ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1st Peter chapter 5 || Telugu Catholic Bible || పేతురు వ్రాసిన 1వ లేఖ 5వ అధ్యాయము

 1. తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగమొనర్పబడనున్న మహిమలో నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించున దేమన:

2. మీ అధీనమందున్న దేవుని మందకు కాపరులుకండు. అయిష్టముతోకాక, దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగ దానిని కాపాడుడు. దుర్లభమైన అపేక్షతో కాక మనఃపూర్వకముగ దానిని కాయుడు.

3. మీ అధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృకగా ఉండుడు.

4. ప్రధానకాపరి ప్రత్యక్షమైనపుడు, మీరు ఎన్నటికిని క్షిణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు.

5. యువకులారా! మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరును వినయము  అను వస్త్రమును ధరింపవలెను. ఏలయన, “దేవుడు అహంకారులను ఎదిరించి, వినయశీలురను కటాక్షించును.”

6. శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులుకండు. యుక్తసమయమున ఆయన మిమ్ము ఉద్దరించును.

7.ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నియు ఆయనపై మోపుడు.

8. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువగు సైతాను గర్జించు సింహమువలె తిరుగుచు ఎవరినేని కబళింప చూచుచున్నాడు.

9. దృఢవిశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగ ఉన్న మీ తోటి విశ్వాసులును ఇట్టి బాధలనే అనుభవించు చున్నారని మీకు తెలియును గదా!

10. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగ క్రీస్తుతో ఐక్యమునొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధలనొందిన తరువాత ఆయనయే స్వయముగ మిమ్ము తీర్చిదిద్దును. మీకు పటిష్ఠతను, బలమును అనుగ్రహించును.

11. ఆయనకు సర్వదా ప్రభావము కలుగును గాక! ఆమెన్.

12. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిగ ఎంచు సిల్వాను సాయమున ఈ చిన్న ఉత్తరమును వ్రాయు చున్నాను. మిమ్ము ప్రోత్సహింపవలెననియు, ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్య మొసగ వలెననియు మాత్రమే నా అభిమతము. దానియందు మీరు దృఢముగ నిలిచి ఉండుడు.

13. మీవలె ఎన్నుకొనబడిన బబులోనియాలోని దైవసంఘము కూడ మీకు శుభాకాంక్షలను అందించుచున్నది. అటులనే నా కుమారుడు మార్కు కూడ.

14. క్రీస్తు ప్రేమపూరితమగు ముద్దుతో ఒకరికి ఒకరు శుభములు ఆకాంక్షింపుడు. క్రీస్తునందున్న మీకు అందరకు సమాధానము కలుగును గాక!