ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Corinthians chapter 10 in Telugu || Telugu catholic Bible || కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ 10వ అధ్యాయము

 1. పౌలునగు నేను మీకు ఒక విన్నపము చేయుచున్నాను. మీతో ఉన్నప్పుడు సాధువుననియు, సాత్వికుడననియు, మీకు దూరముగ ఉన్నపుడు ధైర్యశాలిననియు నన్ను గూర్చి చెప్పుచుందురు గదా! కనుక, క్రీస్తు సాత్వికముతోను, మృదుత్వముతోను మిమ్ము ఇట్లు వేడుకొనుచున్నాను.

2. నేను అచటకు వచ్చినపుడు మీతో కఠినముగ ఉండునటుల చేయకుడు. లౌకికమగు తలంపులతో మేము ప్రవర్తించుచున్నామని సందేహించు వారితో నేను కఠినముగ ప్రవర్తింపగలననునది నాకు నిశ్చయమే.

3. మేమును ఈ ప్రపంచమున నివసించుచున్నామను మాట నిజమే. కాని మేము ప్రాపంచికమగు తలంపులతో పోరాటమును సలుపుట లేదు.

4. మా పోరాటములో మేము ఉపయోగించు సాధనములు ప్రాపంచికములు కావు. అవి దుర్గములను కూడ ధ్వంసమొనర్చగల శక్తిమంతమగు దేవుని ఆయుధములు. అసత్య వాదములను మేము నాశనము చేయుదుము.

5. మేము వితండవాదములను, దైవజ్ఞానమునకు అడ్డు నిలుచు ప్రతి ఆటంకమును త్రోసివేయుదుము. ఆలోచనలను బంధించి క్రీస్తునకు విధేయములుగ చేయుదుము.

6. మీరు మీ సంపూర్ణ విధేయతను నిరూపించిన తరువాత, ఎట్టి అవిధేయతతో కూడిన పనినైనను శిక్షింప సిద్ధమగుదుము.

7. మీ కన్నుల ఎదుట ఉన్నదానిని చూడుడు. ఎవడైనను తాను క్రీస్తునకు చెందినవాడనని చెప్పు కొనినచో, తనవలె మేమును ఆ క్రీస్తునకు చెందిన వారమని ఎరుగవలెను.

8. ప్రభువు మాకు ప్రసాదించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ గొప్పగా చెప్పుకొనినను, దాని కొరకు సిగ్గుపడుటలేదు. ఆ అధికారము మీ ప్రసిద్ది కొరకే కాని, మిమ్ము నాశనము చేయుటకు కాదు.

9. నా లేఖలతో మిమ్ము భయపెట్టుటకు ప్రయత్నించుటలేదు.

10. 'పౌలు జాబులు తీవ్రముగను, కఠినముగను ఉండును. కాని, తానే స్వయముగా మనతో ఉన్నపుడు అతడు బలహీనుడు. అతని మాటలు ఎందులకును కొరగావు!” అని ఎవడైన పలుకవచ్చును.

11. దూరమున ఉన్నప్పుడు మేము ఏమి వ్రాయుదుమో దగ్గర ఉన్నప్పుడు అదియే చేయుదుమని అట్టివాడు గ్రహింపవలెను.

12. నిజమునకు తమను గూర్చి అంత గొప్పగ నెంచుకొను వ్యక్తులతో మమ్ము జతపరచుకొనుటకు గాని, పోల్చుకొనుటకుగాని మేము సాహసింపము. వారు ఎంత అవివేకులు! తమను ఎంచుకొనుటకు వారు స్వకీయ ప్రమాణములను ఏర్పరచుకొందురు. అట్టి ప్రమాణములతోనే తమను పోల్చుకొందురు.

13. మేము మాత్రము పరిమితి మించి పొగడుకొనము. దేవుడు మాకు నిర్ణయించిన పని పరిమితిలోనే అది నిలిచిపోవును. మేము మీ మధ్య చేయుపనియు అందులోనిదే.

14. మీరు ఆ పరిమితిలోనివారే అగుటచే, క్రీస్తును గూర్చిన సువార్తతో మేము అటకు వచ్చినపుడు మేము ఆ పరిమితులను అతిక్రమింపలేదు.

15. దేవుడు మాకు నిర్ణయించిన పరిమితులను దాటి ఇతరులు చేసిన పనులను గూర్చి మేము గొప్పలు చెప్పము. అంతేకాక, మీ విశ్వాసము వర్ధిల్లి, మీ మధ్య మేము పనిచేయవలసిన క్షేత్రము పెరగగలదని ఆశించుచున్నాము. ఎట్లయినను సర్వదా మా కార్యములు అన్నియు దేవుడు విధించిన పరిమితుల లోపలనే ఉండును.

16. అప్పుడే మిమ్ము దాటి దేశాంతరములందు సహితము ఈ సువార్తను బోధింప గలుగుదుము. అందువలన అన్యుల పరిధిలో పూర్వమే సాధింపబడిన పనిని గూర్చి మేము పొగడుకొనవలసిన అవసరము ఉండదు.

17. కాని లేఖనము చెప్పుచున్నట్లు, “గొప్పలు చెప్పుకొనదలచినవాడు ప్రభువునందే గొప్పలు చెప్పుకొనవలెను”

18. దేవుడు అతనిని ఆమోదించిననాడే ఏ వ్యక్తియైనను నిజముగ ఆమోదింపబడినవాడు అగును. కాని, తనను గూర్చి తాను గొప్పగ తలంచినంత మాత్రమున ఆమోదమును పొందడుగదా!