ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1st timothy Chapter 1 || Telugu Catholic Bible || తిమోతికి వ్రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము

 1. మన రక్షకుడగు దేవునియొక్కయు, మన నమ్మికయగు క్రీస్తుయేసు యొక్కయు ఆజ్ఞచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు,

2. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి, పితయగు దేవునినుండియు, మన ప్రభువగు క్రీస్తు యేసునుండియు, నీకు కృప, కనికరము, సమాధానము.

3. మాసిడోనియాకు వెళ్ళబోవుచు నేను నిన్ను కోరిన విధముగ, నీవు ఎఫెసునందే నిలిచియుండుము. అచట కొంతమంది అసత్య బోధనలను చేయుచున్నారు. వారు మానివేయునట్లు నీవు ఆజ్ఞాపింపవలెను.

4. ఆ కట్టుకథలను, అంతులేని వంశావళులను వదలి వేయవలెనని వారికి బోధింపుము. అవి వాగ్వివాదములను మాత్రమే కలిగించును గాని, దేవుని ప్రణాళికను తెలియజేయవు. ఆ ప్రణాళిక విశ్వాసము వలన తెలియదగును.

5. ప్రజలయందు ప్రేమను రూపొందించు టకే నేను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. ఆ ప్రేమ నిర్మలమగు హృదయము నుండియు, స్వచ్చమగు మనస్సాక్షి నుండియు, యథార్థమగు విశ్వాసమునుండియు ఉద్భవింపవలెను.

6. కొందరు వీనినుండి విముఖులై వితండవాదములలో పడి తమ త్రోవను కోల్పోయిరి.

7. తాము దేవుని చట్టమును బోధించువారలమని వారు చెప్పుకొందురేగాని, వారు మాట్లాడునది, రూఢిగా పలుకునది వారికే బోధపడదు.

8. ధర్మశాస్త్రము తగిన పద్ధతిలో వినియోగింప బడినచో అది ఉత్తమమైనదే.

9. కాని, ధర్మశాస్త్రము సత్పురుషులకొరకు కాక చట్టము నతిక్రమించువారి కొరకును, అవిధేయులకొరకును, భక్తిహీనులకొరకును, పాపాత్ముల కొరకును, అపవిత్రుల కొరకును, మత దూషకుల కొరకును, పితృహంతల కొరకును, మాతృ హంతల కొరకును, నరహంతల కొరకును

10. వివాహేతర లైంగిక సంబంధాలు గలవారలకును, పురుష సంపర్కులకును, మనుష్యభోరులకును, అబద్దీకులకును, అప్రమాణికులకును, సత్యబోధ వ్యతిరేకులకును, అవినీతిపరుల కొరకును రూపొందింపబడినది.

11. ఈ సత్యబోధ, పావనుడు మహిమగల దేవుడు నాకు అప్ప జెప్పిన దివ్యమైన సువార్తకు అనుగుణముగా ఉన్నది.

12. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైనవానిని కావించినందుకు, నాకు కృషి చేయుటకు శక్తినొసగిన మన ప్రభువగు క్రీస్తుయేసుకు నేను కృతజ్ఞతలను అర్పించుకొనుచున్నాను.

13. పూర్వము నేను ఆయనను దూషించియున్నను, ఆయనను హింసించి అవమానించినను, అది తెలియక అవిశ్వాసమువలన చేసితిని కనుక దేవుని దయ నాకు లభించెను.

14. క్రీస్తు యేసుతో ఐక్యము అగుటవలన మనకు కలుగు ప్రేమ విశ్వాసములను నాకు అనుగ్రహించి మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగ కురియజేసెను.

15. అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలివచ్చెను. ఇది నమ్మదగినదియు, సంపూర్ణ అంగీకార యోగ్యమైనదియునైన వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను.

16. అందువలననే, క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనమును, కనికరమును చూపెను. ఇకముందు నిత్యజీవము పొందుటకై ఆయనను విశ్వసింపవలసిన వారందరికిని నేను ఆదర్శప్రాయుడనుగా ఉండుటకే ప్రధాన పాపినైన నాయందు ఆయన ఇట్లు చేసెను.

17. అమరుడును, అగోచరుడును, నిత్యుడును, రాజునగు ఏకైక దేవునకు కలకాలము గౌరవము, మహిమకలుగును గాక! ఆమెన్.

18. తిమోతీ! నా కుమారా! పూర్వము నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనములవలన ఉత్తేజితుడవై నడచుకొనుచు నీవు మంచి పోరాటమును పోరాడగలవన్న ఉద్దేశముతో నేను నీకు ఈ హితవులను అందించుచున్నాను.

19. నీ విశ్వాసమును, నిర్మలమగు అంతఃకరణమును, కాపాడుకొనుము. కొందరు తమ అంతఃకరణమును లక్ష్యపెట్టక ఓడబద్దలైపోయిన వారివలె తమ విశ్వాసమును నాశనము చేసికొనిరి.

20. హుమెనేయు, అలెగ్జాండరులు వారిలోని వారే. దేవుని దూషింపకుండుట వారు నేర్చుకొనుటకై వారిని సైతానునకు అప్పగించితిని.