ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Corinthians chapter 5 in Telugu || Telugu catholic Bible || కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము

 1. మనము భూమిమీద జీవించు ఈ గుడారము, అనగా మన భౌతికదేహము శిథిలమగును. అప్పుడు మన జీవమునకై దేవుడు వరలోకమున ఒక గృహమును ఒసగును. అది చేతులతో చేసినది కాదు. అది ఆయనచే నిర్మింపబడినదే. పైగా నిత్యమైనదని మన మెరుగుదుము.

2. ఆ దివ్యగృహమునకై మనము నిరీక్షించుచు నిట్టూర్చుచున్నాము.

3. ఏలయన, దానిని, ధరించుటచే మనము దిగంబరులముగా కనపడము.

4. ఈ భౌతిక గుడారమున నివసించినంత కాలము, ఒక విధమైన భారముచే దుఃఖముతో నిట్టూర్చుచున్నాము. భౌతికశరీరమును విడిచి వేయ వలెనని మన కోరిక కాదు. కాని మర్త్యమైనది జీవ ముచే మ్రింగబడునట్లు దివ్యశరీరమును ధరింప వలెనని మన అభిలాష.

5. ఈ మార్పునకు మనలను సిద్ధమొనర్చినది దేవుడే. ఆయన మనకై ఉంచిన సమస్తమునకు తన ఆత్మను హామీగ ఒసగెను.

6. కనుకనే మనము ఎల్లప్పుడును సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంతకాలమును, ప్రభువునకు మనము దూరముగ ఉన్నాము.

7. ఏలయన, మనము దృష్టివలనగాక, విశ్వాసమువలన నడుచుకొనుచున్నాము.

8. కనుకనే మనము సంపూర్ణధైర్యముతో ఉండి ఈ భౌతికశరీర మును త్యజించి ప్రభుసన్నిధిని చేరుటయే మేలని తలంతుము.

9. అన్నిటికంటె అధికముగ, మనము ఈ గృహమున ఉన్నను, దీనిని విడిచినను, ఆయనను సంతోష పెట్టవలయుననియే వాంఛింతుము.

10. ఏలయన, మనము అందరమును న్యాయవిచారణకై క్రీస్తు ఎదుట అగపడవలెనుగదా! అప్పుడు వారివారి అర్హతలను బట్టి, మంచివిగాని, చెడ్డవిగాని, భౌతిక శరీరమున వారువారు ఒనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము ఒసగబడును.

11. ప్రభువును గూర్చి భయపడుట అననేమియో మాకు తెలియును. కనుకనే మానవులను ఒప్పించుటకు ప్రయత్నింతుము. మమ్ము గూర్చి దేవునకు సమస్తము విదితమే. మీరు కూడ మీ హృదయములలో నన్ను గూర్చి సంపూర్ణముగ ఎరిగియున్నారని నమ్ముచున్నాను.

12. మేము మరల మమ్ము గూర్చి మీకు గొప్పగా చెప్పుకొనుచున్నాము అనుకొనకుడు. కాని మమ్ము గూర్చి మీరు గర్వింప దగిన ఒక కారణమును మాత్రము చూపుచున్నాము. ఏలయన, కేవలము ఒకవ్యక్తి యొక్క శీలమునుబట్టి కాక, అతని రూపమునుబట్టియే వానిని శ్లాఘించు ప్రజలకు మీరు సమాధానము ఇవ్వవలసి ఉన్నది కదా!

13. మేము పిచ్చివారమా? అది కేవలము దేవుని కొరకు మాత్రమే. మేము వివేకవంతులమా? అది మీ కొరకే.

14. ఏలయన, మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించెనని మనము ఇప్పుడు గుర్తించితిమి గదా! అనగా, మానవులు అందరును ఆయన మృత్యువున పాల్గొందురనియే గదా భావము.

15. జీవించుచున్నవారు, ఇక మీదట కేవలము తమ కొరకు కాక, ఆయన కొరకే జీవించుటకుగాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మర ణించి, పునరుత్థానము చెందినది వారి కొరకే గదా!

16. కనుక, ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను, నేడు అటుల చేయము.

17. కావున, ఎవ్వడైనను క్రీస్తునందున్న యెడల అతడు నూతనసృష్టి! పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను.

18. ఇది అంతయు దేవునివలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్య పరచుకొని, ఇతరులనుకూడ ఆయనతో సఖ్యపరచు ప్రేషితకార్యమును మాపై పెట్టెను.

19. కనుక, దేవుడు క్రీస్తు ద్వారా మనుష్యులనందరిని తనతో సఖ్యపరచు కొనుచున్నాడు అనునదే మా సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అటుల చేయుచున్నాడు. అంతే గాక, ఆ సఖ్యతను గూర్చిన సందే శమును బోధించు పనిని మాకు అప్పగించి యున్నాడు.

20. కనుక మేము క్రీస్తు రాయబారులమై క్రీస్తు కొరకు మాట్లాడుచూ ఇదిగో మేము ఇటు వచ్చితిమి. దేవుడే మాద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. కావున దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్ము బతిమాలుకొనుచున్నాము.

21. క్రీస్తు పాపరహితుడు. కాని, దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగ చేసెను. ఏలయన, ఆయనతో ఏకమగుట వలన, మనము దేవుని నీతిగ రూపొందవలెనని అటుల చేసెను.