ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1st timothy Chapter 3 || Telugu Catholic Bible || తిమోతికి వ్రాసిన 1వ లేఖ 3వ అధ్యాయము

 1. ఎవడైనను సంఘాధిపత్యమును ఆశించిన యెడల అతడు ఉత్తమకార్యమును కోరుచున్నాడనుట యథార్థము.

2. దైవసంఘపు అధిపతి దోషరహితుడును, ఒకే భార్య కలవాడును, విజ్ఞత కలవాడును, ఇంద్రియ నిగ్రహము, క్రమశిక్షణను కలవాడునై ఉండవలెను, అతిథులను ఆదరింపవలెను, ఉత్తమబోధకుడై ఉండవలెను.

3. అతడు త్రాగుబోతు కాని, దుర్జనుడు కాని కాక, సాత్త్వికుడును, జగడమాడనివాడునై ఉండవలెను. అతడు ధనాపేక్ష కలిగి ఉండరాదు.

4. తన కుటుంబమును చక్కగా నిర్వహించుకొనుచు తన సంతానము తనకు విధేయులై, అన్నింట గౌరవ మర్యాదలు పాటించునట్లు చూచుకొనవలెను.

5. తన కుటుంబమునే సరిదిద్దలేని వ్యక్తి, దైవసంఘమును ఎట్లు సరిదిద్దగలడు?

6. అతడు క్రొత్తగా క్రైస్తవుడైన వ్యక్తి కారాదు. లేనిచో అతడు గర్వముచే ఉబ్బిపోయి సైతానువలె శిక్షింపబడును.

7. అతడు నిందలపాలై సైతాను వలయందు చిక్కుకొనకుండునట్లు క్రీస్తు సంఘమునకు చెందనివారి మధ్యలోకూడ మంచి పేరు కలవాడై ఉండవలెను.

8. అట్లే సంఘపరిచారకులును మంచి నడవడిక గలవారై, రెండు నాలుకలు గలవారు కాక కపటము లేనివారు కావలెను. త్రాగుబోతులు కాని అత్యాశ కలవారు. కాని కారాదు.

9. నిర్మలమైన అంతఃకరణముతో విశ్వాస పరమరహస్యమును అంటిపెట్టుకొని ఉండవలెను.

10. మొదట వారు పరీక్షింపబడవలెను. దోషరహితులైనయెడల వారు పరిచారకులుగా నియ మింపబడవచ్చును.

11. అటులనే పరిచర్యచేయు స్త్రీలును సత్ప్రవర్తన కలవారై, కొండెములను చెప్పనివారై ఉండ వలెను. వారు ప్రతివిషయమునను అణకువ కలవారై నమ్మకమైనవారుగ ఉండవలెను.

12. పరిచారకుడు ఒకే భార్యను కలిగి ఉండి, తన సంతానమును, కుటుంబమును చక్కదిద్దుకొనగలిగి ఉండవలెను.

13. అటుల తమ విధులను సక్రమముగా నెరవేర్చువారు మంచి పదవిని సంపాదించుకొని, క్రీస్తు యేసునందలి విశ్వాసమునందు బహుధైర్యము కలవారగుదురు.

14. నేను ఈ ఉత్తరమును వ్రాయుచు, నిన్ను త్వరలో వచ్చి చేరగలనని ఆశించుచున్నాను.

15. కాని ఒక వేళ నేను ఆలస్యము చేసినచో దేవుని గృహ మున మనము ఎట్లు ప్రవర్తింపవలెనో నీకు ఈ ఉత్త రము తెలియజేయును. సత్యమునకు మూలస్తంభమును, పునాదియునగు సజీవదేవుని శ్రీసభయే ఈ గృహము.

16. మన మతముయొక్క ఈ పరమ రహ స్యము ఎంతయో గొప్పదనుటకు సందేహములేదు: ఆయన మానవరూపమున ప్రత్యక్షమై, ఆత్మచే నిర్దోషిగా ప్రదర్శింపబడి, దేవదూతలచే చూడబడెను. ఆయన అన్యజాతులలో ప్రకటింపబడి, ప్రపంచములో విశ్వసింపబడి, మహిమతో పైకి కొనిపోబడెను.