ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1st Thessalonians Chapter 1 || Roman catholic Bible in Telugu || తెస్సలొనీక ప్రజలకు వ్రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము

 1. తండ్రియగు దేవునియందును, ప్రభువగు యేసు క్రీస్తునందును, తెస్సలోనిక దైవసంఘ ప్రజలకు పౌలు, సిలాసు, తిమోతిలు వ్రాయునది: మీకు కృపయు, శాంతియు కలుగునుగాక!

2. మీ అందరి కొరకును మేము సదా దేవునకు కృతజ్ఞతలు సమర్పింతుము. మా ప్రార్థనలలో ఎల్లప్పు డును మిమ్ము పేర్కొందుము.

3. మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినదియు, మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి ఒనర్చునట్లు చేసినదియు, మన యేసుక్రీస్తు ప్రభువునందలి మీ నిరీక్షణ ఎంత దృఢమైనదియు, మన దేవుడును, తండ్రియును అగు వానిఎదుట మేము స్మరింతుము.

4. సోదరులారా! దేవుడు మిమ్ము ప్రేమించి, మిమ్ము తన వారిగ ఎన్నుకొనియున్నాడని మాకు తెలియును.

5. ఏలయన, కేవలము మాటలచే మాత్రమేకాక, శక్తితోను, పవిత్రాత్మతోను, దాని సత్యము నందలి సంపూర్ణమగు నమ్మకముతోను మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే గదా!

6. మమ్మును, ప్రభువును మీరు అనుకరించిన వారైతిరి. మీరు అనేక బాధలు పడినను, పవిత్రాత్మవలన లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి.

7. అందువలననే మాసిడోనియా, అకయాలలోని విశ్వాసులందరకును మీరు మార్గదర్శకులైతిరి.

8. ఏలయన, ప్రభువు వాక్కు మీ ద్వారా మాసిడోనియా, అకయాలలో ప్రతి ధ్వనించుట మాత్రమే కాక, దేవునియందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానము ప్రతి ప్రాంతమందును వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసినది ఏమియు లేదు.

9. మేము మిమ్ము చూడవచ్చినపుడు మీరు మమ్ము ఎట్లు ఆహ్వానించినదియు, సత్య సజీవదేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలినదియు వారు చెప్పుచున్నారు.

10. దేవునిచే మృత్యువునుండి లేవనెత్త బడినవాడును, రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహమునుండి మనలను రక్షించువాడును ఆయన కుమారుడును అగు యేసు క్రీస్తు పరలోకమునుండి వచ్చువరకు మీరు వేచియున్నారని వారు చెప్పుచున్నారు.