ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2nd Peter chapter 3 || Telugu Catholic Bible || పేతురు వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము

 1. ప్రియ మిత్రులారా! ఇది నా రెండవ జాబు. రెండు జాబులలోను ఈ విషయములను గుర్తుచేయుట ద్వారా మీ మనస్సులలో సద్భావములను రేకెత్తించుటకు ప్రయత్నించితిని.

2. గతమున పవిత్రులగు ప్రవక్తలచే ప్రబోధింపబడిన పలుకులను మీరు జ్ఞాపకము ఉంచు కొనవలెనని నా అభిమతము. మీరు మీ అపోస్తలుల ద్వారా పొందిన ప్రభువును, రక్షకుడును అగువాని ఆజ్ఞను మరువరాదు.

3. తుది సమయమున, అపహాసకులు కొందరు ఉదయింతురను విషయమును మీరు ముఖ్యముగా తెలిసికొనవలయును. వారు మిమ్ము హేళనచేయుచు తమ వ్యామోహములను అనుసరించుదురు.

4. "ఆయన వచ్చెదనని వాగ్దానమొనర్చినాడు గదా! మరి ఎచట ఉన్నాడు? మన తండ్రులు అప్పుడే గతించినారు. కాని మార్పేమియును లేదే? సమస్తమును యథాతథముగనే ఉన్నదే? సృష్ట్యాది నుండి ఎట్లున్నదో ప్రపంచము అట్లే ఉన్నది గదా!” అని వారు పలుకుదురు.

5. అనాది కాలమున దేవుడు పలికెను కనుకనే దివి, భువి సృజింపబడినవి అను ఈ విషయమును వారు బుద్ధిపూర్వకముగనే ప్రస్తావింపరు. జలములద్వారా, జలమునుండి భువి సృజింప బడినది.

6. ఆ జలమువలననే, జలప్రళయము చేతనే అప్పటి లోకము నశింప జేయబడెను.

7. దేవుని వాక్కు చేతనే ఇప్పటి దివియు, భువియు, అగ్నిలో దగ్గమ గుటకు గాను ఉంచబడినవి. దుష్టులు తీర్పునకు గురి ఒనర్పబడి నశింపచేయబడు నాటికై అవి భద్రము చేయబడినవి.

8. కాని, ప్రియ మిత్రులారా! ఈ ఒక్క విషయ మును మరవకుడు. దేవునిదృష్టిలో ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

9. కొందరు భావించునట్లు ప్రభువు తన వాగ్దానమును నెరవేర్చుటయందు ఆలస్యముచేయడు. అంతేకాక మీతో ఎంతయో ఓపికగా ఉండును. ఏలయన, ఎవరును నాశనము కావలెనని ఆయన కోరడు. కాని అందరును పాపము నుండి విముఖులు కావలెననియే ఆయన వాంఛ.

10. కాని ప్రభువు దినము దొంగవలె వచ్చును. ఆ రోజున భయంకర ధ్వనితో ఆకాశము అంతరించును. గ్రహతారకాదులు దగ్ధమై నశించును. భువి సర్వ వస్తుసంచయముతో పాటు అదృశ్యమగును.

11. సమస్తమును ఇట్లు నశించుచున్నచో, మీరు ఎట్టివారై ఉండవలయును? మీ జీవితములు దేవునకు సంపూ ర్లముగా అంకితములై ఉండవలయును.

12. దేవుడు వచ్చు దినమునకై వేచియుండి, అది త్వరలో వచ్చునట్లు మీరు సాధ్యమైన కృషిఒనర్పుడు. దివి దగ్ధమై నశించి, గ్రహతారకాదులు ఆ వేడిమికి కరిగి ప్రవహించు దినమే అది.

13. కాని నీతికి నిలయమగు క్రొత్త దివిని, భువిని దేవుడు వాగ్దానమొనర్చెను. కనుక మనము వానికై వేచి ఉందము.

14. కావున మిత్రులారా! ఆ దినమునకై వేచి ఉండి, దేవుని దృష్టిలో పరిశుద్ధులుగను నిర్దోషులుగను ఉండుటకును, ఆయనతో సౌమ్యముగా ఉండుటకును, సాధ్యమైనంతవరకు ప్రయత్నింపుడు.

15. ప్రభువు సహనమును, మీ రక్షణమునకై ఆయన మీకు ఒసగిన అవకాశముగ భావింపుడు. మన సోదరుడగు పౌలు కూడ దేవుడొసగిన జ్ఞానముచే మీకు అట్లే వ్రాసి ఉండెను గదా!

16. ఈ విషయమును గూర్చి జాబు వ్రాయునపుడెల్ల అతడు వీనిని గూర్చి చెప్పుచుండును. అతని ఉత్తరములలో కొన్ని గ్రహించుటకు కష్టతరమైన విషయములు ఉండును. వానికి జ్ఞానహీనులు, చంచల మనస్కులు తక్కిన లేఖనములకును కల్పించినట్లే విపరీతార్థములు కల్పించి ఆత్మవినాశనమును తెచ్చు కొందురు.

17. కాని, ప్రియులారా! మీకు ఈ విషయము పూర్వమే తెలియును. కనుక జాగ్రత్తపడుడు. చట్టవిరోధుల దోషములవలన పెడత్రోవలు పట్టి దుర్మార్గులు కాకుండుడు. మీ సుస్థిర స్థానము నుండి భ్రష్టులు కాకుండుడు.

18. మన ప్రభువును, రక్షకుడును అగు యేసు క్రీస్తునుగూర్చిన జ్ఞానమువలనను, ఆయన అనుగ్రహమువలనను వర్ధిల్లుడు. ఆయన సదా మహిమోపేతుడు అగుగాక! ఆమెన్.