములోను,

25. పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకొంటిరో మాకు తెలియజేయుడు” అని ప్రార్థించిన పిమ్మట,

26. వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తీయ ఎన్నిక అయ్యెను. కనుక అతడు పదునొకొండుగురు అపోస్తలులతో లెక్కింపబడెను,