2 Corinthians chapter 11 in Telugu || Telugu catholic Bible || కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము
1. నా అవివేకమునుగూడ మీరు కొంతవరకు సహింపగలరనుకొందును. దయచూపి సహింపుడు!
2. మిమ్ము గూర్చి దేవునకు ఆసక్తియున్నది. నాకును ఆసక్తియున్నది. ఏలయన, మీరు ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు నాచే ప్రధానమొనర్పబడిన నిష్కళంకయగు కన్య వంటివారు.
3. కనుకనే మీ హృదయములు కలుషితములై, క్రీస్తునందు మీకు ఉన్న స్వచ్చమైన విశ్వాసమును త్యజింతురేమో అని నాకు భయమగు చున్నది. ఎట్లన, ఏవ సర్పము యొక్క టక్కరి పలుకులకు లోనయ్యెనుగదా!
4. ఎవరైనను మీవద్ద చేరి, మేము బోధించిన యేసునుకాక, వేరొక యేసును బోధించినను మీరు సంతోషముతో సహింతురు. అంతేకాక మా నుండి మీరు పొందిన ఆత్మకును, సందేశమునకును విరుద్ధమైన వేరొక ఆత్మను, సందేశమును కూడ మీరు అంగీకరింతురు!
5. మీరు విశిష్టమైన అపోస్తలులుగ ఎంచువారికి నేను ఏ మాత్రము తీసిపోనని నా నమ్మకము.
6. నేను వక్తగా ప్రౌడను కాకపోవచ్చును. కాని జ్ఞానమందు మాత్రము తీసిపోనివాడను. అన్ని విషయముల యందును అన్ని విధముల మేము దీనిని మీకు స్పష్టము చేసియున్నాము.
7. దేవుని సందేశమును నేను మీకు బోధించి నపుడు ప్రతిఫలము ఏమియును కోరలేదు గదా! అంతేకాక, మిమ్ము గొప్పవారిని చేయుటకు నేను వినమ్రుడనైతిని. అట్లు చేయుట తప్పా?
8. మీ వద్ద నేను పనిచేయుచున్నపుడు ఇతర క్రీస్తు సంఘములు నన్ను పోషించినవికదా! అనగా మీకు సాయమొనర్చుటకు వారి వద్ద దొంగిలించితిని అనుటయే కదా!
9. అంతేగాక నేను మీతో ఉన్న సమయమున నాకు ధనసహాయము అవసరమైనపుడు మిమ్ము బాధింప లేదు. ఏలయన, మాసిడోనియా నుండి వచ్చిన సోదరులే నాకు అవసరమైనవి అన్నియు తెచ్చిరి. పూర్వము ఎట్లో ముందు కూడా అట్లే. నేను మీకు దేనికిని భారముగా ఉండను.
10. నాలో ఉన్న క్రీస్తు సత్యముపై నేను ఇట్లు వాగ్దానము చేయుచున్నాను. ఈ నా ఘనతను అకయా ప్రాంతములలో ఎవరును ఆపలేరు.
11. నేను ఏల ఇట్లు చెప్పుచున్నాను? మీపై ప్రేమ లేకపోవుటచేతనా? కాదు, నా ప్రేమ సత్యమని దేవునకు ఎరుక.
12. మావలెనే తామును కృషి సలుపుచున్నామని ఆత్మస్తుతి చేసికొనుటకు ఆ ఇతర 'అపోస్తలుల'కు ఎట్టి అవకాశము ఒసగకుండుటకై నేను చేయుచున్న పనిని ఇక ముందు కూడ కొనసాగించెదను.
13. ఆ వ్యక్తులు అసత్య అపోస్తలులు. వారు మోసపూరిత అపోస్తలులు. వారు తమ పనిని గూర్చి అసత్యము లాడుదురు. క్రీస్తు యొక్క నిజమైన అపోస్తలులవలె అగుపడుటకు వేషము మార్చుకొందురు.
14. ఇందులో ఆశ్చర్యము ఏమియును లేదు! సైతాను కూడ వెలుగు దేవదూతవలె అగుపడునట్లు తనను తాను మార్చుకొనగలడు!
15. కనుక, వాని సేవకులు కూడ నీతియొక్క సేవకులవలె గోచరించునట్లు తమ్ము తాము మార్పు చేసికొని నటించినచో ఆశ్చర్యము లేదు. వారి కృత్యములను బట్టియే వారి అంతము ఉండును.
16. నన్ను అవివేకిగా ఎవరును తలంపరాదని మరల చెప్పుచున్నాను. ఒకవేళ మీరు అటుల తలచి నను అవివేకిగానైనను సరే నన్ను స్వీకరింపుడు. ఏలయన, అప్పుడు ఆత్మస్తుతి చేసికొనుటకు కొలది అవకాశము నాకు లభించును.
17. నేను ఇప్పుడు చెప్పు చున్నది ప్రభువు చెప్పుమనినందున నేను చెప్పుటలేదు. ఈ ఆత్మస్తుతి విషయమున నిజముగనే నేను అవివేకి వలె మాట్లాడుచున్నాను.
18. కాని కేవలము లౌకిక కారణముల చేతనే తమను తాము పొగడుకొనువారు పెక్కుమంది ఉండుటచే, నేనును అట్లే చేయుదును.
19. మీరు స్వయముగ వివేకము గలవారు కనుకనే అవివేకులను కూడ మీరు సహింతురు.
20. మీపై ఎవరైన అధికారము చలాయించినను, మిమ్ము మోసము చేసినను, మిమ్ము చిక్కులలో ఇరికించినను, మిమ్ము అల్పులుగా చూచినను, చెంపదెబ్బ కొట్టినను, అట్టి వానిని మీరు సహింతురు.
21. దీనిని గూర్చి నాకు సిగ్గగుచున్నది. కాని మేము అటుల చేయ సాహసింపలేదు. నేను మరల అవివేకపు పలుకులు పలుకుచున్నానేమో! కాని ఎవడైనను దేనిని గూర్చియైనను పొగడుకొను ధైర్యముగలవాడైనచో నేనును అంత ధైర్యము గలవాడనగుదును.
22. వారు హెబ్రీయులా? నేనును అట్టివాడనే. వారు యిస్రాయేలీయులా? నేనును అట్టివాడనే. వారు అబ్రహాము సంతతివారా? నేనును అట్టివాడనే.
23. వారు క్రీస్తు సేవకులా? నేను పిచ్చివానివలె మాట్లాడినను నేను వారికంటె అధికుడనగు సేవకుడను. నేను వారికంటె ఎక్కువగా కష్టపడి పని చేసితిని. వారికంటె ఎక్కువ మారులు నేను చెరయందుంటిని. ఎక్కువ మారులు కొరడాదెబ్బలు తింటిని. ఎక్కువ మారులు మృత్యుముఖమున ఉంటిని.
24. ఐదు మారులు యూదుల వలన ముప్పది తొమ్మిది కొరడాదెబ్బలు అనుభవించితిని.
25. మూడు మారులు బెత్తములతో దెబ్బలుతింటిని. ఒకమారు రాళ్ళతో కొట్టబడితిని. మూడుమారులు ఓడ పగిలిన ప్రమాదములలో చిక్కుకొనియుంటిని. ఒకమారు రాత్రియు పగలును నీటిలో గడిపితిని.
26. పెక్కు ప్రయాణములలో నేను వరద బాధలకును, దొంగలవలన ఆపదలకును, తోడియూదులును, అన్యులును కలిగించిన అపాయములకును గురియైతిని. నగరములలోని ఆపదలకును, అడవులలోని ఆపదలకును, సముద్రముల మీది ఆపదలకును, ఇంకను కపట స్నేహితులవలన ఆపదలకును లోనైతిని.
27. అంతయు పని, శ్రమ. తరచుగ నాకు నిద్ర ఉండెడిది కాదు. పెక్కు మారులు తిండి, గుడ్డ, తలదాచుకొను చోటు లభింపకుండెడివి.
28. మిగిలినవాని మాట అటుండ, సకల దైవసంఘములను గూర్చిన వేదన నాకు ఎక్కువగ ఉన్నది.
29. ఎవడైన బలహీను డైనచో నాకును బలహీనముగ ఉన్నట్లు అనిపించును. ఎవడైన పాపమునకు లోనైనచో, నా హృదయము విచారముతో నిండిపోవును.
30. ఒకవేళ నేనును పొగడుకొనవలసినచో, నేను ఎంత బలహీనుడనో ప్రదర్శించు విషయములను గూర్చి పొగడుకొందును.
31. యేసుప్రభువునకు తండ్రియగు దేవునకు నేను అసత్యమాడుటలేదని తెలియును. దైవనామము సర్వదా స్తుతి పొందును గాక!
32. నేను దమస్కు నగరమున ఉన్నప్పుడు అరెతరాజు యొక్క మండలాధిపతి నన్ను బంధించుటకు నగరము చుట్టును కాపుంచెను.
33. కాని, నేను గోడలకుగల కిటికీగుండా ఒక గంపలో దింపబడి, వానినుండి తప్పించుకొంటిని.