ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1st Peter chapter 3 || Telugu Catholic Bible || పేతురు వ్రాసిన 1వ లేఖ 3వ అధ్యాయము

 1. భార్యలారా! మీరును అట్లే మీ భర్తలకు విధేయులై ఉండవలెను. అపుడు వారిలో ఎవరైన దేవుని వాక్కును విశ్వసింపనివారు ఉన్నచో మీరు ఒక్క మాటయైన పలుకవలసిన అవసరము లేకయే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు.

2. ఏలయన, భయభక్తులతోను, పరిశుద్ధతతోను కూడిన మీ ప్రవర్తనను వారు గమనింపగలరు.

3. శిరోజములను అలంకరించుకొనుట, ఆభరణములను ధరించుట, దుస్తులు వేసికొనుట అను బాహ్య సౌందర్యము కాక,

4. మీ సౌందర్యము ఆంతరంగికమైనదై ఉండవలెను. అది సౌమ్యమును, సాధువును అగుఅక్షయ ఆత్మ సౌందర్యము. అదియే దేవుని దృష్టిలో అమూల్యమైనది.

5. ఏలయన, భక్తురాండ్రగు పూర్వకాలపు స్త్రీలు దేవుని నమ్ముకొని ఈ విధముగా తమ సౌందర్య మును పోషించుకొనుచు, తమ భర్తలకు విధేయురాండ్రై ఉండిరి.

6. సారా అట్టిదే. ఆమె అబ్రహామునకు విధేయురాలై అతనిని తనకు యజమానునిగ సంబోధించినది. మీరును సత్కార్యములొనర్చు వారై దేనికిని బెదరనివారైనచో ఆమెకు బిడ్డలగుదురు.

7. భర్తలారా! అట్లే మీరును మీ భార్యలు జీవము అను కృపావరములో మీతో పాలివారై ఉన్నవారని ఎరిగి సగౌరవముగను, ఉదారముగను వారితో జీవింపుడు. స్త్రీలు అబలలని మీరు ఎరుగుదురు గదా! మీ ప్రార్థనలకు ఏదియు అడ్డురాకుండ ఇట్లు చేయుడు.

8. కడన, మీరు అందరును ఏకమనస్కులును, ఏకాభిప్రాయము కలవారునై ఉండుడు. పరస్పరము సోదర ప్రేమ కలిగి ఉండుడు. కరుణ, వినయము కలవారై అన్యోన్యతను ప్రదర్శింపుడు.

9. కీడుకు కీడు, దూషణకు దూషణ చేయకుడు, అందుకు మారుగ ఆశీర్వదింపుడు. ఏలయన, దేవుడు మిమ్ము పిలిచి నపుడు మీకు ఒసగిన వాగ్దానము ఆశీర్వచనమే గదా!

10. “ఆనందమయమైన జీవితమును, సుఖప్రదమైన దినములను ఆశించు వాడెవడును దుర్భాషలాడరాదు, అసత్యము పలుకరాదు.

11. అట్టివాడు కీడునుండి మరలి మేలొనర్పవలెను. అతడు శాంతి నన్వేషించుచు దానినే అనుసరింపవలెను.

12. ఏలయన, మంచివారిని దేవుడు కనిపెట్టుకొని ఉండును. వారి ప్రార్థనలను ఎల్లవేళల ఆలకించును. కాని దుష్టులకు దేవుడు విరోధి అగును"

13. మంచిచేయవలెనని మీకు ఆసక్తియే ఉన్నచో మీకు హానిచేయునది ఎవ్వడు?

14. ఒకవేళ మంచి చేయుటలో మీకు కష్టములే సంభవించినను మీరు ఎంత ధన్యులు! వారి బెదరింపులకు భయపడకుడు, కలవరపడకుడు.

15. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగ ప్రతిష్ఠించు కొనుడు. మీ యందున్న నమ్మ కమును గూర్చి ఎవరేని ప్రశ్నించినచో సమాధానమునొసగ సర్వదా సంసిద్ధముగ ఉండుడు.

16. దానిని మర్యాదగ, సగౌరవముగ చేయుడు. మీ అంతఃకరణమును నిర్మలముగ ఉంచుకొనుడు. ఏలయన, మిమ్ము ఎవరైన దూషింతురనుకొనుడు. అప్పుడు క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తనను గూర్చి చెడుగ మాటలాడు ఆ వ్యక్తులు, తమ పలుకులకు తామే సిగ్గుపడుదురు గదా!

17. అదియే దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దాని కంటె మంచి చేసినందులకు బాధలనొందుటయే మేలు.

18. ఏలయన, క్రీస్తు కూడ మృత్యువు పాలయ్యెను గదా! ఆయన ఒకేసారి పాపములకై మర ణించెను. దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అటుల చేసెను. శారీరకముగ ఆయన మరణించెను. కాని ఆధ్యాత్మికముగ సజీవుడే.

19. ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపమున వెళ్ళి వారికి బోధించెను.

20. నోవా ఓడను నిర్మించుచున్న రోజులలో దేవునకు విధేయులుకాని వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచియుండెను గదా? ఓడయందలి కొద్దిమందియే, కేవలము ఎనిమిది మంది మాత్రమే, జలముచే రక్షింపబడిరి.

21. ఈ జలము జ్ఞానస్నాన సూచకమగు ఒక చిహ్నము. నేడు ఈ జ్ఞానస్నానమే మిమ్ము కాపాడును. కాని కేవలము శారీరక శుద్దిచే కాదు. పవిత్రమగు అంతఃకరణముచే దేవునికి చేయబడిన వాగ్దానము ద్వారా అది మిమ్ము రక్షించును. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా జ్ఞాన స్నానము మిమ్ము రక్షించును.

22. ఆయన పరలోక మున చేరి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. దేవదూతలును, అధికారులును, శక్తులును ఆయనకు లోబడియున్నారు.