ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Corinthians chapter 3 in Telugu || Telugu catholic Bible || కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము

 1. ఇదియు ఆత్మస్తుతివలెనే మీకు గోచరించు చున్నదా? ఇతరులవలె మేమును, మీకుగాని, మీ నుండిగాని పరిచయ పత్రములను సంపాదింపవలెనా?

2. మీరే మా హృదయములపై వ్రాయబడి అందరును తెలిసికొనదగినదియు, చదువదగినదియు అగు మా పరిచయ పత్రము.

3. క్రీస్తే ఈ పరిచయ పత్రమును వ్రాసి మా ద్వారా పంపెననుట సుస్పష్టము. అది రాతిపలకపై సిరాతో వ్రాయబడలేదు. అది మానవ హృదయములపై సజీవుడగు దేవునిఆత్మతో వ్రాయ బడినది.

4. క్రీస్తు ద్వారా దేవునిపై మాకున్న విశ్వాసము ఇట్టిది. కనుకనే మేము ఇట్లు పలుకుచున్నాము.

5. మేము ఈ పనిని సాధింపగలమని చెప్పుకొనదగినది ఏదియు మాయందు లేదు. మా సామర్థ్యము దైవ దత్తమే.

6. వ్రాతపూర్వకమగు నియమములను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవింపగల సామర్థ్యమును మాకు ఒసగినది ఆయనయే. వ్రాతపూర్వకమగు నియమములు మృత్యుకారకములు. ఆత్మ జీవప్రదాత.

7. ధర్మశాస్త్రము రాతిపలకలపై చెక్కబడినది. అది అనుగ్రహింపబడిననాడు దేవుని మహిమ గోచరించినది. అది క్రమముగా క్షీణించినను, మోషే ముఖముపై గోచరించిన తేజస్సు ఎంతో కాంతిమంతమైనదగుట వలన యిస్రాయేలు ప్రజలు తమ నేత్రములను దానిపై నిలుపజాలకపోయిరి. మృత్యు కారకమైన ధర్మశాస్త్రమే అంత వైభవముతో అనుగ్రహింప బడినచో,

8. ఆత్మసంబంధమైన పరిచర్య మరెంత మహిమ కలిగియుండునో!

9. మానవులను శిక్షించిన సేవయే అంత మహిమ కలదైనచో మానవులను నీతిమంతులనుగ చేయుసేవ మరెంత అధిక మహిమ కలదైయుండును?

10. ఇప్పటి వైభవము, గతమున ఉన్నమహిమను అధిగమించినదని చెప్పగలము.

11. ఏలయన, కొలదికాలము మాత్రమే నిలిచిన దాని యందే మహిమ ఉన్నచో, సర్వదా నిలిచియుండు దాని యందు ఎంత అధికమైన మహిమ ఉండవలెను?

12. మాకు ఇట్టి నమ్మకము ఉన్నది కనుకనే మేము ఇంత ధైర్యముతో ఉన్నాము.

13. తన ముఖమునందలి తేజస్సు క్షీణించిపోవుటను యిస్రాయేలు ప్రజలు గమనింపకుండ మోషేవలె ముఖమును ముసుగుతో కప్పుకొనవలసిన అవసరము మాకు లేదు.

14. నిజమునకు వారి మనసులు కఠినములైనవి. పాతనిబంధనము పఠించునపుడు ఈనాటికిని వారి మనసులు ఆ ముసుగుతోనే కప్పబడి ఉన్నవి. ఏ వ్యక్తియైనను క్రీస్తుతో ఐక్యమును పొందినపుడు మాత్రమే ఆ ముసుగు తొలగింపబడును.

15. ఈనాడు కూడ వారు మోషే ధర్మశాస్త్రమును పరించునపుడు, ఆ ముసుగు వారి మనసులను కప్పి వేయును.

16. కాని ఒక వ్యక్తి ప్రభువు వంకకు తిరుగగనే ముసుగు తొలగింపబడును.

17. ఇప్పుడు ప్రభువే ఆత్మ. ఆ ప్రభువు ఆత్మ ఎచ్చట ఉండునో అచట స్వాతంత్ర్యము ఉండును.

18. కనుక మనము అందరమును ముసుగులు తొలగిన ముఖములతో ప్రభువు మహిమనే ప్రతిబింబించుచు న్నాము. అ మహిమయే ఆత్మయగు ప్రభువునుండి ప్రసరించుచు, అధికమగు మహిమతో, మనము అయనను పోలియుండునట్లు మార్చివేయును.