ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2nd timothy Chapter 2 || Telugu Catholic Bible || తిమోతికి వ్రాసిన 1వ లేఖ 2వ అధ్యాయము

 1. నా కుమారుడా! క్రీస్తు యేసునందు లభించు అనుగ్రహము ద్వారా నీవు బలవంతుడవు కమ్ము.

2. పెక్కుమంది సాక్షుల సమక్షమున నేను బోధింపగా నీవు వినిన పలుకులను, ఇతరులకు గూడ బోధింపగల నమ్మకమైన వారికి అప్పగింపుము.

3. క్రీస్తు యేసు మంచి సైనికునివలె నాతోపాటు శ్రమను అనుభవింపుము.

4. ప్రతి సైనికుడు తనను సైన్యమున చేర్చుకొనిన నాయకుని సంతోషపెట్టవలె నని అభిలషించును. కనుకనే అతడు లౌకిక వ్యవహారములలో చిక్కుకొనడు.

5. పరుగు పందెములో పాల్గొనుచున్న వ్యక్తి నియమములను పాటింపనిదే కిరీటము పొందజాలడు.

6. బాగుగా కష్టించి పనిచేయు రైతునకు పంటలో ప్రథమభాగము లభింపవలెను.

7. నేను చెప్పు విషయమును గూర్చి ఆలోచింపుము. ప్రభువు నీకు అన్నిటిని గ్రహించు శక్తిని ఒసగును.

8. నేను బోధించు సువార్తయందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలోనుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞప్తియందుంచుకొనుము.

9. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్థునివలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను కూడ, కాని దేవుని వాక్కు బంధింప బడలేదు.

10. ఈ కారణముననే ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు, క్రీస్తు యేసునందలి రక్షణను నిత్య మహిమతో కూడ పొందవలెనని వారలకొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను.

11. “మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరల జీవింతుము.

12. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతోపాటు రాజ్యపాలనముచేతుము.  మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును.

13. మనము ఆయనను నమ్మనివారమైనను ఆయన నమ్మదగినవాడుగ ఉండును. ఆయన ఆత్మద్రోహము ఒనర్చుకొనలేడు గదా!” అను ఈ వాక్కులు యథార్థములు.

14. ఈ విషయములను గూర్చి నీ ప్రజలకు జ్ఞాపకముచేసి, వాగ్వివాదములయందు వారు పాల్గొనరాదని దైవసన్నిధిన వారిని తీవ్రముగ హెచ్చరింపుము. అట్టి వాదములు మేలుచేయకుండుటయేకాక, విను వారిని సర్వనాశనము చేయును.

15. నీవు చేయు పనిని గూర్చి సిగ్గుపడని పనివాడవుగను, దేవుని సత్య సందేశమును యథాతథముగ బోధించువాడవుగను, నీవు దేవుని దృష్టిలో సంపూర్ణామోదమును పొందు టకు శ్రమింపుము.

16. అపవిత్రమును, వ్యర్థమునైన సంభాషణలకు దూరముగా ఉండుము. ఏలయన, అట్టి సంభాషణలు మనుజులను మరి ఎక్కువగా భక్తిహీనులను చేయును.

17. కొరుకుడుపుండులాగా వారి మాటలే వారిని తినివేయును. హిమనేయుసు పిలేతు సును అట్టి బోధకులలో ఇరువురు.

18. వారు సత్యమార్గమును వదలి, పునరుత్థానము ఇప్పటికే జరిగి పోయినదని కొందరి విశ్వాసుల నమ్మకమును చెడ గొట్టుచున్నారు.

19. కాని దేవునిచే నిర్మింపబడిన ఈ గట్టిపునాది కదలిపోవునది కాదు. “తన వారు ఎవరో ప్రభువునకు ఎరుకయే” అనియు, “ప్రభువు నామమును పేర్కొనెడి ప్రతివ్యక్తియు పాపమార్గము నుండి మరలవలెను” అనియు, ఆ పునాదిపై వ్రాయబడినది.

20. గొప్ప ఇంటిలో రకరకములపాత్ర సామగ్రి ఉండును. అందుకొన్ని వెండివి, బంగారపువి మాత్రమే గాక, కొన్ని మట్టివి, చెక్కవి. వానిలో కొన్ని సామాన్యముగ ఉపయోగించుకొనుటకును, మరికొన్ని ప్రత్యేక సమయముల కొరకును ఉద్దేశింపబడినవి.

21. అట్లే ఈ దుష్కార్యములకు దూరముగా ఉండి నిర్మలుడగు వ్యక్తి ప్రత్యేక ప్రయోజనములకై ఉపయోగింప బడును. ఏలయన, అట్టివాడు తన యజమానునికి ఆత్మార్పణగావించుకొని, ప్రయోజనకరముగను, ఏ సత్కార్యమునందైనను వినియోగింపబడుటకు సిద్ధముగను ఉండును.

22. నీవు యవ్వన వ్యామోహములను వదలి, పవిత్ర హృదయముతో ప్రభువుయొక్క సాయము కోరెడు వారితోపాటు, నీతి, విశ్వాసము, ప్రేమ, శాంతియను వానికై శ్రమింపుము.

23. కాని అజానపూరితములగు మూర్ఖపు వివాదములకు దూరముగ ఉండుము. అట్టివి కలహములకు దారి తీయును.

24. ప్రభువునకు సేవకుడగువాడు కలహింపరాదు. అతడు అందరియందును కనికరముగలవాడై

25. తన విరోధులను సాత్వికముగ సరిదిద్దుచు, సహన శీలుడగు బోధకునిగ ఉండవలెను. పశ్చాత్తాపపడి, సత్యమును గ్రహించు అవకాశము దేవుడు వారికి అను గ్రహించునేమో!

26. అప్పుడు వారు తన ఇష్ట ప్రకారము చేయుటకు తమను పట్టుకొని లోబరచు కొనిన సైతాను వలనుండి తప్పించుకొందురు.