ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1st timothy Chapter 6 || Telugu Catholic Bible || తిమోతికి వ్రాసిన 1వ లేఖ 6వ అధ్యాయము

 1. ఎవరుకాని దేవుని నామమును గూర్చియు, మన బోధనగూర్చియు దూషింపకుండునట్లు బానిసలు తమ యజమానుల పట్ల సకల గౌరవములను చూపవలెను.

2. యజమానులు విశ్వాసులైనచో, వారు తమ సోదరులేనని, బానిసలు వారిని నిర్లక్ష్యము చేయరాదు. అంతేకాక తమ సేవ మూలముగ లాభమును పొందు విశ్వాసులు కూడ తమ ప్రియసోదరులు కనుక వారిని మరింత అధికముగ సేవింపవలెను. ఈ విషయములను నీవు తప్పక బోధించుచు, హెచ్చరింపవలెను.

3. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క యథార్థములగు పలుకులను, దైవభక్తికి అను కూలమగు బోధనలను అంగీకరింపక వానికి విరుద్దమగు సిద్ధాంతమును బోధించు ఏ వ్యక్తియైనను,

4. జ్ఞానశూన్యుడు, పొగరుబోతు. అట్టివానికి వాగ్వివాదములయందును, వాగ్యుద్దములయందును అభి లాషమెండు. వీని మూలముగ అసూయలు, కలహములు, దూషణలు, దుష్ట సందేహములు,

5. సత్య దూరులు బుద్దిహీనులును అగువారితో వాగ్వివాదములు కలుగుచున్నవి. ధనవంతులగుటకు దైవభక్తి ఒక మార్గమని వారు అనుకొందురు.

6. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది.

7. మనము ఈ లోకములోనికి వచ్చునపుడు ఏమియు వెంట తీసుకొనిరాలేదు. మనము ఈ లోకమునుండి నిష్క్రమించునపుడు ఏమియును వెంట తీసికొనిపోజాలము.

8. కనుక, మనకు అన్న వస్త్రములు లభించినచో సంతృప్తి పొందుదుము.

9. కాని ధనకాంక్ష కలవారు శోధనకులోనై, మానవులను శిథిలముచేసి నశింపజేయు అపాయకరమును, మూర్బములును అగువాంఛల వలయందు చిక్కు కొందురు.

10. ధనకాంక్ష సర్వ అనర్ధములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసమునుండి తొలగిపోయి అనేక బాధలతో తమనుతామే పొడుచుకొనిరి.

11. కాని దైవజనుడవగు నీవు వీనికి దూరముగ ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అనువాని కొరకు నీవు యత్నింపుము.

12. విశ్వాససంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్యజీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము ఒనర్చినపుడు, దేవుడునిన్ను ఈ జీవనమునకే పిలిచెను.

13. సమస్త వస్తుజాలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను, పొంతి పిలాతు సముఖమున సత్యమునకు సాక్ష్య మిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను, నేను నిన్ను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను.

14. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చువరకు, ఈ కట్టడను నిష్కళంకముగను, నిందలేని వాడవుగను పాటింపుము.

15. శ్రీమంతుడును, ఏకైక పరిపాలకుడును, రాజాధిరాజును, ప్రభువులకు ప్రభువును అగు దేవునిచే యుక్తకాలమున ఆయన దర్శ నము సంభవమగును.

16. ఆయన ఒక్కడే అమరుడు. ఎవరును చేరరాని దైవతేజమున ఆయన నివసించును. ఎవరును, ఎన్నడును ఆయనను చూడలేదు. ఆయనకు ఘనతయు, శాశ్వత ఆధిపత్యమును కలుగునుగాక!

17. ఇహమందు ధనవంతులైనవారు గర్విష్ఠు లుగా ఉండక, అస్థిరములగు సంపదలయందు నమ్మక ముంచక, మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతయు దయచేయు దేవుని యందే నమ్మకముంచవలెనని బుద్ధిచెప్పుము.

18. మంచిని మాత్రమే చేయువారుగను, సత్కార్యములలో ధనవంతులుగను, ఉదారబుద్ధి కలవారుగను, ధర్మము చేయువారుగను ఉండవలెనని వారిని ఆజ్ఞాపింపుము.

19. నిజమైన జీవమును సంపాదించుకొనుటకై రాబోవు కాలమునకు దృఢమైన పునాది కాగల ధన మును వారు ఈ విధముగా కూడబెట్టుకొనగలరు.

20. తిమోతీ! నీకు అప్పజెప్పబడిన దానిని భద్రముగ కాపాడుము. నాస్తిక సంభాషణలకును, కొందరు అవివేకముచే “ఙ్ఞానము”గ నెంచు మూర్ఖపు వివాదములకును దూరముగ ఉండుము.

21. కొందరు, అట్టి “జ్ఞానము”ను కలిగి ఉన్నామని చెప్పుకొని, తత్ఫలితముగ విశ్వాస మార్గమును కోల్పోయిరి. దేవుని కృప నీతో ఉండునుగాక!