ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1st John chapter 3 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన 1వ లేఖ 3వ అధ్యాయము

 1. తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు! ఆయన యొక్క మిక్కుటమగు ప్రేమవలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగ మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు. అందువలననే అది మనలను కూడ ఎరుగదు.

2. ప్రియులారా! మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని, ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చునపుడు ఆయన యథార్గ రూపమును మనము చూతుము. కనుక, ఆయనవలె అగుదుము అని మాత్రము మనకు తెలియును.

3. క్రీస్తుయందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు, క్రీస్తు పవిత్రుడైనట్లే, తనను పవిత్రునిగ చేసికొనును.

4. పాపము చేయు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషియగును. ఏలయన, చట్ట ఉల్లంఘ నమే పాపము.

5. పాపములను తొలగించుటకే క్రీస్తు అవతరించెననియు, ఆయనయందు ఎట్టి పాపమును లేదనియు మీరు ఎరుగుదురు.

6. క్రీస్తుయందు జీవించు ఎట్టి వ్యక్తియు పాపజీవితమును కొనసా గింపడు. పాపము చేయువాడెవడును ఆయనను ఎన్నడును చూడలేదు, ఎరుగలేదు.

7. చిన్నిబిడ్డలారా! ఎవరును మిమ్ము మోసగింపకుండ చూచుకొనుడు. క్రీస్తు నీతిమంతుడైనట్లే, సత్ర వర్తనగల ప్రతివ్యక్తియు నీతిమంతుడే.

8. సైతాను ఆదినుండియు పాపము చేయుచుండెను. కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును. సైతాను కృత్యములను నశింప చేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను.

9. దైవ ప్రకృతి అతనియందు ఇమిడి ఉండుట వలన, దేవుని బిడ్డయగు ఏ వ్యక్తియు పాప కృత్య ములను కొనసాగింపడు. దేవుని బిడ్డ అగుట వలన అతడు పాపమును చేయజాలడు.

10. దేవుని బిడ్డలకును, సైతాను బిడ్డలకును గల తారతమ్యము ఇట సుస్పష్టము. సత్కార్యములు చేయనివాడును, తన సోదరుని ప్రేమింపనివాడును దేవుని బిడ్డడు కాడు.

11. మనము ఒకరినొకరు ప్రేమింపవలెనని అనునదియే అనాదినుండియు మనము వినుచున్న సందేశము.

12. దుష్టునితో ఏకమై తన సహోదరునే చంపిన కయీనువంటి వారము కారాదు. కయీను తన సహోదరుని ఏల చంపెను? కయీను కార్యములు చెడ్డవనియు, అతని సహోదరుని కార్యములు మంచివియును అగుటచేతనే కదా?

13. కనుక సోదరులారా! లోకము మిమ్ము ద్వేషించినచో ఆశ్చర్యపడకుడు.

14. మృత్యువును వదలి జీవమున ఉంటిమని మనకు తెలిసినదే. సోదరులను మనము ప్రేమింతుము కనుక మనకు అది తెలియును. ప్రేమింపనివాడు ఎవ్వడైనను ఇంకను మృత్యువునందే ఉన్నాడు.

15. తన సోదరుని ద్వేషించు వాడు హంతయే. హంతకుడు నిత్యజీవమును కలిగి ఉండడని మీరు ఎరుగుదురు.

16. క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమస్వరూపము మనకు బోధపడినది. కనుక మనముకూడ మన సోదరుల కొరకై ప్రాణమును అర్పింపవలెను.

17. ఏ వ్యక్తియైనను ధనికుడై ఉండి కూడ అవసరములో ఉన్న తన సోదరుని చూచియు, తన హృదయ ద్వారమును మూసివేసికొనినచో తన హృదయమున దైవ ప్రేమ కలదని ఎట్లు చెప్పుకొనగలడు?

18. బిడ్డలారా! మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణములు మాత్రమే కాదు. అది చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలయును.

19. మనము సత్యమునకు చెందినవారమని ఇట్లు తెలిసికొనగలము. దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు.

20. మన హృదయములే మనలను అధిక్షేపించినచో, దేవుడు మన హృదయములకంటె అధికుడనియు సర్వజ్ఞుడనియు కూడ మనకు తెలియును.

21. కనుక ప్రియ స్నేహితులారా! మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును.

22. ఆయన ఆజ్ఞలకు విధేయులమై, ఆయనకు సంతోషము కలిగించు పనులు ఒనర్తుము; కావున, మనము కోరు సమస్తమును ఆయననుండి పొందెదము.

23. ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి, క్రీస్తు ఆజ్ఞాపించునట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలెనని దేవుని శాసనము.

24. దైవశాసనమునకు విధేయులగువారు దేవునియందును, దేవుడు వారియందును ఉందురు. ఆయన మనకు ఒసగిన ఆత్మవలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియును.