ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1st timothy Chapter 2 || Telugu Catholic Bible || తిమోతికి వ్రాసిన 1వ లేఖ 2వ అధ్యాయము

 1. కనుక అన్నిటికంటె ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములును, ప్రార్థనలును, మనవులును, కృతజ్ఞతలును అర్పింపవలెనని విన్నవించుచున్నాను.

2. మనము సత్ప్రవర్తనతోను, సంపూర్ణమగు దైవభక్తితోను, ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్ధనలు సలుపవలెను.

3. అది ఉత్తమమును మన రక్షకుడగు దేవునికి ఆమోదయోగ్యమును అయినది.

4. మానవులు అందరు రక్షింపబడవలయుననియు, సత్యమును తెలిసికొనవలయుననియు దేవుని అభిలాష

5. దేవుడు ఒక్కడే, దేవుని, మనుజులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు.

6. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరు రక్షింపబడవలెననెడి దేవుని కోరిక తగినసమయమున నిదర్శనమాయెను.

7. అందువలననే దీనికి నేను ప్రచారకునిగాను, అపోస్తలునిగాను, అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకునిగాను నియమింపబడితిని. నేను అసత్యమాడుటలేదు. యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను.

8. ఎల్లెడల పురుషులు క్రోథముగాని, తర్కము గాని లేకుండ చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలెనని నేను కోరుచున్నాను.

9. స్త్రీలు తమ దుస్తుల విషయమున వివేకముతో మర్యాదస్థులుగా మెలగవలెనని, సక్రమముగా దుస్తులు ధరింపవలెనని నా వాంఛ. వారు చిత్ర విచిత్రములగు జడలను, బంగారు ఆభరణములను, ముత్యములను, మిగుల విలువైన వస్త్రములను ధరింపక

10. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లు సత్కార్య ముల చేత తమను తాము అలంకరించుకొనవలెను.

11. స్త్రీలు మౌనమును పాటించుచు సంపూర్ణ విధేయతతో బోధననను ఆలింపవలెను.

12. స్త్రీలు బోధనచేయుటగాని, పురుషులపై అధికారము కలిగియుండుట కాని నేను అనుమతింపను. వారు మౌనముగ ఉండవలెను,

13. ఏవ కంటె ముందుగ ఆదాము సృష్టింపబడెను గదా!

14. అంతేకాక మోసగింప బడినది ఆదాము కాదు. ఆ స్త్రీ యే మోసగింపబడి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినది.

15. కాని అణకువతో విశ్వాసము, ప్రేమ, పవిత్రతయను వానియందు సుస్థిర బుద్ధితో ఉన్నచో స్త్రీలు బిడ్డలను కనెడి ధర్మము వలన రక్షింపబడుదురు.