2 Corinthians chapter 6 in Telugu || Telugu catholic Bible || కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము
1. మీరు పొందిన దేవుని కృపను వ్యర్ధము చేయ రాదు అని దేవుని తోటిపనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము.
2. ఏలయన “అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని. రక్షణ దినమున నీకు తోడ్పడితిని” అని దేవుడు చెప్పుచున్నాడుగదా! అయినచో ఆలకింపుడు! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలసమయము, ఇదే రక్షణ దినము!
3. మా పనియందు ఒకరు తప్పుపట్టుట మాకు ఇష్టము లేదు. కనుకనే ఎవ్వరి మార్గమునకును ఆటంకములు కలిగింపకుండుటకు ప్రయత్నింతుము.
4. పైగా బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందును మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము.
5. మేము కొట్టబడితిమి. చెర యందుంచబడితిమి. అల్లరిమూకల అలజడికి గురియైతిమి. అధికముగ పని చేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి.
6.కాని మాపావిత్య్రముచేతను, విజ్ఞానముచేతను, ఓర్పుచేతను, దయచేతను, పవిత్రాత్మవలనను, నిజమైన ప్రేమవలనను,
7. సత్యసందేశమువలనను, దేవుని శక్తివలనను మేము దేవుని సేవకులమని నిరూపించుకొంటిమి. ఎదిరించుటకును, రక్షించుకొనుటకును మాకు నీతియే ఆయుధము.
8. మేము గౌరవింపబడితిమి, అవమానింపబడితిమి, నిందింపబడితిమి, స్తుతింపబడితిమి. అసత్యవాదులుగ అవమానింపబడినను మేము సత్యమునే పలుకుచున్నాము.
9. మేము అనామకులుముగ ఉండియు అందరకు తెలిసినవారమే. మేము మరణించుచున్నను జీవించుచునే ఉన్నాము. మేము శిక్షింపబడినను చంపబడలేదు.
10. మేము విషాదాత్ములమైనను సదా సంతోషించుచున్నాము. మేము పేదవారముగ గోచరించుచున్నాము, కాని పెక్కు మందిని భాగ్యవంతులను చేయుచున్నాము. ఏమియు లేనివారము అనిపించుకొన్నాము. కాని, యథార్థముగ అన్నియు ఉన్నవారము.
11. కొరింతులోని ప్రియమిత్రులారా! మీతో దాపరికము లేకుండ మాట్లాడితిమి. మా హృదయములను మీ ఎదుట విప్పితిమి.
12. మా హృదయములను మీకు మరుగుచేయలేదుకదా! మీరే మీ హృదయములను నాకు చాటుచేసితిరి.
13. మిమ్ము నా బిడ్డలుగ భావించి మీతో ఇట్లనుచున్నాను. మీ హృదయములను కూడ విశాలము చేయుడు.
14. అవిశ్వాసులతో కలిసి ఒంటరిగా పని చేయకుడు. ఏలయన నీతి, అవినీతి ఎట్లు కలిసి ఉండగలవు? చీకటి వెలుతురు ఎట్లు ఒకచోట కలిసి ఉండగలవు?
15. క్రీస్తుకు సైతానుతో ఏమి సంబంధము? విశ్వాసికి, అవిశ్వాసికి సామ్యమేమి?
16. దేవుని ఆలయము, అవిశ్వాసుల విగ్రహములతో ఎట్లు ఏకీభవింపగలదు? ఏలయన, మనమే సజీవుడగు దేవుని ఆలయము గదా? “నేను నా నివాసమును వారితో ఏర్పరచుకొందును, వారి మధ్యనే జీవింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు” అని దేవుడే స్వయముగ పలికెను గదా?
17. కనుక “మీరు వారిని విడువవలెను, వారి నుండి వేరుపడవలెను, అపరిశుద్ధమగు దానితో ఎట్టి సంబంధమును ఉంచుకొనకుడు. అప్పుడే మిమ్ము చేరదీసెదను.
18. మీకు నేను తండ్రిని అగుదును. మీరు నా బిడ్డలగుదురు. అని సర్వశక్తిమంతుడగు ప్రభువు పలుకుచున్నాడు" అని ప్రభువు పలికెను.