ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2nd Peter chapter 1 || Telugu Catholic Bible || పేతురు వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము

 1. యేసుక్రీస్తు సేవకుడును అపోస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు, రక్షకుడగు యేసు క్రీస్తు యొక్కయు నీతి ద్వారా, మా విశ్వాసము వంటి అమూల్యమైన విశ్వాసము అనుగ్రహింప బడినవారికి వ్రాయునది.

2. దేవుని గూర్చినదియు, మన ప్రభువగు యేసు క్రీస్తును గూర్చినదియు అగు మీ జ్ఞానము ద్వారా మీకు సంపూర్ణమగు కృపయు, శాంతియు కలుగును గాక!

3. ఆయన దివ్యశక్తి పవిత్ర జీవనమునకు సంబంధించిన సమస్తమును మనకు ఒసగినది. ఆయ నను గూర్చిన జ్ఞానము ద్వారా మనకు అది ఒసగ బడెను. తన మహిమలోను, మంచితనములోను పాలుపంచుకొనుటకు మనలను ఆయన పిలిచెను.

4. ఈ విధముగ ఆయన మనకు అమూల్యములును, అత్యుత్తమములును అగు వాగ్దానములను ఒనర్చెను. ఆయన వాగ్దానము ఒనర్చిన వానిని పొందుటద్వారా మీరు దురాశవలన కలిగెడి భ్రష్టత్వమునుండి తప్పించుకొనగలరు. కనుకనే దైవస్వభావములో భాగస్వాములు అగుదురు.

5. ఈ కారణముననే మీ విశ్వాసమునకు మంచితనమును జోడించుటకై సాధ్యమైన కృషి ఒనర్పుడు, మీ మంచితనమునకు విజ్ఞానమును జతచేయుడు,

6. విజ్ఞానమునకు ఇంద్రియనిగ్రహమును తోడొనర్పుడు, ఇంద్రియ నిగ్రహమునకు సహనమును చేర్పుడు, సహనమునకు దైవభక్తిని జతచేయుడు,

7. దైవ భక్తికి సోదరప్రేమను తోడొనర్పుడు, సోదరప్రేమకు ప్రేమను కలుపుడు.

8. మీకు అవసరమగు గుణములు ఇవియే. ఇవి మీయందు పరిపూర్ణముగ ఉన్నచో, మన ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమున ఇవి మిమ్ము చైతన్యవంతులుగను, ఫలవంతులుగను చేయును.

9. ఇవి లేనివాడు సంకుచితమైన దృష్టిగలవాడు. కనుకనే అతడు చూడలేడు. అంతేకాక తన పాత పాపములు ప్రక్షాళనమైనవని కూడ అతడు మరచిపోవును.

10. కనుక సోదరులారా! మీ పిలుపును, ఎన్నికను నిశ్చయము చేసికొనుటకు సత్క్రియలను చేయ మరింత గట్టిగా ప్రయత్నింపుడు. అటుల ఒనర్చినచో మీరు ఎన్నటికిని భ్రష్టులుకాకుండ ఉండగలరు.

11. ఇటుల మన ప్రభువు రక్షకుడగు యేసు క్రీస్తు యొక్క శాశ్వత రాజ్యమున ప్రవేశించుటకు అవసరమగునవి అన్నియు సమృద్ధిగా మీకు అనుగ్రహింపబడును.

12. ఈ కారణముననే ఈ విషయములను గూర్చి మీకు ఎప్పుడును గుర్తుచేయుచుందును. అవి మీకు తెలిసినవే అనియు మీరు స్వీకరించిన సత్యమున మీరు స్థిరత్వము కలవారనియు నేను ఎరుగక పోలేదు.

13. నేను ఈ గుడారములో ఉన్నంతకాలము, ఈ విషయములను గూర్చి మీకు జ్ఞావకము చేసి, మిమ్మును పురిగొల్ప సమంజసమని నా తలంపు.

14. ఏలయన, నా ఈ గుడారమును త్వరలో త్యజింపనున్న విషయమును మన ప్రభువగు యేసు క్రీస్తు నాకు స్పష్టపరిచియే ఉన్నాడు.

15. కనుక నా మరణానంతరము కూడ, ఎల్లకాలము మీకు ఈ విషయములు గుర్తుండునట్లు ఒనర్చుటకు ప్రయ త్నింతును.

16. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహత్త రమగు ఆగమనమును మీకు తెలియజేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులార మేము ఆయన గొప్పతనమును కాంచితిమి.

17. పితయగు దేవుడు ఆయనకు కీర్తిని, వైభవమును ప్రసాదించినపుడు మేము అటనుంటిమి. “ఈయన నా ప్రియపుత్రుడు. ఈయనను గూర్చి నేను సంతో షించుచున్నాను" అని దివ్యవాణి పలికినది.

18. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. .

19. కనుకనే ప్రవక్తల ప్రబోధములయందలి సందేశములను మరింత అధికముగ మనము నమ్ము చున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలయన, ఉషఃకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపువరకు, అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది.

20. ఇది మాత్రము తప్పక జ్ఞాపకము ఉంచుకొనుడు. తనంతట తానుగా, ఏ ఒక్కడును లేఖనమునందలి ప్రవచనమును వివరింప లేడు.

21.ఏలయన, ఏ ప్రవచన సందేశమును కేవ లము మానవ సంకల్పముచే జనించలేదు. ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రభావితులై దేవుని నుండి జనించిన సందేశమునే పలికిరి.