2 Corinthians chapter 13 in Telugu || Telugu catholic Bible || కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ 13వ అధ్యాయము
1. నేను మిమ్ము చూడవచ్చుట ఇది మూడవ మారు. “ఏ దోషారోపణమైనను ఇద్దరు లేక ముగ్గురు సాక్షులచే బలపరుపబడవలెను” అని లేఖనము పలుకుచున్నది.
2. పాపము చేసిన వారిని, ఇతరులను గతములోనే హెచ్చరించియుంటిని. నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నను రెండవమారు మీ యొద్ద ఉన్నట్టుగానే వారిని తిరిగి హెచ్చరించుచున్నాను. అదేమనగా నేను తిరిగివచ్చినయెడల వారిపై ఎట్టి కనికరమును చూపించను.
3. క్రీస్తు నా ద్వారా మాటలాడుచున్నాడని మీకు కావలసియున్న ఆధారములు లభింపగలవు. మీతో వ్యవహరించినపుడు ఆయన బలహీనుడు కాడు. మీ మధ్య ఆయన శక్తిమంతుడై ఉన్నాడు.
4. ఏలయన, బలహీనస్థితిలో ఆయన సిలువపై చంపబడినను, దైవశక్తిచేత ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయనతో ఏకమగుటవలన మేమును బలహీనులమే. కాని మీ విషయమున, దైవశక్తిచే మేము ఆయనతో జీవింతుము.
5. మీరు ఆత్మపరీక్ష చేసికొనుడు. మీరు విశ్వాసము కలిగి జీవించుచున్నారా? క్రీస్తుయేసు మీ యందు ఉన్నాడని నిజముగ మీకు తెలియదా? మీరు పూర్తిగ దిగజారిపోయి ఉండిననే తప్ప ఎట్లు తెలియకుండగలదు?
6. కాని మేము విఫలురము కాలేదని మీరు గ్రహింపగలరని ఆశించుచున్నాము.
7. మీరు ఎట్టిదోషములు చేయకుండుటకై దేవుని ప్రార్ధింతుము. కాని మేము జయమును పొందితిమని ప్రదర్శించుటకు కాదు, మేము విఫలురముగ కనిపెట్టినను మీరు మాత్రము సత్కార్యములను చేయుటకై అట్లోనర్తుము.
8. ఏలయన, దేవుని సత్యమునకు విరుద్ధముగ మేము ఒక్క పనియు చేయజాలము. దానికి అనుకూలముగ మాత్రమే చేయగలము.
9. మేము బలహీనులముగ ఉన్నను, మీరు బలవంతులుగ ఉన్నప్పుడే మాకు అనందము. కనుక, మిరు సంపూర్ణులు కాగలుగుటకే మేము ప్రార్ధింతుము.
10. అందువలన దూరముగ ఉన్నప్పుడే మీకు ఈ జాబు వ్రాయుచున్నాను. అప్పుడు నేను అచ్చటకు వచ్చినచో దేవుడు నాకు ఇచ్చిన అధికారమును మీపై ఉపయోగించుటలో నేను కఠినముగా ఉండవలసిన అవసరము కలుగదు. ఆ అధికారము మీ నిర్మాణాత్మక కృషికేగాని, మీ నాశనమునకు కాదు గదా!
11. కనుక సోదరులారా సెలవు! సంపూర్ణు లగుటకు కృషిసలుపుడు. నేను చెప్పిన దానిని ఆల కింపుడు. పరస్పరము ఏకీభావము కలిగియుండుడు. సమాధానముతో జీవింపుడు. ప్రేమ సమాధానములను ఇచ్చు దేవుడు మీకు తోడగును.
12. పవిత్రమైన ముద్దుతో పరస్పరము శుభాకాంక్షలు తెలుపుకొనుడు.
13. దైవప్రజలందరు మీకు శుభాకాంక్షలను పంపుచున్నారు.
14. యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, దేవుని ప్రేమయు, పవిత్రాత్మ సహవాసమును మీకు అందరకును లభించునుగాక!