ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Corinthians chapter 2 in Telugu || Telugu catholic Bible || కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము

 1. కనుక, మీకు విచారము కలిగించుటకు మరల మీ వద్దకు రాకూడదని నేను నిశ్చయము చేసికొంటిని.

2. ఏలయన, నేను మీకు విచారము కలిగించినచో, ఇక నన్ను సంతోషపెట్టుటకు మిగులునది యెవరు? నేను విచారమున ముంచిన వ్యక్తులే గదా!

3. కనుకనే మీకు ఆ ఉత్తరమును వ్రాసిన పిదప మీ వద్దకు వచ్చు ఉద్దేశమును విడిచితిని. నన్ను సంతోషపెట్టవలసిన వ్యక్తులే నన్ను విచారమున ముంచుట నాకు ఇష్టము లేదు. ఏలయన, నా ఆనందమేమీ అందరి ఆనందమని నాకు గట్టి నమ్మకమున్నది.

4. ఎంతయో బాధపడి దుఃఖపూరితమగు హృదయముతోను, కన్నీటితోను, మీకు జాబు వ్రాసితిని. నేను వ్రాసినది మిమ్ము విచారపడునట్లు చేయుటకు కాదు. కాని, నేను మిమ్ము ఎంతగ ప్రేమించుచున్నానో అని మీరు గుర్తించుటకు మాత్రమే.

5. ఎవరైనను కొందరిని విచారగ్రస్తులను చేసినచో అతడు అటుల చేసినది నాకు కాదు, కొంత మట్టుకు మీకందరకు. నేను విశేషభారము వాని మీద మోపగోరక నా మాట చెప్పుచున్నాను.

6. మీలో చాల మందిచే ఆ వ్యక్తి ఈ విధముగ శిక్షింపబడుట చాలును.

7. కాని, ఇప్పుడు అట్టివ్యక్తి ఎక్కువగ దుఃఖింప కుండుటకై అతనిని క్షమించి ఓదార్చవలెను.

8. మీరు అతనితో మరల ప్రేమపూర్వకముగ వ్యవహరింపుడని నా మనవి.

9. మిమ్ము పరీక్షించి మీరు అన్నిటను విధేయత చూపుదురో లేదో తెలిసికొనుటకే నేను అటుల వ్రాసితిని.

10. మీరు క్షమించువానిని నేనును క్షమింతును. నేను ఏ దోషమునైనను క్షమించియున్నచో మీ కొరకే క్రీస్తు సమక్షమున అటుల చేసితిని.

11. అదియును సైతాను మనపై ఆధిక్యమును సంపాదింప కుండుటకే. సైతాను ప్రణాళికలు గూర్చి మనము అజ్ఞానులము కాదు కదా!

12. క్రీస్తును గూర్చిన సువార్తను బోధించుటకు నేను త్రోయను చేరినపుడు, ప్రభువు నా పనికి అప్పటికే అచ్చట మార్గము ఏర్పరచి ఉంచెనని కనుగొంటిని.

13. కాని, మన సోదరుడగు తీతును నేను అచ్చట కనుగొనకపోవుటచే చాల విచారించితిని. కనుక అచటి ప్రజలకు వీడ్కోలు పలికి మాసిడోనియాకు వెళ్ళితిని.

14. దేవునకు కృతజ్ఞతలు. ఏలయన, ఆయన మా ద్వారా ప్రతిస్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను వ్యాపింపజేయుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సాహముతో ముందుకు నడుపుచున్నాడు.

15. ఏలయన మేము, రక్షింపబడు వారికిని, నాశనమొందు వారికిని దేవునికర్పితమగు క్రీస్తుని సుగంధమై ఉన్నాము.

16. భ్రష్టులకు అది మృత్యుకారకమగు దుర్వాసన, రక్షింపబడువారికి అది జీవదాయకమగు సువాసన. కనుక, అట్టి కార్యమునకు సమర్థుడు ఎవడు?

17. మేము దేవుని సందేశమును అల్పవస్తువులతో సమానముగనెంచు అనేకుల వంటివారముకాదు. కాని, దేవుడు మమ్ము పంపియుండుటచే క్రీస్తు సేవకులుగ ఆయన సమక్షమున మేము హృదయపూర్వకముగ మాటలాడెదము.